May 18,2021 23:00

తనిఖీలు నిర్వహిస్తున్న అడిషనల్‌ డిఎంహెచ్‌ఒ

- అడిషనల్‌ డిఎంహెచ్‌ఒ
ప్రజాశక్తి - కోసిగి రూరల్‌: 
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్‌ఎంపిలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని అడిషనల్‌ డిఎంహెచ్‌ఒ రంగనాయక్‌ తెలిపారు. ప్రభుత్వాస్పత్రి తనిఖీల్లో భాగంగా మంగళవారం స్థానిక కోసిగి ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్‌ఎంపిలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలన్నారు. ఆర్‌ఎంపిలు సూదులు వేయటం, సెలైన్‌ బాటిల్‌ ఎక్కించడం వంటివీ చేయరాదన్నారు. భౌతిక దూరం పాటిస్తూ రోగులకు ప్రథమ చికిత్స చేయాలన్నారు. కరోనా నిబంధనలు దృష్టిలో ఉంచుకుని వైద్యం చేయాలని, కరోనా లక్షణాలు ఉంటే ప్రభుత్వాస్పత్రికి రెఫర్‌ చేయాలన్నారు. ఆర్‌ఎంపిలు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి సెలైన్‌ బాటిళ్లు ఎక్కిస్తే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కాన్పు కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డాక్టర్‌ మనోజ్‌ కుమార్‌ పాల్గొన్నారు.