
ప్రజాశక్తి - చింతలపూడి
నిరుపేద కుటుంబాలకు మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ అండగా ఉంటుందని ఈ సంస్థ సభ్యులు తెలిపారు. మండలంలోని సుప్రీంపేటకు చెందిన ఎస్తేరు భర్త చనిపోయాడు. ఇద్దరు చిన్నారులతో కుటుంబం గడవడానికి ఇబ్బందిపడుతుండగా ఆ కుటుంబానికి సంవత్సరానికి సరిపడా నిత్యావసర సరుకులు అందజేస్తామని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఈ నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ఎక్కడ ఆపద ఉంటే అక్కడికి సంస్థ అధినేత రోషన్ కుమార్ తమ టీమ్‌ను పంపించి నిత్యావసర సరుకులు అందజేస్తారని తెలిపారు. పాత చింతలపూడిలో బోడా బాబూరావు కుటుంబంలో వారి తల్లిదండ్రులకే కాకుండా అతని కూడా ప్రమాదం జరగడంతో వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆ కుటుంబానికి కూడా నెలకు వెయ్యి రూపాయలు, నిత్యావసర సరుకులు సంవత్సరం పాటు అందజేస్తామని తెలిపారు. జంగారెడ్డిగూడేనికి చెందిన చిన్నారి రాధాచంద్రిక మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా వారి కుటుంబానికి నెలకు రూ.5 వేలు చొప్పున సంవత్సరంపాటు ఇవ్వనున్నట్లు తెలిపారు. లింగపాలెం మండలంలో ఇటీవల మరణించిన బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం చేసి, ఆ కుటుంబం ఆర్థికంగా బలపడడానికి కుట్టుమిషన్ అందజేసినట్లు తెలిపారు. లాక్డౌన్ సమయంలో అనేక మందికి సహాయం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చార్లెస్, ఆనంద్, చైతన్య, ప్రవీణ్ జోజి పాల్గొన్నారు.