Nov 29,2020 23:50

అసెంబ్లీ భవనం

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో జిల్లాకు చెందిన పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఇటీవల వచ్చిన నివర్‌ తుపాను తాకిడికి గురై పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయిన అంశంతో పాటు జిల్లాలోని వివిధ అంశాలను ప్రజా ప్రతినిధులు ప్రస్తావించనున్నారు. ఇటీవల వరదలు, అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇటీవల పరిహారం అందించిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నివర్‌ తుపాను వల్ల జరిగిన నష్టంపై అంచనాలు తయారు చేస్తున్నామని డిసెంబరు 31లోపు పరిహారం అందుతుందని భావిస్తున్నట్టు చెబుతున్నారు.
సిసిఐ అధ్వర్యంలో పత్తి కొనుగోలు సరిగా జరగడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల రైతులు పత్తిని పూర్తిగా సిసిఐకి అమ్ముకోలేకపోతున్నారు. జిల్లాలో నీట మునిగిన పత్తి పొలాలకే గతనెలలో పరిహారం అందించారు. ఇది కూడా కేవలం 11 వేల ఎకరాలకు చెందిన రైతులకే పరిహారం దక్కింది. కానీ జిల్లాలో అధిక వర్షాల వల్ల దాదాపు రెండు లక్షల ఎకరల్లో మొదటి విడత పత్తి తీతలు తీయలేకపోయారు. పత్తి పూత రాలిపోయింది. కాయలు కుళ్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నివర్‌ తుపాను తాకిడికి రెండో విడత తీతలు కూడా నిలిచిపోయాయి. అంతేగాక మిర్చి పంటకు బొబ్బర తెగుళ్లతో రైతులు అల్లాడుతున్నారు. పంటల బీమాకు రైతులను ప్రీమియం చెల్లించనీయకుండా ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల రైతులకు బీమా సదుపాయం రాకుండా పోయిందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.
2019 కౌలు రైతు చట్టం వల్ల జిల్లాలో దాదాపు లక్ష మంది కౌలు రైతులకు రుణాలు అందడం లేదు. రైతు భరోసా రావడం లేదు. కేవలం ఐదు వేల మందికి రైతు భరోసా, 10 వేల మంది కౌలు రైతులకు రుణాలు అందుతున్నాయి. రైతుల సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణం విషయంలో ఇప్పటికే ప్రతిపక్షాలు అందోళన నిర్వహించగా డిసెంబరు 25న సంబంధిత లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ అంశంపైనా చర్చించే అవకాశం ఉంది. టిడిపి హయాంలో ఒక్కొ లబ్ధిదారుని నుంచి రూ.7.20 లక్షలు వసూలు చేయాలని నిర్ణయించిందని అయితే సీఎం జగన్‌ సంబంధిత లబ్ధిదారులకు కేవలం ఒక్క రూపాయికే ఇళ్లను అప్పగిస్తున్నారని వైసిపి నేతలు చెబుతున్నారు. ఈ అంశంపై టిడిపి చర్చకు దిగితే తాము దీటుగానే బదులిస్తామని వైసిపి ఎమ్మెల్యేలు తెలిపారు. ఎన్నికలకు ముందు ఆర్భాటంగా ఇళ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేయకుండానే దిగిపోయారని వారు చెబుతున్నారు. జిల్లాలో 31,462 ఇళ్ల నిర్మాణం జరిగింది. డిసెంబరు 25న దాదాపు మూడు లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ల స్థలాలకు భూ సేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై ఇప్పటికే టిడిపి తగిన సమాచారం సేకరించింది. శాసనసభలో, మండలిలో టిడిపి ప్రస్తావించే అవకాశం ఉంది.
జిల్లాలో టిడిపికి చెందిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్‌ ఒక్కరే ఉన్నారు. మిగతా 16 మంది వైసిపికి చెందిన వారే. వీరిలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ టిడిపి నుంచి గెలిచినా, తరువాత వైసిపికి మద్దతిచ్చారు. శాసన మండలిలో వైసిపి నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జంగాకృష్ణమూర్తి ఉండగా టిడిపి నుంచి నారా లోకేష్‌, పిడిఎఫ్‌ నుంచి కె.ఎస్‌ లక్ష్మణరావు ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎఎస్‌.రామకృష్ణ ఉన్నారు.