Apr 06,2021 19:18

అమరావతి రాజధాని ప్రాంతంలోని అనంతవరంలో అరటి నారతో ఉపాధి అవకాశాలను సృష్టించింది సౌజన్య. పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులతో పరిశ్రమను నడిపిస్తోంది. ఈ ప్రాంతంలో దొరికే అరటి నారతో షేవింగ్‌ బ్రెష్‌, కిట్స్‌ తయారు చేయిస్తుంది. ఇది స్థానిక మహిళలకు ఉపాధిని ఇవ్వడమే కాదు; పర్యావరణ పరిరక్షణకూ ఉపయోగపడుతుంది.

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలానికి ఏడు కిలోమీటర్ల దూరంలో అనంతవరం గ్రామం ఉంది. రోడ్డు మార్గం కూడా సక్రమంగా లేదు. దాంతో ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికీ టూవీలర్‌ వాహనం తప్పనిసరి. పొలం పనుల మీద ఆధారపడి జీవనం గడిపేవాళ్లే ఎక్కువ. ఆ గ్రామానికి చెందిన సౌజన్య తల్లీదండ్రులు కూడా వ్యవసాయం కుటుంబీకులే. ఆమె ఎంఎస్సీ, బిఈడీ పూర్తి చేసింది. కొన్ని సంవత్సరాలు నాగార్జున యూనివర్శిటీలో లెక్చరర్‌గా పనిచేసింది. పెళ్లి అనంతరం కొన్ని ఏళ్లుగా ఇంట్లోనే ఉంది. రకరకాల ఆలోచనతో స్వయంగా వ్యాపారం పెట్టాలనుకున్న తనకి ఒక రోజు న్యూస్‌ పేపర్లో కనిపించిన 'ఒకే షేవింగ్‌ కిట్‌ వాడటం వల్ల కొంతమందికి హెపటైటీస్‌ వ్యాధి ప్రబలింది.'' అన్న వార్త బాగా ప్రభావం చూపింది. సెలూన్‌ షాపుల్లో కొన్ని బ్రాండ్లకు సంబంధించిన షేవింగ్‌ బ్రెష్‌లు విరివిగా వాడుతున్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా ఏదైనా తయారు చేయాలనుకున్న ఆలోచన నుంచే అరటినారతో 'షేవింగ్‌ బ్రెష్‌' పుట్టింది. అలా 2017లో 'బోదా' (అరటి) సంస్థ స్థాపనకు దారి తీసింది.

అరటి నారతో స్వయం ఉపాధి


తన ఆలోచన కుటుంబ సభ్యులతో పంచుకుంది. భర్త రాంప్రసాద్‌ ప్రోత్సహించారు. ఎటువంటి ప్లాస్టిక్‌ ఉపయోగించకుండా ప్రకృతి పదార్థాలతోనే సేవింగ్‌ కిట్‌ తయారు చేయాలనేది ఆలోచన. ఆ ఆలోచనే తనకు మంచి గుర్తింపు వచ్చేలా చేసింది. ప్రారంభంలో ఆమె తన పరిశోధనలో భాగంగా చుట్టు పక్కల గ్రామాల్లోని అరటి తోటల్లోకి వెళ్లింది. రైతులు గెలలు తెంచిన తర్వాత అరటిబోదెలను వృథాగా పారివేయడం గమనించింది. ఆ అరటినార తన రీసెర్చ్‌కి ఉపయోగపడుతుందని గ్రహించి దాన్ని తీసుకొని యూనివర్శిటీకి వెళ్లింది. కొన్ని నెలలు ల్యాబ్‌లోనే ప్రయోగాలు చేస్తూ గడిపింది. భర్త రాంప్రసాద్‌ ఇండిస్టీయల్‌లో ఉన్న అనుభవంతో రీసెర్చ్‌కు తగ్గట్టుగా బ్రెష్‌లు తయారీకి అవసరమైన కట్టింగ్‌, పాలిష్‌, ఓవెల్‌ మిషన్లు తయారుచేశారు. రెండేళ్ల కృషి తరువాత సౌజన్య తాను అనుకున్నది సాధించింది. ఎటువంటి కెమికల్స్‌ వాడకుండా సహజసిద్ధంగా షేవింగ్‌ బ్రెష్‌ తయారు చేసింది. ప్రపంచంలోనే మొదటగా అరటినారతో షేవింగ్‌ బ్రెష్‌ తయారు చేసిన వ్యక్తిగా నిలిచింది. దీంతో ఆమెకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఆ ఉత్పత్తిపై పేటెంట్‌ హక్కులు కూడా తనకే వచ్చాయి. అనంతవరంలో ఒక ఇంటిని అద్దెకి తీసుకొని అక్కడ 'బోదా' పేరుతో సంస్థను స్థాపించింది. ఈ సంస్థ షేవింగ్‌ బ్రెష్‌తో పాటు రేజర్‌, టవల్‌ (కేప్‌)లను ఒక కిట్‌గా రూపొందిస్తోంది. అందరికీ అందుబాటులో ఉండేలా ఈ కిట్‌ ధరను రూ.35లుగా నిర్ణయించారు. ఒక వ్యక్తి ఈ కిట్టును రెండు మూడు సార్లు ఉపయోగించవచ్చు. వాడి పారేసినా ఇవి సులభంగా భూమిలో కలిసిపోతాయి. పర్యావరణానికి హాని కలగదు. వీటి తయారీ ద్వారా స్థానిక మహిళలు ఉపాధి పొందుతున్నారు. సౌజన్య తన వ్యాపారాన్ని ముంబై, చెన్నైలలో కూడా ప్రారంభించింది.

