Nov 22,2020 23:28

సామర్లకోటలో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

వామపక్షాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాలను పోలీసులతో అణచివేయడం సాధ్యం కాదని హితవు పలికారు.
ప్రజాశక్తి-యంత్రాంగం : సామర్లకోటలో సిపిఎం నాయకులు బాలం శ్రీనివాస్‌, తుంపాల శ్రీనివాస్‌లను అక్రమంగా గృహ నిర్బంధం చేయడాన్ని సిపిఎం పట్టణ కమిటీ తీవ్రంగా ఖండించింది. పార్టీ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కరణం శ్రీనివాసరావు, నాయకులు గోవిందరాజు, కృష్ణ, వీరబాబు పాల్గొన్నారు. పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనంలో నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సిపిఐ పిలుపు ఇస్తే సిపిఎం నాయకులను అరెస్టు చేయటం దుర్మార్గమన్నారు. ఎవరు ఏ పార్టీకి చెందిన వారో కూడా పోలీసులు తెలుసు తీసుకోవడం లేదన్నారు. సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు, శాఖా కార్యదర్శి ఎస్‌.శ్రీనివాస్‌, సిపిఎం నాయకులు యాసలపు రమేష్‌, క్రాంతి కుమారులను అరెస్టు చేశారన్నారు. వీరి అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో దారపురెడ్డి కృష్ణ, ఆర్‌.వీర్రాజు పాల్గొన్నారు. రాజమహేంద్ర వరంలో సిపిఐ నాయకులను అరెస్టు చేయడాన్ని ఎపి ప్రజానాట్యమండలి జిల్లా శాఖ కార్యదర్శి మహంతి లక్ష్మణరావు ఖండించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన వారిలో ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు డాక్టర్‌ చెలికాని స్టాలిన్‌, జిల్లా అధ్యక్షులు వి.శామ్యూల్‌, కోశాధికారి ముప్పన కుమార స్వామి ఉన్నారు. ఎటపాకలో కందుకూరి మంగరాజు తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. విఆర్‌.పురంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు పూనెం సత్యనారాయణ హౌస్‌ అరెస్టుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సిపిఐ నాయకులు పోలవరం పరిరక్షణ యాత్రకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నోటీసులు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు.