Oct 24,2021 13:03

సమాజంలో చోటుచేసుకునే హింసకు, బేధాలకు ఎక్కువగా ప్రభావితమయ్యేది స్త్రీ. ముఖ్యంగా అమ్మ. హింస, తేడాలు లేని గొప్ప సంఘాన్ని స్థాపించగల శక్తి ఆమె సొంతం. ఇందుకు తల్లులందురూ ఏకమవ్వాలి, మహిళ నాలుగు గోడలకు పరిమితం కాకూడదు. సమాజాన్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, తమ అభిప్రాయాలను గొంతెత్తి చెప్పాలి. అలా ఓ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మహిళ చేసిన ప్రయత్నమే ఈ చిత్ర కథ. పురోగతి చెందే సమాజంలో మహిళ ప్రధాన భాగం కావాలనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం 'ఇట్లు అమ్మ'.. ఓటీటీ వేధిక సోని లివ్‌లో విడుదలైన ఈ చిత్రం విశేషాలేంటో తెలుసుకుందాం..!

టైటిల్‌ : ఇట్లు అమ్మ..
తారాగణం : రేవతి, పోసాని కృష్ణమురళి,
రవి కాలే, ప్రశాంత్‌, మిహిరV్‌ా, వినీత్‌ సాయి, అరువి బాల తదితరులు
ఎడిటర్‌ : ప్రవీణ్‌ పూడి
సంగీతం : సన్నీ ఎం.ఆర్‌
సినిమాటోగ్రఫీ : మధు అంబట్‌
నిర్మాతలు : బొమ్మకు మురళి
దర్శకత్వం : ఉమామహేశ్వరరావు సి
ఓటీటీ : సోనీ లివ్‌
విడుదల తేదీ : 8 అక్టోబర్‌ 2021

