Oct 12,2020 15:41
ఆటబొమ్మ (అనువాద కథ)

అంత పెద్ద సంచిని నడుం మీద పెట్టుకుని నడవడం కష్టంగా ఉంది యమునవ్వకి. జారిపోతున్న సంచిని పైకి ఎగదోసుకుంటూ ఆపసోపాలు పడుతూ టౌన్‌ బస్టాండ్‌కి చేరుకుంది. సంచి కిందకి దింపి ఉస్సురని నిట్టూర్చి కొంగుతో చెమట తుడుచుకుంది. ఆ సంచిలో పెద్ద సంసారమే ఉంది. బియ్యం, పోకచెక్కలు, ఎండుకొబ్బరి, పసుపు, ఉప్పుడు బియ్యం, బ్రెడ్‌ పాకెట్లు, పిల్లల కోసం గిలక్కాయలు, బ్రెడ్‌, బిస్కట్‌ పాకెట్లు ఇరుక్కుని ఉన్నాయి. ఆ సంచిని చూస్తే కొన్ని యుగాల నుంచి ఆమెకి తోడుగా ఉందేమో అనిపిస్తుంది. దానికి ఎంత చరిత్ర ఉందంటే పొరపాటున బస్సులోగానీ మనగుండి బస్టాండ్‌లోని ఏ మూల పెట్టి మరిచిపోయినా ఎంత సేపయినా అది అక్కడే ఉంటుంది.


''ఇది యమునవ్వ సంచి, తను ఇక్కడే ఎక్కడో ఉంటుంది, ఏ క్షణమైనా వచ్చేస్తుంది.'' అని చూసిన వాళ్ళంతా నమ్మకంగా చెపుతారు. అంతేకాకుండా అందులో అపురూపమైన నిధి నిక్షేపాలున్నట్లు ఒక కన్నేసి కాపలా కాస్తారు.


ఆ సంచి చాలా రోజుల నుంచీ వాడుతున్నట్లుగా దాని మీదున్న ఎంబ్రాయిడరీ బొమ్మలు మాసిపోయాయి. వాటి ఎరుపు, ఆకుపచ్చ రంగులు వెలిసిపోయాయి. అది తనదే కాదు, తన యజమాని పేదరికాన్నీ ఎత్తి చూపుతున్నట్లు ఉంటుంది. ఆ సంచి ఎలాగయినా ఉండనీ, దాని వైభోగం ఎంతటిదీ అంటే అది యమునవ్వ చేతిలోనో, నడుం మీదో, తలపైనో, ఒడిలోనో దర్జాగా ఉంటుంది. కాలంతో నిమిత్తం లేకుండా ఆమెని అంటిపెట్టుకుని ఉంటుంది.


నీరు నిలవ ఉండటం వల్ల బస్టాండ్‌ దగ్గరి రోడ్డు చాలా పాడయిపోయింది. తారు కరిగిపోయి గులక రాళ్ళ వంటివి పైకి తేలాయి. ఆ ఎగుడుదిగుడు నేలకి ఒక పక్కగా సంచిని పెట్టి, రాతిని మోపు చేసుకుని విశ్రాంతిగా కూచుంది యమునవ్వ. బస్సులు వస్తున్నాయి, పోతున్నాయి. తొలగదోయ సందు లేనట్లు ఉంది. బస్సు వచ్చినపుడల్లా ఎక్కడానికి పోటీ పడే ప్రయాణీకులతో రణరంగం మాదిరిగా ఉంటోంది. తల్లుల చంకన ఉన్న బిడ్డలు తోపులాటల్లో నలిగిపోయి కీసరబాసరగా ఏడుస్తున్నారు. ఊపిరి తీసుకోడానికీ వీలు కానంత కిక్కిరిసిపోయి ఉందక్కడ. పిల్లలని గానీ ఆడవాళ్ళని గానీ చూడకుండా మగవాళ్ళు అందరినీ నెట్టేసుకుంటూ బస్సులో దూరుతున్నారు.


