Feb 23,2021 18:46

పిల్లలూ, ప్రపంచంలో వేలాది రైళ్లు ఉన్నాయి. అన్నింటిలో అతి పొడవైన రైలు ఏది? ఎక్కడ ఉందో తెలుసా?
చుక్‌చుక్‌మంటూ రైలు వెళుతుంటే సరదాగా పెట్టెలు లెక్కపెడతాం కదా? కానీ, ఆస్ట్రేలియాలోని ఓ రైలు పెట్టెలు లెక్కపెట్టాలంటే విసుగొచ్చేస్తుంది. ఎందుకంటే అది ప్రపంచంలోనే అతి పొడవైనది. దీనికి అమర్చిన పెట్టెలెన్నో తెలుసా? 682. ఏ రైలుకైనా ఇంజిన్‌ ఒకటి లేదా రెండు ఉంటాయి. మరి ఈ పొడవైన రైలు ఎనిమిది ఇంజన్లు ఉన్నాయి. 7.4 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఈ రైలు మొత్తాన్ని బరువు తూస్తే అది ఏకంగా 99 వేల 732 టన్నుల బరువుంది. అందుకే పొడవైన, బరువైన రైలుగా రెండు రికార్డులు సాధించింది.
ఆస్ట్రేలియాలోని అతి పెద్ద ఉక్కు సంస్థ వాళ్లు ఇనుప గనుల నుండి ముడి సరుకును రవాణా చేయడానికి దీనిని 2001లో తయారుచేయించారు. దీనివల్ల వాళ్లు ఒకేసారి 82 వేల టన్నుల ముడి ఇనుమును తరలించగలిగేవారు. రోజుకి 426 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే దీన్ని ఇప్పుడు ఉపయోగించకపోయినా రికార్డు మాత్రం అలాగే ఉంది. తరువాత అదే ఉక్కు సంస్థ మరో రైలుని తయారు చేసింది. అది సుమారు 72,191 టన్నుల బరువుతో 5.8 కిలోమీటర్ల పొడవు ఉంది. దీనిపెట్టెల సంఖ్య 540. దీనిని కూడా కొంత కాలం నడిపి ఆపేశారు.
ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో అతి పొడవైనదిగా పేరు తెచ్చుకున్నది ఆఫ్రికాలోని మౌరిటానియా దేశంలో ఉంది. దీని పొడవు 3 కిలోమీటర్లు. దీన్ని కూడా ఓ ఉక్కు సంస్థ వాళ్లే తయారు చేశారు. ప్రస్తుతం ఇది ప్రతి రోజు ముడి ఇనుమును 700 కిలోమీటర్ల దూరానికి తరలిస్తూ తిరుగుతోంది. దీనికి 4 ఇంజిన్లను వాడుతున్నారు. ఒక్కో పెట్టెలో 84 టన్నుల ముడి ఇనుము పడుతుంది.