Sep 15,2021 22:10

ప్రజాశక్తి-అమరావతి : కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కుంటున్న ఇద్దరు ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరీలకు హైకోర్టు బుధవారం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లను జారీ చేసింది. వీరికి ఈ నెల 29న శిక్ష ఖరారు చేస్తామని తెలిపింది. సెరికల్చర్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక ఉద్యోగులు కొందరు తమ సర్వీసులను క్రమబద్దీకరించాలని కోరుతూ గతంలో పిటిషన్‌ వేశారు.. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వారిని క్రమబద్దీకరించాలని ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలు అమలుకు నోచుకోలేదు. దీంతో ఉద్యోగులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరీలను బుధవారం విచారణకు ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించింది. అయితే, బుధవారం జరిగిన విచారణకు ఈ ఇద్దరు అధికారులు హాజరుకాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఇద్దరికీ నాన్‌బెయిలబుల్‌ వారంట్లు జారీ చేసింది. విచారణను 29వ తేదికి వాయిదా వేసింది. అదేరోజు వీరిద్దరికి శిక్షలు ఖరారు చేస్తామని ప్రకటించింది.