Jul 30,2021 21:01

matladutunna murala rajesh

అప్రజాస్వామిక విధానాలను ఒప్పుకునేది లేదు : మురాల రాజేష్‌
ప్రజాశక్తి-మోపిదేవి
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఏమాత్రం ఒప్పుకునేది లేదని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం తూర్పుకృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి మురాల రాజేష్‌ స్పష్టంచేశారు. శుక్రవారం ఘంటసాల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన అనంతరం పలు సంఘాల నేతలు మండల స్థాయి జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురాల రాజేష్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 1 నుంచి 6వ తేదీ వరకు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. 9న క్విట్‌ ఇండియా పూర్తితో సేవ్‌ ఇండియా దినోత్సవంలో భాగంగా నిరసనలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సిఐటియూ తూర్పుకృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు శీలం నారాయణరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నెలల చట్టాలను వెంటనే రద్దు చేయాలని, కార్మిక చట్టాలను రద్దు చేయడాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ కార్మికులకు బకాయిలు వెంటనే చెల్లించాలని, కులాల విభజన చేయొద్దని కోరారు. కరోనా కారణంగా మతి చెందిన ఫ్రంట్‌ లైన్‌ వారియర్లకు రూ.50 లక్షల బీమా ఇవ్వాలని కోరారు. ఎస్‌.విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు వాకా రామచంద్రరావు, సిఐటియూ, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల నేతలు కొండపల్లి శ్రీకాంత్‌, మేడంకి వెంకటేశ్వరరావు, బలే రమేష్‌, వెనిగళ్ల నాగమణి, కే.భారతి, మాచర్ల శివకుమారి, జొన్నలగడ్డ చిన్నారి పాల్గొన్నారు.