Apr 14,2021 20:08

స్వలింగసంపర్కుడైన సదమ్‌ ఎంతో వివక్షకు గురయ్యాడు. సమాజంలో ఎదగాలనే పట్టుదల ఉన్న తనలాంటి వారు మెరుగైన స్థితి కోసం (చదువు, ఉపాధి) పెద్ద నగరాలకు తరలిపోవడం చూశాడు. అయితే ఎంతకాలం... ఇంటి నుంచి బయటే ఉండిపోవడం... ఇవే సదమ్‌లో నిత్యం మెదులుతుండేవి. వివక్ష నుంచి దూరమయ్యేందుకు సదమ్‌ కూడా ముంబయికి చేరుకున్నాడు. అక్కడ కూడా ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ప్రాణం మీదికి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో తిరిగి తన సొంత ఇంటికి వచ్చేశాడు. విపరీత మానసిక ఒత్తిడితో జీవితాన్ని ముగించేసుకుందా మనుకున్న సమయంలో వైద్యులు ఇచ్చిన కౌన్సిలింగ్‌ అతనిలో గొప్ప మార్పు తీసుకొచ్చింది. అప్పుడే సరైన సూచనలు, మార్గదర్శకాలు లేకుండా జీవితాలను బలిచేసుకుంటున్న తనలాంటి ఎంతోమంది కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. మానసికంగా వారిని శక్తివంతంగా తయారుచేసేందుకు వాట్సాప్‌ గ్రూపును ప్రారంభించాడు. రాష్ట్రవ్యాప్తంగా 'ఎల్‌జిబిటిక్యూ' కమ్యూనిటి సభ్యులందరికీ దానిని చేరవేశాడు. ఆసక్తి ఉన్న వారు తమను తాము నిరూపించుకునేందుకు క్రీడల్లో శిక్షణ ఇస్తామని ప్రకటించాడు. ఇప్పుడు రాష్ట్రంలో యువత ప్రధానంగా ఆ సంస్థ పనిచేస్తోంది. వారిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.
వారికి సమాజంలో గౌరవస్థానం ఉండదు. నిత్యం అవమానాలే. గేలి చేసేవారే ఎక్కువ. ఇన్ని విపరీతాల మధ్యే తమకంటూ ఒక సుస్థిరస్థానం సంపాదించుకున్నారు ఎంతోమంది ట్రాన్స్‌జెండర్లు. వారికి నచ్చిన రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. విద్య, మోడలింగ్‌, రాజకీయాలు, డాక్టర్లు, లాయర్లు, బ్యూటీషియన్లు... ఇలా రకరకాల కేటగిరీలో ఎంతోమంది ప్రతిభతో ముందుకెళ్లడం మనకు తెలుసు. మరి క్రీడారంగంలో రాణిస్తున్న వారినెవరినైనా చూశామా? మణిపూర్‌లో 'యా ఆల్‌' అనే స్వచ్ఛంద సంస్థ ఆ దిశగా ప్రయత్నిస్తోంది. ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌ వంటి క్రీడల పట్ల ఆసక్తి ఉన్న ట్రాన్స్‌జెండర్లకు శిక్షణ ఇవ్వడమే కాక, పోటీల్లో పాల్గొనే వీలు కల్పిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని మెండుగా నింపుతోంది ఆ సంస్థ.
'ఏదైనా పండుగలప్పుడు చాలామంది రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. స్త్రీ, పురుషులు ఆటపాటలతో ఉత్సాహంగా గడుపుతారు. మరి ట్రాన్స్‌జెండర్ల సంగతి? ఈ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం ఉండదు. మరి వారి కల నెరవేరేదెప్పుడు? మా సంస్థ ద్వారా వారి కలలు నెరవేర్చాలనుకున్నాను' అంటారు 'యా ఆల్‌' వ్యవస్థాపకుడు సదమ్‌ హంజబామ్‌.

2018లో వచ్చిన తన ఆలోచనను రెండేళ్లలోనే ఆచరణలో పెట్టాడు సదమ్‌. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా అందులో సభ్యులుగా చేరారు. అలా శిక్షణ పొందిన బృందంతో ఓ ప్రత్యేక క్రీడా కార్యక్రమాన్ని రూపొందించాడు. ఇప్పుడు వారంతా పలు ఉత్సవాల్లో, వేడుకల్లో జరిగే క్రీడాపోటీల్లో పాల్గొంటూ తమ సత్తా చాటుతున్నారు. ఈ వేడుకలు సమాజంలో నెలకొన్న వివక్షను రూపుమాపడంలో ఎంతో కృషిచేస్తున్నాయి.
'ఎల్‌జిబిటిక్యూ కమ్యునిటీకి చెందిన వారిని క్రీడల్లో పాల్గొనేందుకు ఏ ఆర్గనైజేషన్‌ అంగీకరించదు. అందుకే నేనే ఓ ఆర్గనైజేషన్‌ స్థాపించాను' అంటారు సదమ్‌. గతేడాది ఫుట్‌బాల్‌ టీమ్‌లో ఓ 15 మంది ట్రాన్స్‌మెన్‌లను పరిచయం చేశారు సదమ్‌. అది బాగా విజయవంతమైంది. ఈ ఏడాది మార్చి వరకు వరుసగా నాలుగు క్రీడా కార్యక్రమంలో వారంతా పాల్గొన్నారు.

ya all

 

ya all2