కథలోకి వెళ్తే.. భర్తను కోల్పోయిన స్త్రీగా, తన కొడుకే లోకంగా బతికేస్తుంటుంది తల్లి బాల సరస్వతి (రేవతి). వారు నివసించే నగరంలో ఓ రోజు తుఫాను పడుతుంది. అదే సమయంలో రాత్రి వర్షంలో చిక్కుకుపోయిన కొడుకు ఇంటికి వెళ్లే క్రమంలో హత్యకు గురవుతాడు. పొద్దుపోయినా కొడుకు ఇంటికి చేరలేదని కంగారు పడుతూ పొరిగింట్లో తన బాధను చెప్పుకుంటుంది. వర్షం పడుతుంది కాబట్టి ఏ నీడనో ఉండి ఉంటాడని వారు ధైర్యం చెబుతారు. కట్‌ చేస్తే..ఉదయం పోలీసులు వచ్చి మృతదేహం వద్దకు తీసుకెళ్తారు. అనూహ్య పరిస్థితుల్లో బిడ్డను కోల్పోయిన సరస్వతి కొడుకు మృతికి తల్లడిల్లిపోతుంది. తన కొడుకును ఎవరు? ఎందుకు? చంపారనే ప్రశ్నలు ఆ తల్లిని నిద్ర పోనీయవు. అందుకే ఎలాగైనా తన కొడుకును పొట్టనపెట్టుకున్న వారి గురించి తెలుసుకోవాలనుకుని రోడ్డు మీదికి వస్తుంది. పోలీసులకు ఎంత మొరపెట్టుకున్నా ఫలితం కనిపించదు. తానే ఎలాగైనా తన బిడ్డ హత్యకు కారణాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. గాంధీజీ 'సత్యశోధన' నుంచి అంబేడ్కర్‌, గోర్కి వరకూ ఎందరినో చదువుతుంది. ఈ క్రమంలో ఎదురైన మనుషుల నుంచి ఎంతో నేర్చుకుంటుంది. అలా సత్యం కోసం అన్వేషిస్తుంది. తెలుసుకుంటుంది. ఎందరినో ఆ మార్గంలో నడపటానికి ఉద్యమిస్తుంది. అయితే తన కొడుకును చంపిందెవరు..? సమాజం పట్ల ఆమె ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? ఎలాంటి విషయాలను తెలుసుకోగలిగింది? ఆ తర్వాత తను ఓ పోరాట యోధురాలిగా ఎలా మారుతుంది? ఆ ప్రయాణంలో ఆమెకి ఎదురైన సవాళ్లేంటి? తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంది? తన కొడుకుతో పాటు, నేరస్తుడికి పట్టిన దురవస్థకు కారణాలను అన్వేషించే క్రమంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు ఏంటి? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే.
    పెరుగుతున్న జనాభా మూలాన హంతకులను పట్టుకోవటానికి అవుతున్న ఆలస్యం గురించి. వ్యవస్థ అసహాయత గురించి. ఈ ప్రాసెస్‌లో అమాయక పేదలకు పడుతున్న శిక్షలు, ఆకలి కేకలు, కార్పొరేట్‌ దోపిడీ అన్యాయం గురించి. ముఖ్యంగా మనిషి అంటే మనిషికి పట్టనితనం గురించి. ఇట్లా ఎన్నో సామాజిక సమస్యలను అసామాన్యంగా, చాలా గట్టిగా ఓ మార్గంలో నిలబెట్టి, ప్రశ్నించింది ఈ సినిమా. రచయిత, దర్శకుడు ఉమామహేశ్వరరావు ఆలోచనలను రేకెత్తించే చిత్రాలను రూపొందిస్తారని పేరు. ఈ కాలంలో పెరుగుతున్న హింస, దారుణాల మధ్య గాంధేయతత్వాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. కంటికి కన్ను, తలకు తల అన్నట్టు విధ్వంసాలు, కులచిచ్చులు రేగుతున్న ఈ తరుణంలో ఇదో గొప్ప ప్రయత్నం. 'స్త్రీలు బయటకొచ్చి మరొకరి కోసం పోరాటం చేస్తారా' అని ఆశ్చర్యపోయిన లోకజ్ఞానం లేని ఒక అమ్మ, తన కొడుకు హత్య వెనుక సత్యశోధన క్రమంలో, బయటకు వచ్చి ప్రకృతి సంపదను దోచుకున్న వ్యవస్థ గురించి, సాటి మనుషుల కోసం నిలబడటమే సంఘధర్మం అని చెప్పలిగేంత మారగలిగిన, పోరాటం చెయ్యగలిగిన ఈ అమ్మ...రష్యన్‌ ఉద్యమ సమయంలో, ఆనాడు భర్త దెబ్బలకు వణికిపోతున్న ఓ ఇల్లాలు, అచ్చూ అలాగే కొడుకు మీద ప్రేమతో, ఆ తర్వాత అణగారిన వర్గాల కోసం ఉద్యమించి, స్ఫూర్తిగా నిలిచిన రష్యన్‌ రివల్యూషనరీ రైటర్‌ మక్సిమ్‌ గోర్కీ 'అమ్మ'ను అప్రయత్నంగా గుర్తు చేస్తుంది. ఈ సత్యశోధనలో తల్లిగా ఆమెకెదురైన అనుభవాలు, ఆయా వ్యవస్థలోని లోపాలను చాలా చక్కగా దృశ్యీకరించాడు దర్శకుడు.
    సీనియర్‌ నటి రేవతి తన పాత్రలో అద్భుతంగా నటించారు. మాతృహృదయ ఆవేదనను సంపూర్ణంగా ఆవిష్కరించారు. జర్నలిస్టు పాత్రలో పోసాని కృష్ణమురళి, పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో రవి కాలే తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా హంతకుడుగా, అనాథగా నటించిన అబ్బాయి తన పాత్రలో లీనమై కన్నీళ్లు పెట్టిస్తాడు. ఎన్నో ప్రశ్నలతో అతని పాత్ర మనల్ని వెంటాడుతుంది. అలాగే క్యాపిటలిజం, కార్పొరేట్‌ మాయాజాలంపై ప్రజాగాయకుడు గోరటి వెంకన్న ఆలపించిన 'అద్దాల అంగడి మాయ' స్పెషల్‌ ఎట్రాక్షన్‌. ఎడిటర్‌ ప్రవీణ కొంచెం తన పనిని మెరుగు చేసుకోవాలి. మధు అంబట్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నీ ఎంఆర్‌ అందించిన సంగీతం, బిజిఎం పర్వాలేదనిపించింది. ఓవరాల్‌గా దర్శకుడు ఉమామహేశ్వరరావు సి తెరకెక్కించిన ఇట్లు అమ్మ కథ ప్రేక్షకులను మెప్పిస్తుంది.