Feb 22,2021 08:11

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : సేంద్రీయం మాటున ఆవుకు ప్రచారం, ప్రాధాన్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలకు రూపకల్పన చేసింది. ఆవుల పెంపకం, దాని ఉత్పత్తులైన పాలు, పాల పదార్థాలతో పాటు ఆవు విసర్జితాలైన పేడ, మూత్రం మార్కెటింగ్‌ను పెంచి వాల్యూ ఎడిషన్‌ (విలువ జోడింపు) పెంచడానికి నెల రోజుల్లో ఏకంగా మూడు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఆవుపై ఏడాదికి రూ.లక్షన్నర వరకు ఆదాయం లభిస్తుందని పశుసంవర్థక శాఖ ప్రాజెక్టు రిపోర్టులు వెలువరించింది. కరోనా వంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు ఆవు ఉత్పత్తులు బాగా ఉపయోగపడ తాయని మనుషుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయని పేర్కొంది. ఆవులను పెంచితే కాలక్రమంలో ప్రజల్లో పోషకాహార సమస్య తీరుతుందని తెలిపింది. రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)లలో ఆవు పాల సేకరణ చేపడతామని, ఆవు పాలు, పాల పదార్థాలను అమూల్‌, ఫిషరీస్‌ ఔట్‌లెట్లు, జనతాబజార్లు, ఇ-ప్లాట్‌ఫారాల్లో అమ్మిస్తామంది. ఆవు పాల డిమాండ్‌పై ఎప్పటికప్పుడు గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లో సహాయకుల ద్వారా అంచనాలు, వివరాలు సేకరించి ఆవుల పెంపకందార్లకు అందిస్తామంది.

లాభదాయక వనరట!
సేంద్రీయ (ఆర్గానిక్‌) వ్యవసాయం, సేంద్రీయ డెయిరీ ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం ఆవులనే పెంచాలన్న ప్రభుత్వం గత నెల 11న జారీ చేసిన జిఒఎంఎస్‌ నెం.6లో ప్రాజెక్టు వివరాలు వెల్లడించింది.. ఒక దేశీయ ఆవు ద్వారా సగటున రోజుకు ఐదు లీటర్ల పాలు, 10-12 కిలోల పేడ, 5-6 లీటర్ల మూత్రం లభిస్తుంది. ఒక కిలో ఆవు పాలు (ఎ2 క్వాలిటీ) మార్కెట్‌లో రూ.వంద పలుకుతోంది. సేంద్రీయ పంటల సాగు కోసం ఆవు పేడ, మూత్రంతో జీవామృతం, పేడతో ఘన జీవామృతం, గోమూత్రాన్ని సేద్యానికి, ఔషధ గుణాలు కలిగిన సబ్బులు, అగర్‌బత్తి, దోమల నివారణ బత్తి తదితర ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఆవు దూడలను అమ్ముకోవచ్చు. తద్వారా దేశీయ ఆవుల జాతులు సంరక్షించబడతాయి. వీటన్నింటి వలన ఒక ఆవుపై ఏడాదికి రూ.1,43,800 లాభం వస్తుంది. కేంద్ర సంస్థలు, బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించి ఒక్కో గ్రామంలో కనీసం 50 ఆవులతో ఒక కేంద్రం ఏర్పాటు చేస్తే ఏడాదికి అన్నీ పోను రూ.50 లక్షలు మిగులుతుంది. ఆవుల వలన గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ సమతౌల్యం, ఉపాధి కల్పన జరుగుతుంది... అని ప్రాజెక్టు రిపోర్టులో తెలిపింది. ఆ జిఓను సవరించి ఈ నెల 16న విడుదల చేసిన జిఒఎంఎస్‌ నెం.9లో రాష్ట్రంలో 58 యూనిట్లు, ఒక్కో యూనిట్‌కు లోన్‌, సబ్సిడీతో కలిపి రూ.30 లక్షలుగా నిర్ణయించారు.

సెంట్రల్‌ స్పాన్సర్‌.. 
గత టిడిపి సర్కారు కేంద్ర బిజెపి మనసుకు అనుగుణంగా రూ.కోట్లు ఖర్చు చేసి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అని డాక్టర్‌ పాలేకర్‌తో శిక్షణలిప్పించింది. ట్రైనింగ్‌లు ఆవు కేంద్రంగానే సాగాయి. రాష్ట్రీయ క్రిషి వికాస్‌ యోజన (ఆర్‌కెవివై)కు అనుబంధంగా 2019 ఫిబ్రవరిలో కేంద్రం నెలకొల్పిన రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ (ఆర్‌కెఎ) పథకాన్ని వైసిపి సర్కారు రాష్ట్రంలో అమలు పరుస్తోంది. వాతావరణ మార్పుల నియంత్రణకు నాబార్డు సహాయంతో నెలకొల్పిన నేషనల్‌ అడాప్టేషన్‌ ఫండ్‌ ఫర్‌ క్లయిమెట్‌ ఛేంజి (ఎన్‌ఎఎఫ్‌సిసి) నిధులను ఆవుల ప్రమోషన్‌కు వాడుతోంది. ఎపికి నాబార్డు ఆమోదించిన ప్రాజెక్టు పేరు క్లయిమేట్‌ రీసైలెంట్‌ ఇంటర్‌వెన్షన్స్‌ ఇన్‌ డెయిరీ సెక్టార్‌. కోస్తా, మెట్ట ప్రాంతాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో దీన్ని అమలు చేస్తారు.