Jan 13,2021 19:22

సంక్రాంతి ... ఇళ్లకు, ఊళ్లకు కొత్త కాంతులను అద్దే పండగ. పిల్లాపాపలతో ఊరు ఊరంతా కలివిడిగా మురిసే పండగ. ఈసారి కరోనా పరిణామాల వల్ల కొంత సందడి తగ్గినా ... ఎక్కడెక్కడో ఉన్న ఊరి జనం... కన్న ఊరి ఒడిలోకి చేరటమే గొప్ప పర్వదినం.
సంక్రాంతి పూర్తిగా ప్రకృతి సంబంధమైన పండగ. వ్యవసాయ ప్రధానమైన వేడుక. వ్యవసాయ సంబంధాల్లోనూ, ఇతరత్రా వచ్చిన అనేకనేక పరిణామాల వల్లా సంక్రాంతి సంబరాల్లో కొన్ని మార్పులు వచ్చినా- ఆ శోభ తగ్గినట్టుగా అనిపించదు. పైగా ఈకాలంలో సమకూరిన సరికొత్త హంగులు బోలెడు. ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, టోర్నమెంట్లు, వీధుల్లో స్వాగతాల బ్యానర్లు, శుభాకాంక్షల హడావిడులూ ప్రతి ఊళ్లో ఉంటున్నాయి. సినీ, టీవీ తారలతో కార్యక్రమాలు, కుటుంబాల కలయికలు, స్కూలు బ్యాచ్‌మేట్ల సమ్మేళనాలూ, ఆ సందర్భంగా కుటుంబ పెద్దలకు, గురువులకూ సన్మానాలు ... ఇవన్నీ ఈమధ్య పెరిగాయి.

haridas


ఎక్కడెక్కడ ఉన్నవారైనా పిల్లాపాపలతో సంక్రాంతికి సొంతూరు చేరటం రివాజుగా వస్తోంది. అది ఊళ్లో ఉన్న పెద్దలకు, బంధువులకూ గుండెనిండినంత సంతోషాన్నిస్తుంది. పిల్లలను మధురంగా, మనవళ్లను మధురాతిమధురంగా చూసుకొని- అమ్మ మనసు ఆనందపరవశ మవుతుంది. పొడవైన శీతల రాత్రులు కూడా కబుర్లతో చిన్నవై పోతాయి. పాత మిత్రులు కలిసినప్పుడు చెప్పుకునే చిన్ననాటి సాహసాలూ, సరదాలు గొప్ప కాలక్షేపమవుతాయి. తలచిన మనుషులందరినీ కలిసే అవకాశం ఇస్తుంది సంక్రాంతి. కలగలిసిన బంధుమిత్రులందరినీ ఉమ్మడిగా తలచుకునే భాగ్యాన్నిస్తుంది శీతల రాత్రి! పిల్లలే కాదు, పాపలే కాదు; పెద్దలే కాదు, యువకులే కాదు- అందరూ హాయిగా గడిపే పండగ ఇది. అందుకే అందరి పండగ.


కుదుళ్లను కలిపే పండగ
బతుకుకోసం, బాగుకోసం; చదువుకోసం, ఉద్యోగం కోసం పుట్టిన ఊరిని, కన్నవారిని వదిలి దూరాలకు వెళ్లడం నేడొక తప్పనిసరి అవసరం. 30, 40 ఏళ్ల నుంచి ఈ వలస వేగం బాగా పెరిగింది. కనీసం రెండు తరాలు పట్టణ వాతావరణంలోనే ఎదిగాయి. మారిన పరిస్థితుల్లో తరానికి, తరానికీ గ్రామాలతో, మూలాలతో ఎడం బాగా పెరుగుతూ వస్తోంది. పిల్లలకు మన కుదుళ్లను పరిచయం చేయటానికి, మనం బయల్దేరిన స్థానం ఏమిటో నేరుగా చూపటానికి సంక్రాంతి ఒక మంచి అవకాశం. ఎక్కడెక్కడో ఉన్న విడివిడి కుటుంబాలన్నీ ఒక ఇంట్లో కలివిడిగా, ఉమ్మడిగా కొద్దిరోజులుగా గడిపే సందర్భం ఇది. అమ్మానాన్న అన్న రెండు మూడు పిలుపులే కాదు; అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, చిన్నాన్న, పెదనాన్న, బుల్లి పిన్ని, మావయ్య, బాబాయి, వైజాగ్‌ ఆంటీ, అమెరికా అత్త, పెద్దన్నయ్య, చిన్ని బావ ... ఇలా ఎన్నో పిలుపులూ ఆప్యాయతలూ పిల్లల అనుభవంలోకి వస్తాయి. అనుబంధాలు పెరగటానికి, ఇచ్చిపుచ్చుకోవడంలోని మాధుర్యాన్ని చవిచూడటానికీ దోహదపడతాయి.

ariselu cooking


ఇంటివంటల పండగ
సంక్రాంతి అంటేనే పిండివంటల సందడి. అరిసెలు, గారెలు, జంతికలు, సకినాలు, చెక్కలు, పోకుండలు, గవ్వలు, గజ్జికాయలు ... ప్రాంతాన్ని బట్టి, ఇంట్లో అవసరం, అవకాశాలను బట్టి- వంటలు ముందుగానే సిద్ధం అయిపోతాయి. కురెకురేలూ, లేసులూ వంటి చిరుతిండ్లు బదులు ఈ ఇంటి వంటలు నోరూరిస్తూ ఉంటాయి. వీటిలో రుచి, శుచి మాత్రమే కాదు; ప్రేమాభిమానాల రంగరింపూ ఉంటుంది. అలా అని వంటలన్నీ ఒకేలా ఉండవు. అమ్మమ్మ చేతి ఉలవచారు మహారుచి అని ప్రఖ్యాతి ఉంటుంది. భీమవరం అత్త వండే బూరెలు వెన్నలా కరిగిపోతాయని టాంటాం ఉంటుంది. బుల్లి పిన్ని పాళ్లు కలిపితే- జంతికలు గొప్ప కమ్మగా ఉంటాయనే నానుడి ఉంటుంది. ఇలా ఇంట్లో మనిషికొక బ్రాండు ