Dec 03,2021 21:29

తిరువనంతపురం : కేరళలోని పతనంతిట్ట జిల్లాలో గురువారం రాత్రి సిపిఎం జిల్లా నేతను దారుణంగా హత్య చేశారు. తిరువళ్ళ ఏరియాలోని పెరింగర స్థానిక కమిటీ కార్యదర్శి పి.బి.సందీప్‌ కుమార్‌ (36) ఆర్‌ఎస్‌ఎస్‌ క్రూరత్వానికి బలైన మరో బాధితుడు. ఛాతంకెరిలో ఆయన ఇంటికి సమీపంలో గురువారం రాత్రి 8గంటల సమయంలో ఐదుగురు సాయుధ దుండగులు ఆయన్ని అడ్డగించి దాడి చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్ళేలోగానే మరణించారు. మరణించిన సందీప్‌ కుమార్‌కు భార్య, మూడున్నర ఏళ్ళు, మూడు మాసాల వయస్సున్న ఇద్దరు చిన్నారులు వున్నారు. అలప్పూజలోని కర్వుట్టలో ఒక ఇంట్లో శుక్రవారం ఉదయం పోలీసులు నిందనితులను పట్టుకున్నారు. వారిలో ఐదుగురిని పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి పరారీలో వున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పెరింగర ఎలాంటి రాజకీయ ఉద్రిక్తతలు లేని ప్రాంతం. ఇక్కడ బిజెపి కార్యకర్తలు పలువురు పార్టీని వీడి సిపిఎం సానుభూతిపరులుగా మారడంతో అక్కడి ప్రజలను భయభ్రాంతులను చేయడానికి జరిగిన ప్రయత్నంగా ఈ హత్యను భావిస్తున్నారు. సందీప్‌ కుమార్‌ గత ఎన్నికల్లో పెరింగర గ్రామ పంచాయితీ సభ్యుడుగా వున్నారు. 27ఏళ్ళ తర్వాత 2015లో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ విజయం సాధించింది. స్థానిక నేత అయిన సందీప్‌ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. దాంతో ఆయన్ని స్థానిక కార్యదర్శిగా చేశారు. ఇటీవల ముగిసిన మహాసభలో కూడా ఆయనను తిరిగి ఎన్నుకున్నారు.
ఈ హత్యకు దారి తీసిన కుట్రను వెలికితీయడానికి దర్యాప్తు జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గం డిమాండ్‌ చేసింది. యువ నేతను ఈ రకంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. సిపిఎం కార్యకర్తలను, నేతలను ఈ రకంగా హత్యలు చేయడం ద్వారా ప్రజలను భయకంపితులను చేయడానికి, రాష్ట్రంలో శాంతి వాతావరణాన్ని భగం చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని విమర్శించింది.
పొలిట్‌బ్యూరో ఖండన
ఆర్‌ఎస్‌ఎస్‌ాబిజెపి ముఠా సిపిఎం నేతను దారుణంగా హత్య చేయడాన్ని సిపిఎం పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. రాత్రి ఇంటికి వెళుతున్న సమయంలో దారికాచి అడ్డగించిన సందీప్‌ కుమార్‌ను కత్తులతో పలుసార్లు పొడిచారని, అక్కడికక్కడే చనిపోయాడని పేర్కొంది. కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ాబిజెపి సాగిస్తున్న దురాగతాలు, హత్యా రాజకీయాల కొనసాగింపే ఈ హత్య అని పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. అరెస్టయిన కీలక నిందితుల్లో ఒకరు పెరింగర బిజెపి యువమోర్చా అధ్యక్షుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త అని పేర్కొంది. రాష్ట్రంలో నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని భగం చేయాలన్నదే ఆర్‌ఎస్‌ఎస్‌ాబిజెపి ఉద్దేశ్యమని, హింసాకాండకు పాల్పడ్డం ద్వారా సిపిఎం పెరుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారని, కానీ, ఇటువంటి ఎత్తుగడలేవీ చెల్లబోవని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది. ఇటువంటి హింసాత్మక దాడులకు ఇక ఫుల్‌స్టాప్‌ పెట్టాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.