ఎవరూ యమునవ్వ వంక కూడా చూడటం లేదు. కనికరం చూపి బస్సు ఎక్కిస్తే ఎక్కడ తమ సీటు ఖాళీ చేసి ఆమెకి ఇవ్వాల్సి వస్తుందోనని వారి భయం. అంతేకాకుండా వేరే కారణం కూడా ఉంది. మునుపటి రోజులలో దయగల మారాజులు తమ పక్క సీటు ఆమెకి ఇచ్చి, మేలు చేసిన చనువుతో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించబోయేవారు. ఇక చూడాలి, నా సామిరంగా! రక్తాలు కారేంతగా వాళ్ళ ముక్కు పచ్చడి చేసేది. యమునవ్వ నుంచి ఏమీ ఆశించకూడదని వాళ్ళు ఈ రకంగా గుణపాఠం నేర్చుకున్నారు. అంతేకాదు, ఈ పిచ్చిదానికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని కూడా అనుకున్నారు.


అయితే ఇతరులను ఆశ్చర్యపరిచిన విషయం మరోటి ఉంది. మొదట యమునవ్వకి తాళి గట్టిన భర్త 'మాదేవ' ఇంకో పెళ్లి చేసుకుని ఆ పెళ్ళాన్ని వెంటబెట్టుకుని అదే బస్సు ఎక్కాడు. ఆ మొగుడూపెళ్ళాలు ఒకే సీటులో అతుక్కుని కూచున్నా యమునవ్వ నిర్లిప్తంగా చూస్తూ ఊరుకుంటుంది తప్ప వాళ్ళతో జగడం వేసుకోదు. దానికి వీళ్ళంతా ఏవనుకుంటారంటే, 'యమునవ్వ మొగుడిని కాదు కదా, కన్నవాళ్ళను కూడా గుర్తుపట్టలేదు' అని. కానీ ఆమె, మాదేవని బస్సులో గానీ ఊరి మొగదల వద్ద గానీ చూసినపుడు మాత్రం చీర కొంగు తల మీద కప్పుకుని, తల వంచుకుని పక్కకి తొలుగుతుంది. కొన్నిసార్లు అతని కొత్త భార్య వైపు తదేకంగా చూస్తూ ఏదో చెప్పాలనుకుంటుంది, అంతలోనే ఆగిపోతుంది.


మొదట్లో అందరూ యమునవ్వ దగ్గరకి వెళ్లొద్దని కొత్త భార్యని భయపెట్టేవారు. అలాంటి ఇలాంటి బెదిరింపులు కావు, 'దగ్గరగా వెళితే నీ మెడ విరిచేస్తుంది, నీ చెవులు కోసి నీ చేతుల్లోనే పెడుతుంది, నీ చీర లాగేసి చింపి పోగులు పెట్టి నిన్ను నగంగా ఊరేగిస్తుంది' అనేవారు. రెండవ భార్యగా రావడం వల్ల ఆ అమ్మాయి మరింత భయపడిపోయింది. ఎంతగా అంటే పెళ్ళయ్యాక ఏడాది పాటు ఆమె ఇల్లుదాటి బయటకి వచ్చి ఎరగదు. కానీ ఎంత కాలమని నాలుగ్గోడల మధ్య ఉండగలదు? క్రమేణా ధైర్యం కూడగట్టుకుంది. మెల్లిగా గడప దాటడం మొదలుపెట్టింది.


ఒకసారి ఆమె యమునవ్వ సమీపంలోకి వెళ్ళాల్సి వచ్చింది. అపుడామె గుండె గుబగుబలాడింది. అయినా సరే ఆసక్తిగా అనిపించింది. వెనక్కి తిరిగి మరీ ఆమెని చూసింది. యమునవ్వ తలలోని మల్లెపూల మీద పడింది కొత్త భార్య చూపు. అవి వాడిపోయి ఉండటం చూసి బితుక్కుమంది ఆమె మనసు. అప్రయత్నంగా తన తల తడుముకుంది. ఏదో రకంగా తన మనసు యమునవ్వతో ముడిపడినట్లూ ఆమె తన పెద్దక్క అన్నట్లూ కొత్త భార్యకి అనిపించింది. ఉన్నట్లుండి యమునవ్వని గట్టిగా కావలించుకుని బిగ్గరగా ఏడవాలనిపించింది. అలా చేస్తే తను కూడా పిచ్చిదని జనాలు అనుకుంటారేమోనని భయపడి, కొంగు చాటు చేసుకుని కన్నీళ్లు తుడుచుకుంది. ఇంత అందంగా ఉన్న ఈవిడ పిచ్చిదంటే నమ్మడం ఎలా?! జనాలంతా అబద్ధాలు చెపుతున్నారా? అని ఆమెకి సందేహం వచ్చింది.


