Jul 31,2021 07:30

గువహటి : అసోం, మిజోరాం సరిహద్దుల్లో నెలకొన్న వివాదం ఘటనలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత విశ్వ శర్మపై మిజోరాం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అదేవిధంగా హిమాంత పాలనా యంత్రాంగంలోని ఆరుగురు ఉన్నతాధికారులతో పాటు 200 పోలీసుల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో జోడించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనబడిన వారిలో అసోం ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌, కాచార్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ కూడా ఉన్నారు. అసోంలోని కచార్‌ సరిహద్దుల్లో ఉన్న మిజోరాంలోని కొలసిబ్‌ జిలాల్లలోని వైరంగ్టే పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, అసోం పోలీసులు సైతం రాష్ట్రానికి చెందిన ఎంపితో పాటు ప్రముఖులకు సమన్లు జారీ చేశారు. ఈ సమన్లు అందించేందుకు న్యూఢిల్లీలోని ఎంపి నివాసాలకు పోలీసులు వెళ్లారు.
సరిహద్దుల విషయంలో ఎన్నో ఏళ్లుగా వివాదం నలుగుతున్నా...తీవ్ర స్థాయికి చేరింది మాత్రం ఈ సోమవారమే. కాచార్‌, కొలసిబ్‌ జిల్లాల మధ్య సరిహద్దు విషయంలో ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణల్లో ఆరుగురు అసోం పోలీసులు చనిపోగా..అనేక మంది గాయపడిన సంగతి విదితమే. ఈ ఆందోళనలకు మీరంటే మీరు కారణమని ఇరు రాష్ట్రాలు పరస్పర విమర్శలకు చేసుకుని..కేసులు పెట్టుకునేంత వరకు వచ్చాయి. ప్రస్తుతం అక్కడ ప్రశాంతత నెలకొన్నప్పటికీ...కేంద్ర భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. సుమారు 500 వందల మంది భద్రతా బలగాలు ఉన్నాయి.