Apr 08,2021 19:59

సాలూరు (విజయనగరం) : పారిశుధ్య పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్కోస్‌ (ఎపి కాంట్రాక్టు అండ్‌ అవుట్‌ సోర్సింగ్‌ సర్వీసెస్‌)ను రద్దు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా సాలూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు టి.వెంకటరావు మాట్లాడుతూ కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, ఆప్కోస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల పిఎఫ్‌, ఇఎస్‌ఐ బకాయిలు చెల్లించాలని కోరారు. 60 సంవత్సరాల వయసు నిబంధన ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ రమణమూర్తికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు టి.శంకరరావు, శ్రామిక మహిళా కన్వీనర్‌ టి.ఇందు కార్మికులు పాల్గన్నారు.