Jul 31,2021 08:06
  • ప్రజలను చీల్చే యత్నం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి జరిగే చర్చను పక్కదోవ పట్టించడంతో పాటు, రాష్ట్రంలో బలపడటానికి ప్రజలను చీల్చే విద్వేష వ్యూహానికి బిజెపి దిగుతోంది. కొద్ది రోజులుగా ఆ పార్టీ నాయకులు ఈ దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల ఢిల్లీలోని పెద్దలను కలిసి వచ్చిన వెంటనే దేవాలయాల సందర్శన పేరుతో రాష్ట్ర పర్యటన చేపట్టారు. కడపజిల్లా పొద్దుటూరులో టిప్పుసుల్తాన్‌ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బిజెపి నేతలు అందోళనకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. హిందువుల ఆలయాల్లోని సొమ్మును ముల్లాలు, క్రిస్టియన్‌ ఫాస్టర్లకు జీతాల రూపేణా ఇస్తున్నారంటూ అసత్య ప్రచారాన్ని ఆ పార్టీ ప్రారంభించింది. బక్రీద్‌ పండుగ నేపధ్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గోవధ బిల్లు గురించి చేసిన వ్యాఖ్యలనూ అవకాశంగా తీసుకుని ప్రజలను రెచ్చగొట్టడానికి బిజెపి నేతలు ప్రయత్నించారు. శ్రీశైలం దేవస్ధానం షాపుల్లో దశాబ్ధాల తరబడి ఇతర మతస్తులు చేస్తున్న వ్యాపారాలను వివాదాస్పదం చేయడానికి ప్రయత్నించారు. ఈ విషయంపై తెలంగాణకు చెందిన బిజెపి ఎమ్మెల్యే, శ్రీశైలం ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీనికి తోడు హిందూ ధర్మంపై దాడి జరుగుతోందంటూ ఆందోళనలకూ ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఒకదాని తరువాత ఒకటిగా బిజెపి ఈ తరహాలో రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది.

                                                                ప్రజాసమస్యలపై మౌనం

    మతం పేరుతో ప్రజలను చీల్చి లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్న బిజెపి రాష్ట్ర నాయకత్వం వివిధ సమస్యలపై మౌనం వహించడమో, దాటవేత వైఖరిని అవలంబించడమో చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం- నిర్వాసితుల సమస్య, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్‌ లాంటి అంశాల్లో కేంద్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న బిజెపి నాయకులు పెదవి విప్పడం లేదు. కృష్ణా జలాల విషయంలో కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను రాయలసీమ,నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సమస్యలు ఎదురవుతున్నప్పటికీ బిజెపి నాయత్వం దానిని ఖండించలేదు.