***


యమునవ్వకి ఆధారం కోసం ఆమె తండ్రి రెండు గదుల ఇల్లు ఇచ్చాడు. అది పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు. అదొక్కటి ఉంటే జీవితం గడవదు. తినడానికి ఏదో ఒక పని చేయాలి కదా! అటువంటి సమయంలో రంగన్న మాస్టర్‌, ఆధ్యాత్మిక ట్రస్ట్‌ పెద్ద - బసవలింగ స్వామి ఆమెకి ఆదరువు చూపించారు. లేకపోతే ఎపుడో మట్టిలో కలిసిపోయి ఉండేది. తన బడిలో పిల్లలని చూసుకునే ఆయా పని అప్పగించాడు రంగన్న మాస్టర్‌. ఆ పని ఆమెకి చాలా సంతోషాన్ని ఇచ్చింది. పిల్లలతో గడపడం ఇష్టంగా ఉండేది. వారికి ప్రేమతో తినిపించి ముడ్డీ మూతీ కడిగి, లాలించేది. పిల్లలు ఏడుస్తుంటే ఊరుకోబెట్టడానికి లాలిపాటలు పాడేది. ఇంత బాగా చూసుకునే యమునవ్వని పిల్లలు 'టీచర్‌' అని పిలవడం మొదలుపెట్టారు.


ఇదంతా కొంతమంది పేరెంట్స్‌కి నచ్చలేదు. ఒక పిచ్చిది తమ పిల్లల్ని ముట్టుకోవడం, వారిని చూసుకోవడం నచ్చడం లేదని ఒక పేరెంట్‌, బడి అభివృద్ధి కమిటీకి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో బసవలింగ స్వామి జోక్యం చేసుకున్నాడు.


''యమునవ్వ ఎంత మంచిదో మీకు తెలీదు. తనకన్నా కూడా ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తుంది. ఆమెని పిచ్చిది పిచ్చిది అంటూ ఉంటే పరిస్థితి మరింత దిగజారుతుంది తప్ప బాగుపడదు. ఈ విషయాలన్నీ నాకు వదిలేయండి. ఇవన్నీ చక్కదిద్దే బాధ్యత నాది. పిచ్చి ఆలోచనలతో మనసులు పాడు చేసుకోవద్దు'' అని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇది కొన్ని అనుమానాలకి తావిచ్చింది. ఈ స్వామికి ఈ విషయంతో ఏదో మతలబు ఉందని గుసగుసలు పోయారు.


చాలా త్వరలోనే ఎలానో ఏమో అందరూ యమునవ్వ గురించి మంచి మాటలు మొదలుపెట్టారు. అసలకి ఆమెని మించినవాళ్ళు లేరనే పొగడ్త కూడా వినబడింది. ఆమె మాత్రం ప్రతిరోజూ పిల్లల ఇళ్ళకి వెళ్లి స్వయంగా వెంటబెట్టుకుని బడికి తీసుకు వచ్చేది. పిల్లలు ఆటల్లో సరదాగా ఉంటే చాలు అమితమైన గారాబం చేసేది. పెద్దవాళ్ళు ఏవన్నా పనుల మీద దూరం వెళ్తున్నపుడు తమ పిల్లల్ని యమునవ్వ దగ్గర ఉంచడం మంచిదన్న నమ్మకానికి వచ్చారు.


***


రెండో పెళ్లి చేసుకున్న మాదేవకి కొత్త భార్య ద్వారా కొడుకు పుట్టాడు. పిల్లవాడికి మూడేళ్ళు నిండాక యమునవ్వ బడిపంతులుతో కలిసి భర్త దగ్గరకి వెళ్లి, పిల్లవాడిని తమ బళ్ళో వేయమని కోరింది. ఆమె అడిగినపుడు మాదేవకి దు:ఖంతో కళ్ళు మసకలు కమ్మాయి. అతనికి ఇపుడు ఆమె పట్ల అయిష్టత ఏమీ లేదు. ఆమె కోరికని అంగీకరించాడు కూడా. తన బిడ్డ యమునవ్వ దగ్గర క్షేమంగా ఉంటాడని తెలుసు కనుక అతని కొత్త భార్య కూడా సంతోషంగా అంగీకరించి, కృతజ్ఞత చూపింది. ఇదంతా యమునవ్వ నిర్లిప్తంగా చేసింది. అది తన ఇల్లని, తను అంతకుముందు అక్కడ కాపురం చేసిందన్న విషయం కూడా ఆమె గుర్తు చేసుకోలేదు.
మిగతా పిల్లల్ని తీసుకురావడానికి, దింపడానికి వెళ్ళిన సందర్భాల్లో ఆ ఇల్లు కనపడినపుడు కాసేపు ప్రేమగా పరికించి చూసేది. యమునవ్వని ఇలా చూస్తున్నపుడు 'మాదేవ'కి పశ్చాత్తాపంగా ఉండేది. యమునవ్వలో ఇంత మార్పు వస్తుందని ఊహించి ఉంటే అసలు రెండో పెళ్లి చేసుకుని ఉండేవాడిని కాదని విచారంగా అనుకుంటాడు.