అరటి నారతో స్వయం ఉపాధి


అరటి నారతో చిన్న కుటీరం
సౌజన్య తల్లి మాదాల కస్తూరి. నాలుగేళ్ల క్రితం వరకూ ఊరిలోనే పొలం పనులకు వెళుతుండేది. కూతురు ఈ షేవింగ్‌ బ్రెష్‌ల తయారీ అప్పజెప్పడంతో అవి చేసుకుంటూ ఇంటి దగ్గర ఉంటుంది. ఇవి చేస్తూనే తాను సొంతంగా చిన్న కుటీర పరిశ్రమ నడుపుకుంటుంది. లాక్‌డౌన్‌లో బ్రెష్‌ల ఆర్డర్లు నిలిచిపోయాయి. దాంతో ఖాళీగా ఉండకుండా అరటినారతో రకరకాల వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టింది. గతంలో కొబ్బరిపీచుతో తయారుచేసిన టోపీలు, చాపలు వంటివాటిని అరటినారతో తయారు చేయడం మొదలు పెట్టింది. అరటినారతో చాపలు, బుట్టలు, బ్యాగులు, షోకేస్‌లో పెట్టుకునే అందమైన అల్లికలు, బాక్సులు, టోపీలు, జడ బ్యాండ్లు, గాజులు, చెప్పులు, నాగరం, జడలు, కొవ్వొత్తులు, కోటు... ఇలా రోజుకొకటి చొప్పున అల్లింది. కస్తూరిని చూసి స్థానిక మహిళలు కూడా అరటినారతో ఈ వస్తువులను తయారుచేయడం ప్రారంభించారు. అరటి నారను శుభ్రం చేసి.. వాటికి కొంచెం కొంచెంగా తీసుకొని జడ అల్లినట్లుగా మూడు పాయలతో అల్లి, వాటిని గమ్‌ సహాయంతో ఒకదానికొకటి అంటిస్తున్నారు. చివర్లను, జాయింట్ల వద్ద దారంతో గట్టిగా కుట్టేస్తున్నారు. వాటిపై సహజసిద్ధమైన రంగులను అద్దుతున్నారు. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ వస్తువులను స్థానికులు కొనుగోలు చేస్తున్నారు. బ్యాంకుల వాళ్లు రుణాలు ఇస్తే తమ ఉత్పత్తులను ఇంకా అభివృద్ధి చేసుకుంటామని వారంతా కోరుతున్నారు.

అరటి నారతో స్వయం ఉపాధి


నలుగురుతో కలిసి పనిచేస్తున్నా: పద్మావతి, అనంతవరం
ఒకప్పుడు ఇంట్లోనే ఖాళీగా ఉండేదాన్ని. ఇప్పుడు నలుగురుతో కలిసి పనిచేయడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటున్నా. మాకు దగ్గర్లో దొరికే అరటి నారతో ఈ వస్తువులు చేయడం మా పనికి మంచి గుర్తింపు వస్తుంది.

నీడలో పని : నాగజ్యోతి, అనంతవరం
నాలుగేళ్ల క్రితం నేను పొలం పనులు వెళ్లేదాన్ని. ఎండలో రోజంతా ఉండటం కష్టంగా ఉండేది. ఇప్పుడు నీడలో కూర్చొని పని చేసుకుంటున్నాం. మధ్యాహ్నం ఇంటికి వచ్చి పిల్లలికి అన్నం పెట్టుకుంటున్నా. చాలా తృప్తిగా ఉంది.

సమయం వృథా చేయడం లేదు : నాగలక్ష్మి, అనంతవరం
గతంలో ప్రతిరోజూ ఇంట్లో పని చేసుకొని టీవీ ముందు, లేదా ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్లం. కానీ ఇప్పుడు క్షణం తీరిక ఉండటం లేదు. అరటినారతో బ్రెష్‌లు తయారుచేయడంతో పాటు, కొత్త కొత్త వస్తువులు తయారు చేయడం మాకు సంతోషంగా ఉంది.

                                                       * సరికొండ పద్మావతి

అరటి నారతో స్వయం ఉపాధి