Nov 26,2020 09:01

కేరళ: మరో మలయాళ చిత్రం తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. లిజో జోసి పెల్లిస్సెరీ దర్శకత్వం వహించిన 'జల్లికట్టు' చిత్రం 93వ ఆస్కార్‌ పురస్కారాల పోటీకి భారతదేశం తరపున వెళ్లనుంది. ఉత్తమ చిత్రాల పోటీలో నిలవనుంది. ''శకుంతలాదేవి, గుంజన్‌ సక్సేనా, ఛపాక్‌, గులాబో సితాబో, చెక్‌పోస్ట్‌, స్కై ఈజ్‌ పింక్‌.. వంటి 27 చిత్రాలను పరిశీలించిన అనంతరం జల్లికట్టును ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జ్యూరీ బోర్డ్‌ చైర్మన్‌ రాహుల్‌ రావైల్‌ తెలిపారు. మనుషుల్లో దాగున్న క్రూరత్వాన్ని, జంతువుల పట్ల మానవుల తీరును ఈ చిత్రం సూటిగా ప్రశ్నించిందన్నారు. కథా నేపథ్యం, నిర్మాణ విలువలు, లిజో దర్శకత్వం ప్రతిభ ఆధారంగా ఈ చిత్రాన్ని పోటీకి పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల దర్శకుడు లిజో, నిర్మాత థామస్‌ పణికర్‌లు హర్షం వ్యక్తం చేశారు. 2019లో మలయాళంలో విడుదలైన ఈ సినిమాలో ఆంటోని వర్గీస్‌, చెంబన్‌ వినోద్‌ జోసి, సబుమన్‌ అబ్దుసమద్‌, సంత్య బాలచంద్రన్‌లు నటించారు. వీరంతా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2002లో అమిర్‌ఖాన్‌ నటించిన 'లగాన్‌' తర్వాత ఏ చిత్రమూ విదేశీ విభాగంలో ఆస్కార్‌ తుది జాబితాలోనూ నిలవలేదు. ఆస్కార్‌ వేడుకలను ఏప్రిల్‌ 25న నిర్వహించనున్నారు. అయితే, ప్రస్తుతం కరోనా వల్ల ఎలాంటి వేడుకలూ నిర్వహించడం లేదు. 2022లో నిర్వహించాలని బాలీవుడ్‌ కోరుతోంది.

jallikattu