Nov 27,2020 19:46

న్యూ ఢిల్లీ : రిపబ్లిక్‌ టివి ఎడిటర్‌ అర్నాబ్‌ గోస్వామికి మంజూరు చేసిన తాత్కాలిక బెయిలు గడువును సుప్రీం కోర్టు మరో నాలుగు వారాలు పొడిగించింది. వ్యక్తిగత స్వేచ్ఛను, సాధారణ ప్రజలకు బెయిల్‌ ఇచ్చే హక్కును కాపాడాలని న్యాయమూర్తులకు సుప్రీం కోర్టు శుక్రవారం పిలుపునిచ్చింది. 'స్వేచ్ఛ కొద్దిమందికి బహుమతి కాదు' అని పేర్కొంది. హైకోర్టుకు లేదా సుప్రీం కోర్టుకు తరలించడానికి మార్గాలు లేదా వనరులు లేని సాధారణ పౌరులు జైళ్లలో అండర్‌టైల్‌గా కొట్టుమిట్టాడుతున్నారని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. కనీసం ఒక్క రోజు అయినా వ్యక్తిగత స్వేచ్ఛను పోగొట్టడం చాలా తీవ్రమైన విషయమని న్యాయమూర్తులు డి.వై.చంద్రచూడ్‌, ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం 55 పేజీల ఉత్తర్వుల్లో ప్రకటించింది. ఆర్కిటెక్చరల్‌ ఫర్మ్‌ అధిపతి ఆత్మహత్య చేసుకునే విధంగా అర్నాబ్‌ గోస్వామి తదితరులు ప్రేరేపించినట్లు చెప్పలేమని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. అర్నాబ్‌ పై ఆరోపణలను మహారాష్ట్ర పోలీసులు నిరూపించలేకపోయారన్నారు. బాంబే హైకోర్టు తన అధికారాన్ని వినియోగించడంలో విఫలమైందన్నారు. రాజ్యాంగ విలువలు, ప్రాథమిక హక్కుల రక్షకుల పాత్రను హైకోర్టు పరిత్యజించిందని, ఎంపిక చేసుకుని వేధించే సాధనంగా క్రిమినల్‌ చట్టం ప్రజల విషయంలో మారకూడదని సుప్రీం కోర్టు పేర్కొంది.