Jul 31,2021 07:45
  • ఆందోళనలో ఆర్‌టిసి ఉద్యోగులు
  • స్పందించని ప్రభుత్వం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ ఆర్‌టిసి ప్రభుత్వంలో విలీనం అనేది తమ చివరిదశ జీవితాల్లో వెలుగులు నింపుతుందనుకుంటే చీకట్లను మిగుల్చుతోందని ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహా సౌకర్యాలతోపాటు పింఛను కూడా వస్తుందని ఆశించిన వారికి ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఎపిఎస్‌ ఆర్‌టిసి ఉద్యోగులను 2020 జనవరి 1న ప్రభుత్వంలో విలీనం చేసి ప్రజా రవాణాశాఖ (పిటిడి) ఏర్పాటు చేసినపుడు ప్రతి ఉద్యోగీ స్వాగతించారు. ఒకటిన్నరేళ్ల తర్వాత సర్వీసు రూల్స్‌ నిబంధనలు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. 10 శాతం ఉద్యోగులకు ఈ నిబంధనలు సంతృప్తి కలిగించినా... మెజార్టీ ఉద్యోగులకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. 1980 దశకంలో ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బి, హైవేస్‌ లాంటి సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు కల్పించిన సౌకర్యాలను తమకు వర్తింపజేస్తారని ఆశించిన ఆర్‌టిసి ఉద్యోగులకు కొత్త సౌకర్యాలు రాకపోగా, ఉన్న సౌకర్యాలను తీసేయడం వారిలో ఆందోళన కలిగిస్తోంది. గతేడాది విలీనం జరిగిన జనవరి ఒకటి నుంచే అప్పటి వరకూ ఉన్న పథకాలన్నింటినీ రద్దు చేశారు. ఇఎస్‌ఐసి వైద్యసౌకర్యాన్ని తీసి దాని స్థానంలో ఇహెచ్‌ఎస్‌ను తెచ్చారు. ఉద్యోగుల బకాయిల చెల్లింపు నిలిచిపోయింది. మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన వారికి మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ పథకం ప్రకారం పింఛను, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అనే కార్యక్రమం నిలిచిపోయింది. రివైజ్డ్‌ పింఛను లేకుండా నిబంధనలు తయారు చేశారు. ఎడిసి ప్రమోషన్‌ పొందే విధానాన్ని రద్దు చేసేలా విద్యార్హతల నిబంధనను తీసుకురావడం పట్ల ఆర్‌టిసి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే హెచ్‌ఆర్‌, పింఛను లాంటి సౌకర్యాలు తమకు అందించాలని ఆర్‌టిసి ఉద్యోగులు కోరుతున్నారు.