కానీ అపుడపుడూ పిచ్చిపట్టిన దానిలా ఎందుకు ఊరంతా తిరుగుతూ ఉంటుందో ఎవరికీ తెలీదు. చిన్న విషయానికి కూడా ఎందుకు రోజంతా కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుందో కూడా తెలీదు. ఇరుగు పొరుగు మాత్రమే కాకుండా ఊళ్ళో వాళ్ళు కూడా ఆమెని అనునయించడానికి చూసేవారు. ఆమెకి నయం కావడానికి తమకి తెలిసిన ప్రయత్నాలు చేసేవారు. ధార్వాడ్‌లో ఉన్న మంచి న్యూరాలజిస్ట్‌లకి కూడా చూపించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.


***


కొన్నేళ్ళ కిందట యమునవ్వ చిట్టి తమ్ముడు చనిపోయాడు. అతను లేని శూన్యం ఆమె హృదయం అంతా ఆవరించి ఉండేది. అన్ని చోట్లా అతని కోసం వెతుకుతూ ఉండేది. ఇదంతా చూసి చూసి విసుగు పుట్టి మాదేవ ఒకసారి మందలించినపుడు, 'మా తమ్ముడు కనపడకపోవడం ఇంత చిన్న విషయమా? మీరిలా చేయడం సబబేనా?' అని గట్టిగా అడిగింది యమునవ్వ. అపుడు మాదేవ ఆమె చెంప మీద కొట్టి 'తిరిగి రాని తమ్ముడి కోసం భర్తని అలక్ష్యం చేయడం మాత్రం సరయినదా?' అన్నాడు. ఆ క్షణంలో అతను తన భర్త అని గుర్తించడానికి కూడా వీలు లేనంతగా కొయ్యబారిపోయింది. ఖాళీ కళ్ళతో చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళు కత్తుల్లా మారి తనని పొడిచినట్లు అనిపించింది మాదేవకి.


***


యమునవ్వ తను ఎక్కాల్సిన బస్‌ కోసం ఎదురుచూస్తూ కూచున్నపుడు ఏవో ఆలోచనలతో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. వందలాది మందితో నిండిన ఈ బస్టాండ్‌లోనే తన జీవితంలో భయంకరమైన చీకటి రోజు వంటిది అనదగినది వచ్చింది. అప్పటికి ఆమెకి పెళ్ళయి ఏడాది అయి ఉంటుంది. యమునవ్వ ఆ కుటుంబంలో పెద్దకూతురు, ఆమె తర్వాత ఎన్నో ఏళ్ళకి దేవుడి దయవలన తల్లికి చిన్నారి ప్రశాంత్‌ పుట్టాడు.


ఒకరోజు వాళ్ళంతా యమునవ్వ అమ్మమ్మ గారింటికి వెళ్ళడానికి బస్టాండ్‌కి వచ్చారు. వాళ్ళమ్మ పూలూ పళ్ళూ కొనడానికి వెళ్తూ పిల్లాడిని చూసే బాధ్యత యమునవ్వకి అప్పగించింది. అక్కడంతా జనాలతో నిండిపోయి ఉంది. అక్కడ ఉన్న పెద్ద చెత్త కుప్ప దగ్గర ఎవరో మూత్ర విసర్జన చేస్తున్నారు. అది చూసి ప్రశాంత్‌ కూడా అక్కకి చిటికెన వేలు పైకి చూపించాడు. ఆ పిల్లాడిని అక్కడికి వెళ్ళమని చెప్పింది యమునవ్వ. దూరం నుంచి పిల్లాడిని చూస్తూ నిలబడింది. ఇంతలో వాళ్ళిద్దరి మధ్యకి ఒక బస్సు వచ్చి ఆగింది. ఒకవైపు బస్సెక్కడానికి జనాలు కొట్టుకుంటుంటే ఇంకోవైపు పిల్లాడు మూత్ర విసర్జన చేస్తున్నాడు. అరుపులు పెడబొబ్బలు సాగుతూనే ఉన్నాయి.


