Mar 01,2021 19:14

ముంబయి : మహారాష్ట్రలో అధికారం కోల్పోవడాన్ని బిజెపి ఇంకా జీర్ణించుకోలేకపోతుందని.. దీంతోఉద్దేశపూర్వకంగా నిధులను విడుదల చేయకుండా కుట్ర పన్నిందని మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ (ఎంవిఎ) కూటమి పేర్కొంది. ప్రతీకారం తీర్చుకునేందుకు బిజెపి యత్నిస్తోందని తెలిపింది. నిధులు విడుదల కాకపోతే అభివృద్థి పనులకు ఆటంకం ఏర్పడుతుందని.. దీంతో ప్రజల్లో ఎంవిఎ విశ్వాసం కోల్పోతుందని, ఎంవిఎపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమౌతుందని పేర్కొంది. ఇది అనైతికము, రాజ్యాంగ విరుద్ధమని శివసేన ఎమ్మెల్యే ప్రతాప్‌ సర్నాయక్‌ అన్నారు. మహారాష్ట్ర బడ్జెట్‌ సెషన్‌ సోమవారం రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కొష్యారీ ప్రసంగంతో ప్రారంభమైంది. గవర్నర్‌ అసెంబ్లీ భవనం చేరుకునే సమయంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలు నినాదాలు చేశారు. కేంద్రం నుండి రాష్ట్రానికి విడుదల కావలిసిన జిఎస్‌టి బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయంటూ, జిఎస్‌టి బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ, రాష్ట్రానికి అన్యాయం చేయవద్దంంటూ నినదించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. 80,164 కోట్లు కేంద్రం నుండి విడుదల కావాల్సి వుంది.

కేంద్ర జిఎస్‌టి వాటా.. రూ. 20,860 కోట్లు
జిఎస్‌టి పరిహారం .. రూ.29,290 కోట్లు
అనుబంధ సంస్థల్లో ఆర్థిక సహాయం పెండింగ్‌లో ఉన్నవి .. రూ.20,160 కోట్లు
పన్నులు కాకుండా రాష్ట్ర నిధి .. రూ. 9,054 కోట్లు
అంగన్‌వాడీ పథకం సహాయం .. రూ. 539 కోట్లు
కేంద్రం నుండి ప్రత్యేక సహాయం .. రూ. 56 కోట్లు
ఆర్టికల్‌ 275 (1) కింద కేంద్ర సహాయం రూ. 50 కోట్లు
పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ రూ. 148 కోట్లు
పివిటిజి సబ్సిడీ రూ.. 7.50 కోట్లు
పెండింగ్‌లో ఉన్న మొత్తం రూ. 80వేల కోట్లు.. వీటిలో గిరిజన అభివృద్ధి విభాగం, నైపుణ్య అభివృద్ధి శాఖకు చెందిన వివిధ పథకాలకు విడుదల కావల్సిన నిధులను వీటిలో మినహాయించింది. ఈ రెండు విభాగాలకు చెల్లించాల్సిన మొత్తం ఎంత అనేది రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద లేదని అన్నారు. కాగా,భారత్‌లో అత్యధికంగా పన్నులు వసూలు చేసే రాష్ట్రం మహారాష్ట్రనే అయినప్పటికీ.. మొత్తం సేకరణలో 5.2 శాతం మాత్రమే పొందుతుంది. 14వ ఆర్థిక సంఘం ఈ విధానాన్ని నిర్ణయించింది. తక్కువ వాటా ఉన్నప్పటికీ.. పెండింగ్‌లో ఉన్న నిధులను కేంద్రం ఇప్పటివరకు విడుదల చేయలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు త్రైమాసికాల్లో మహారాష్ట్ర పన్ను వసూళ్లు భారీగా పడిపోయింది. రూ. 1,07,000 కోట్లు వసూలు చేయాలని భావించినప్పటికీ.. కేవలం రూ. 74 వేల కోట్లను మాత్రమే వసూలు చేయగలిగింది. 2020-21 మూడో త్రైమాసికంలో పరిస్థితి మెరుగుపడింది. అయితే బడ్జెట్‌ కొరత ఇంకా రూ. 48వేల కోట్లు. ఈ పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ఈ నిధిని విడుదల చేస్తుందని రాష్ట్రం ఆశిస్తోంది. అయితే కేంద్రం నుండి విడుదల కావాల్సిన జిఎస్‌టిల్లో రాష్ట్ర వాటాగా రావాల్సిన రూ. 48 వేల కోట్లలో కేవలం రాష్ట్రానికి రూ. 27 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు, రాష్ట్ర అప్పులు భారీగా పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర నేరుగా రూ. 5,84,వేల కోట్లు రుణాన్ని కలిగి ఉండగా, ప్రభుత్వ రంగాలకు రూ. 2 లక్షల కోట్లకు పైగా అప్పు ఉంది.
కాగా, ఈ ఏడాది ఆర్థిక సర్వేను మార్చి 7న, బడ్జెట్‌ను మార్చి 8న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితుల స్పష్టమైన చిత్రం స్పష్టమవుతుంది. అయితే.. మహారాష్ట్ర ప్రస్తుతం ఆర్థిక నిర్వహణకు ఇబ్బందులు పడుతుందనేది కాదనలేని సత్యం.