Nov 23,2020 06:51

బరంపురానికి చెందిన వికాసం (వికాసాంధ్ర సాహితీ సాంస్కృతిక సంవేదిక) 50 ఏళ్లు పూర్తి చేసుకొని 51వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఒక సాహితీ సంస్థగా ఇది సాధారణ విషయం కాదు. 1970 నవంబరు 14 తేదీన సుప్రసిద్ధ రచయిత అవసరాల రామకృష్ణారావు గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వేదిక ఇన్నాళ్లు మనగలగడం ఒక విశేషం. పదీ పదిహేను మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థ మూడు తరాల సభ్యులను తన వొడిలో లాలించి సాహిత్యకారులుగా తీర్చిదిద్దింది. భార్యా వియోగంతో మాస్కోలో ఉండలేక బరంపురం స్వగృహానికి తిరిగివచ్చిన డాక్టర్‌ ఉప్పల లక్ష్మణరావు గారు లాంటి మేధావి, కాకలు తీరిన సాహితీవేత్త, సామ్యవాది సాన్నిహిత్యం లభించడం; ఆయన అధ్యక్షతన దశాబ్దికి పైగా సంస్థ కొనసాగటంతో సంస్థ జీవిత గమనం ఆదర్శవంతంగా మారిపోయింది. సంస్థలో ప్రగతిశీల భావాల ప్రసారం జరిగి ఒక ఆదర్శవంతుల సమూహం తయారైంది. మహీధర రామమోహనరావు, కేవీ రమణారెడ్ది, కొలకలూరి ఇనాక్‌, రాచమల్లు రామచంద్రా రెడ్డి, కాళోజీ నారాయణరావు లాంటి ప్రముఖులు సంస్థ కృషిని గమనించి ఎంతగానో ప్రశంసించారు.
జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌, వరవరరావు, శివారెడ్ది, శీలా వీర్రాజు, కుందుర్తి ఆంజనేయులు, నగముని, వాకాటి పాండురంగారావు, పురిపండా అప్పలస్వామి, రోణంకి అప్పలస్వామి, బెజవాడ గోపాలరెడ్డి, చాసో, చాగంటి తులసి, చెరబండరాజు, చందు సుబ్బారావు, పెనుగొండ లక్ష్మి నారాయణ, వేగుంట మోహన ప్రసాద్‌, టీఎల్‌ కాంతారావు, మానేపల్లి సత్యనారాయణ, కాళీపట్నం రామారావు, గూడా శ్రీరాములు .. ఇలా ఎందరో సంస్థ అతిధులుగా వచ్చి సంస్థకు సాహిత్య స్ఫూర్తిని అందించారు. తరువాతి తరంలో కొప్పర్తి, సతీష్‌ చందర్‌, అట్టాడ, చిన వీరభద్రుడు, కె.ఎన్‌.మల్లీశ్వరి, ఓల్గా, నందిని సిద్ధారెడ్డి, ఎన్‌.వేణుగోపాల్‌ ... తదితరులూ వికాసం సమావేశాల్లో పాల్గొని సంస్థను అభినందించిన వారే! వికాసంలో దేవి బచ్చు సుభద్రామణి, ఉమాదేవి, సుశీల, రమాదేవి, కవిత, కృప, పుష్పలత, కోకా సావిత్రి, మహాలక్ష్మి మహిళా సభ్యులు. సంస్థ కార్యదర్శిగా బిఎల్‌ఎన్‌ స్వామి గారు చాలాకాలం వ్యవహరించారు. తాతిరాజు, విజయచంద్ర తదనంతర కాలంలో కార్యదర్శులుగా ఉన్నారు. ఆదినారాయణ, కె.ఎల్‌.ప్రసాద్‌, మాచిరాజు, బీనారావు, నిర్మలరావు, ఏకాంబరం, మల్లా ప్రగడ రామారావు, పి.శంకరరావు, ఐఎస్‌ఎన్‌.మూర్తి, రఘురామయ్య, పొన్నాడ కుమార్‌, రమేష్‌ రాజు, సహదేవరావు, జగన్నాధ్‌ దాస్‌, కెనారా, ప్రత్తి చిట్టిబాబు, చంద్రయ్య రాజు, జల్లూరి క్రిష్ణారావు, కె.క్రిష్ణారావు, ధర్మపురి క్రిష్ణమూర్తి, శ్రీహరిరావు, పీ.వి.రాజు, గరిమెళ్ళ సత్యనారాయణ, రఘు, కిషోర్‌దాస్‌, కేదారినాథ్‌, రఘునందన గార్గేయ, రొక్కం కామేశ్వరరావు, జామి తిరుమల, వివి రామనరసింగరావు, దినకర్‌, మండపాక కామేశ్వరరావు, ఇమ్మిడిశెట్టి రమేష్‌, దాసరి జీవన కుమార్‌ ప్రభృతులు పాత కొత్తతరం రచయితలు. సంస్థ అధ్యక్షులుగా లక్ష్మణరావు గారి తరువాత బీఎల్‌ఎన్‌ స్వామి గారు, దేవరకొండ సహదేవరావు, ధర్మపురి కృష్ణమూర్తి మాష్టారు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత అధ్యక్షుడు మండపాక కామేశ్వరరావు. వికాసం ఫేసుబుక్‌ గ్రూపు ఆయన నిర్వహకుడు ఆయనే. వికాసంలో సగటున ఏటా 50 సమావేశాలు జరిగేవి. 400 సాహిత్య ప్రక్రియలు వచ్చేవి. సాహిత్య విమర్శలు 150 దాకా ఉండేవి. చర్చలు, గోష్టులు, ప్రశ్నావళి కార్యక్రమాలు, క్లుప్త గోష్టి, మనో వికాసం, భేటీ కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో జరిగేవి. సంస్థ వార్షికోత్సవాల సందర్భంలో వికాసవాణి పేరిట సభ్యుల రచనలతో, కార్యదర్శి నివేదికతో ఒక చిన్న బులిటెన్‌ విడుదల తప్పనిసరిగా ఉండేది.