బస్సు కదిలి వెళ్ళాక చెత్త కుప్ప వైపు చూసి గతుక్కుమంది యమునవ్వ. అక్కడ పిల్లాడు లేడు, ఆమెకి ఆపుకోలేనంత ఏడుపు, కంగారు పుట్టాయి. 'పరస్య, పరస్య' అని అరుస్తూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. తల్లి వచ్చి పిల్లాడు కనపడకపోవడం చూసి ఆపుకోలేని ద్ణుఖం, కోపంతో యమునవ్వని చితకబాదింది. 'నా గారాబు కొడుకుని మింగిన దయ్యానివి నువ్వు' అని శాపనార్థాలు పెట్టింది. ఎన్ని చోట్ల, ఎంత వెతికినా పిల్లాడి ఆచూకీ మాత్రం దొరకలేదు.


జనాలు యమునవ్వని రకరకాలు మాటలు అనేవారు. పూర్వీకుల ఆస్తి మీద కన్నేసి యమునవ్వే పిల్లాడిని ఎక్కడో వదిలేసిందని కొందరు చెప్పుకునేవారు. మరికొందరేమో ఒకడుగు ముందుకేసి, 'పిల్లాడిని బావిలోకి తోసి చంపేసిందని' చెప్పుకునేవారు. తల్లి మాట్లాడే ప్రతీ మాటా ఆమెని దోషిగా నిరూపించేది. తన గారాబు కొడుకు గురించిన మనేదతోనే తల్లి ఏడాది తిరిగేలోపు చనిపోయింది. ఒంటరిగా మిగిలిన తండ్రి పెద్దగా మాట్లాడేవాడు కాదు.


యమునవ్వ కొన్నిసార్లు తల్లి ఫోటో ముందు కూర్చుని 'అమ్మా! ఇదుగో చూడు, తమ్ముడు దొరికాడమ్మా! నేనే వెతికి పట్టుకుని వాడిని మీ దగ్గరకు తీసుకువచ్చాను!'' అని వారం సంత నుండి తెచ్చిన ఆటబొమ్మని కదిలించేది. ఎందుకో మరి అది ఏ విధమైన శబ్దం చేసేది కాదు.


తలుపు దగ్గర నిలబడి పిల్లాడి కోసం ఎదురుచూస్తూ ఉండేది. 'వాడు బడికి వెళ్ళాడు, తిరిగి వచ్చే సమయం అయింది' అంటూ ఉండేది. పిల్లలు బడికి వెళ్లి తిరిగొచ్చేవేళ రోడ్డు వంకే చూస్తూ ఉండేది. వారానికో పది రోజులకో వారం సంతకి వెళ్ళినపుడు బస్టాండ్‌ దగ్గరున్న చెత్తకుప్ప దగ్గరికి వెళ్లి తమ్ముడి కోసం వెతుకుతూ ఉండేది. కొన్నిసార్లు ఏడుస్తూ అక్కడే కూలబడేది. అపుడు చుట్టూ ఉన్నవాళ్ళు ఆమెని ఓదార్చి బస్సెక్కించి, ఆ పెద్ద సంచిని జాగ్రత్తగా ఆమె పక్కన ఉంచేవారు.


అది యమునవ్వ వాళ్ళమ్మ తాను స్వయంగా అల్లి కూతురికి ప్రేమగా ఇచ్చిన సంచి.


ఆ హడావిడిలో బస్సెక్కే వాళ్ళందరినీ కలియజూస్తూ సంచిలోని ఆటబొమ్మని బైటకి తీసి కదిలిస్తూ యమునవ్వ చెప్పిందీ...
''తమ్ముడు పెద్దవాడయ్యాడు కానీ నన్ను మాత్రం గుర్తు పట్టడం లేదు.''


కన్నడ మూలం : డా: బసు బెవినగిడద్‌
తెలుగు అనువాదం : కె.ఎన్‌.మల్లీశ్వరి

[email protected]