Aug 08,2021 12:18

ప్రపంచంలో ఎన్నో వింతలు, విచిత్రాలను చూస్తుంటాం. అందులో కొన్ని మనం కళ్లారా చూసినా కూడా నమ్మలేని పరిస్థితి. కొన్ని ప్రాంతాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి.. ఆహ్లాదంగా ఉంటాయి.. మరికొన్ని ప్రాంతాలు భయంకరంగా.. చూస్తేనే గుండె ఆగిపోయేంత భయాన్ని కలిగిస్తాయి. అయితే ఈ నది గురించి వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా నదులు ప్రశాంతంగా చల్లగా ఉంటాయి.. కానీ అక్కడ నది మాత్రం ఎప్పుడూ పొగలు కక్కుతూ వేెడి వేడిగా ఉంటుంది. ఆ విశేషాలు తెలుసుకుందాం...

 

ఆశ్చర్యానికి గురిచేసే 'బాయిలింగ్‌ రివర్‌'

     ప్రకృతి మనిషికి ఇచ్చిన గొప్ప వరం నదులు. ప్రపంచ వ్యాప్తంగా చిన్న, పెద్ద అనేక నదులున్నాయి. నదుల ఒడ్డున అనేక ప్రఖ్యాత నగరాలు.. ప్రముఖ క్షేత్రాలు వెలిశాయి. ఎక్కడ నీరు సమృద్ధిగా లభిస్తుందో.. అక్కడ నాగరికత వెల్లువిరుస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే.. ఇక నదులు.. వాటి సోయగాలు మనిషికి ఎప్పుడూ ఆనందం కలిగిస్తాయి. కెనడా ప్రపంచంలోనే అత్యధికంగా నదులు కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. కానీ అన్ని నదుల విశిష్టతలనూ తలదన్నెలా ఒక నది విశిష్టతను కలిగి ఉంది. అదేంటంటే ఆ నదిలో నీరు 24 గంటలూ మరుగుతూ ఉండటమే. దీన్నే 'బాయిలింగ్‌ రివర్‌' అంటారు. అయితే ఈ విచిత్రమైన బాయిలింగ్‌ నది అమెరికాలోని అమెజాన్‌ ప్రదేశంలోని 'పెరు' దేశంలో 'మయంటుయాకు' ప్రాంతంలో శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నది అడవి మధ్యన ఉంటుంది. అయినా నీరు 200 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిత్యం మరిగిపోతూ ఉంటుంది. ఈ నదిలో నీరు ఏ కాలమైన వేడిగా ఉంటుందని.. ఏ జంతువు ఈ నీటిలో పడినా బతకడం కష్టం. నీరు ఇంత వేడిగా ఉండడానికి కారణం బహుశా నది అడుగున అగ్నిపర్వతం ఉండి ఉంటుందని శాస్త్రజ్ఞుల అంచనా..!
     ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన, భయానక నదులు అనేకం ఉన్నాయి. కానీ, అమెజాన్‌ అడవిలోని ఈ నదిలో నీరు ఎప్పుడూ మరుగుతూనే ఉంటాయి. ఈ నదిని మరిగే నది (బాయిలింగ్‌ రివర్‌) అని పిలుస్తుంటారు. శాస్త్రవేత్తలు కూడా ఈ నదిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నదిలోని నీరు ఇలా మరగడానికి గల కారణమేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం.. ఈ బాయిలింగ్‌ రివర్‌ని 2011లో ఆండ్రీ రౌజో కనుగొన్నారు. ఈ నదిని కనుగొనడానికి ఆండ్రీ చాలా కష్టపడ్డాడు. 200 డిగ్రీల ఫారెన్‌హీట్‌ టెంపరేచర్‌ కలిగిన ఈ నది పొడవు 6.4 కిలోమీటర్లు, వెడల్పు 82 అడుగులు, 20 అడుగుల లోతు ఉంటుంది. ఈ నదిలోని వాటర్‌తో గుడ్లు, రైస్‌, ఇతర ఆహార పదార్థాలను క్షణాల్లో ఉడకబెట్టవచ్చు. అలాగే.. ఎవరైనా పొరపాటున అందులో పడినట్లయితే.. ప్రాణాలు కోల్పోవడం ఖాయం అని ఈ నదిని పరిశీలించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 

                                                      ఎలా కనుగొన్నారంటే..

ఆశ్చర్యానికి గురిచేసే 'బాయిలింగ్‌ రివర్‌'

 

ఆశ్చర్యానికి గురిచేసే 'బాయిలింగ్‌ రివర్‌'


మరిగే నదిని కనుగొన్న వ్యక్తి దీనికి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. 'నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాత మరిగే నది కథను తరచుగా చెబుతుండేవాడు. అలా ఆ నది గురించి తెలుసుకోవాలని మనసులో బలంగా నిశ్చయించుకున్నాను. నాతో పాటే నదిని తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగి, పెద్దదయ్యింది. ఆ నది ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? అని తెలుసుకోవాలనే తపన ఎక్కువైంది. ఎలాగైనా ఆ నదిని కనుగొనాలని ఫిక్స్‌ అయ్యాను. ఈ నది గురించి చాలా మందిని ఆరా తీశాను. పీహెచ్‌డీ చదువుతున్న సమయంలో అమెజాన్‌ అడవికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. అలా అమెజాన్‌ అడవిలో మరిగే నదిని కనుగొనేందుకు వేట సాగింది.. చివరికి 2011లో నా లక్ష్యాన్ని చేరుకున్నాను' అని ఆండ్రీ తెలిపాడు. 'చివరికి మరిగే నదిని ప్రపంచానికి పరిచయం చేశాను' అన్నాడు ఆండ్రీ.
      అయితే, ఈ నదిలో నీరు 24 గంటలూ మరగడానికి గల కారణాలేంటనేది ఇప్పటికీ తెలియరాలేదు. దాని రహస్యమేంటో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వాస్తవానికి ఉష్ణ బిలాలు ఉంటాయనేది మనందరికీ తెలిసిందే. అది కొద్ది వైశాల్యంలో మాత్రమే ఉంటాయి. కానీ ఏకంగా సుమారు ఏడు కిలోమీటర్లు పొడవు కలిగిన నది నిత్యం మరుగుతూ ఉండటం అనేది నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పాల్సిందే. అయితే కొన్నిసార్లు జంతువులు ఆ నదిలో ఉండటం కనిపిస్తుంది. దానికి కారణం వర్షాలు చాలా రోజులు కురిసిన సమయంలో నదిలో నీళ్లు చల్లబడతాయి. ఆ సమయంలో నీళ్లు వేడిగా ఉండవు కాబట్టి, ఆ సమయాల్లో జంతువులు నదిలోకి దిగుతుంటాయి.