Apr 08,2021 19:07

లండన్‌ : ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా కట్టడికి ఆయా దేశాలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. అయితే కోవిడ్‌ టీకాల్లో ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నవారిలో సైడ్‌ ఎఫెక్స్‌ వస్తున్నాయని, ముఖ్యంగా కొందరిలో రక్తం గడ్డకట్టినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. దీనిపై యూరోపియన్‌ యూనియన్‌ వైద్య నియంత్రణ సంస్థ ఓ ప్రకటన చేసింది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడం అనేది అత్యంత అరుదుగా నమోదయ్యే సైడ్‌ ఎఫెక్ట్‌ అని మెడిసిన్స్‌ రెగ్యులేటర్‌ పేర్కొన్నది. ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్న 86 కేసులను పరిశీలించిన తర్వాతే యురోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ ఆ అధ్యయన నివేదికను వెల్లడించింది. ముఖ్యంగా బ్లడ్‌ క్లాటింగ్‌ జరిగిన కేసుల్లో ఎక్కువశాతం మంది 60 ఏళ్ల లోపు మహిళలే ఉన్నట్లు ఈఎంఏ పేర్కొన్నది. ఈ టీకా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఇవ్వడం వల్ల బ్రిటన్‌ ప్రభుత్వం 30 ఏళ్ల లోపు వారికి ఆస్ట్రాజెనికా బదులుగా మరో వ్యాక్సిన్‌ను ఇవ్వనుంది. ఇప్పటి వరకు యూరోప్‌ దేశాల్లో సుమారు 2.5 కోట్ల మందికి ఆస్ట్రాజెనికా టీకా వేశారు. మార్చి నెల చివరి నాటికి బ్రిటన్‌లో 79 మందికి బ్లడ్‌ క్లాటింగ్‌ లక్షణాలు కనిపించాయి. వీరిలో 19 మంది మరణించారు.
ఆస్ట్రాజెనికా టీకాపై యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ (ఈఎంఏ) కమిటీ ఓ హెచ్చరిక కూడా చేసింది. ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నవారిలో రెండు వారాల్లోగా రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ సంఖ్య క్రమంగా పడిపోతుందని వెల్లడించింది. ఈ అంశం పట్ల ఆ వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇప్పటి వరకు బ్లడ్‌ క్లాటింగ్‌ కేసులు ఎక్కువగా 60 ఏళ్ల లోపు ఆడవారిలో నమోదు అయ్యాయని, ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం ఇతర సైడ్‌ఎఫెక్ట్స్‌ ఏమీ లేవని ఈఎంఏ చెప్పింది. ఒకవేళ ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నవారిలో ప్లేట్‌ లెట్స్‌ తగ్గినట్లు గుర్తిస్తే, వాళ్లు వెంటనే డాక్టర్లను సంప్రదించాలని కూడా ఈఎంఏ సూచన చేసింది. మెదడులో ఉండే సిరలు(వెయిన్స్‌, సెరిబ్రల్‌ వీనస్‌ సైనస్‌ థ్రాంబోసిస్‌), ఉదరం(స్పాంచ్‌నిక్‌ వీన్‌ థ్రాంబోసిస్‌), ధమనుల్లో పలు చోట్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉన్నదని ఈఎంఏ కమిటీ పేర్కొన్నది. సెరిబ్రల్‌ వీనస్‌ సైనస్‌ థ్రాంబోసిన్‌కు చెందిన 62 కేసులను, స్పాన్‌చిక్‌ వీన్‌ థ్రాంబోసిస్‌కు చెందిన 24 కేసులను పరిశీలించారు.