1979లో జనవరిలో ఆంధ్ర భాషాభివృద్ధిని సమాజం ఆధ్వర్యంలో జరిగిన అఖిల భారత తెలుగు రచయతల సమ్మేళనంలో వికాసం ప్రముఖ పాత్ర నిర్వహించింది. ఆ సభలకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో రచయతలు, కవులు తరలి వచ్చారు. ఈ సభల్లో మహాకవి శ్రీశ్రీకి, డాక్టర్‌ ఉప్పల లక్ష్మణరావు గారికి ఒకే వేదిక మీద సన్మానం జరగడం ఒక మరుపురాని జ్ఞాపకం. 1981లో వికాసం ఒరియా తెలుగు సాహిత్య సమ్మేళనం ఏర్పాటు చేసింది. ఈ సభలో ఒరిస్సా సాహిత్య అకాడెమి అధ్యక్షులు సురేంద్ర మహంతి, పురిపండా అప్పలస్వామి, ఒరియా రచయితలు చంద్రశేఖర్‌ రథో, డాక్టర్‌ ప్రతిభా సత్పతి, రమేష్‌ పాణిగ్రహి, డాక్టర్‌ హరిహర దాస్‌, డాక్టర్‌ బేణిమాధవ్‌ పాడీ, తెలుగు రచయతలు వేగుంట మోహన్‌ ప్రసాద్‌, టీఏల్‌ కాంతారావు, కె.రామ్మోహన్‌ రారు, డాక్టర్‌ చాగంటి తులసి, వాకాటి పాండురంగారావు పాల్గొన్నారు.
2015 నవంబరులో వికాసం కళింగాంధ్ర తెలుగు సాహిత్యం మీద కేంద్ర సాహిత్య అకాడెమి సహకారంతో ఒక సదస్సు నిర్వహించింది. ప్రముఖ కవి ఎన్‌.గోపి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో అనేకమంది వికాసం రచయితలు, ఇతర ప్రముఖులు విభిన్న సాహిత్య, భాషా అంశాల మీద పత్రాలు సమర్పించారు. వికాసం తొలి ప్రచురణలు 'మనం మనం బరంపురం' కథా సంపుటి, 'ఉండండుండండి' కవితా సంపుటి. లక్ష్మణరావు గారు 'అతడు ఆమె' నవల, 'బతుకు పుస్తకం' స్వీయ చరిత్ర, 'భారతదేశంలో బానిసల స్థితిగతులు' వాల్టెర్‌ రూబెన్‌ జర్మన్‌ రచనకు తెలుగు అనువాదం ప్రచురించారు. విజయచంద్ర 'ఆహ్వానం', 'మౌనలిపి', 'మహా ఘోష', 'నరక సృష్టి', 'జై గంగే', 'ప్రేమిస్తు', 'అసంఖ్యాక నక్షత్రాలు ఒక ఆకాశం', 'నీలి లాంతరు', 'ఊదారంగు కలలు' అను తొమ్మిది కవితా సంపుటాల్ని వెలువరించారు. సంస్థ పూర్వ అధ్యక్షులు దేవరకొండ సహదేవరావు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారి మీద పరిశోధనా గ్రంధం, 'చురుక్కులు' అనే కవితా సంపుటి, 'మనసులో నువ్వే' అనే కథా సంపుటి ప్రకటించారు. రొక్కం కామేశ్వరరావు 'బ్లోఅవుట్‌', 'చిదాకాశం', 'పదహారు', 'అంతర్వీక్షణం', 'క్షతగాత్ర', 'జ్ఞానామృతం' కవితా సంపుటాలు వెలువరించారు. ఈ వేదిక రచయితల రచనలు అనేక దిన, వార, మాస పత్రికల్లో చోటు చేసుకున్నాయి. గత ఫిబ్రవరిలో సాహిత్య అకాడెమి మణిపూర్‌లో నిర్వహించిన వివిధ భాషా కవుల సభకు తెలుగు సాహిత్య ప్రతినిధిగా సంస్థ కార్యదర్శి కవి విజయ చంద్ర పాల్గొన్నారు.
వికాసం స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అనుకున్నాము. కానీ,కరోనా భూతం వల్ల మా ఈ ఆలోచన నెరవేరలేదు. జూమ్‌ యాప్‌లో ఈ ఉత్సవాల్ని చేయడానికి మనస్కరించడం లేదు. అందువల్ల వచ్చే యేడాది నవంబరులో అంతా సద్దుమణిగేక ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నాం.
                                                       - విజయ చంద్ర, కార్యదర్శి, వికాసం
                                                        94387 20409