Oct 28,2021 19:08

రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న ఎస్‌పి దీపిక

ప్రజాశక్తి - కంటోన్మెంట్‌ : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ఎస్‌పి ఎం.దీపిక అన్నారు. జిల్లాలో ఈనెల 21 నుండి 31 వరకు నిర్వహిస్తున్న పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు పరేడ్‌ గ్రౌండులో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఎస్‌పి ఎం.దీపిక ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు అంతర్గత భద్రతకు పోలీసుశాఖ శక్తి వంచన లేకుండా పని చేస్తూ, తమ ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధవహించక పోవడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ, విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారన్నారు. మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు వీరుల త్యాగాలు వృథా కారాదని, వారి త్యాగాలను స్మరించుకొంటూ, తిరుమల నర్సింగ్‌ హోం సహకారంతో పోలీసు కుటుంబాలకు, సామాన్య ప్రజలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది వైద్య పరీక్షలు చేసి, మందులు అందజేశారు. కార్యక్రమంలో తిరుమల నర్సింగ్‌ హోం ఎమ్‌డి డాక్టర్‌ తిరుమలప్రసాద్‌, డాక్టర్‌ శివప్రసాద్‌, డాక్టర్‌ రాజశేఖర్‌, డాక్టర్‌ చంద్రకుమారి తదితరులు తమ సేవలందించారు. ఎఎస్‌పి పి.సత్యనారాయణ, ఒఎస్‌డి సూర్యచంద్రరావు, డాక్టర్‌ వెంకటేశ్వరరావు, డిఎస్‌పి అనిల్‌, ఎల్‌.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.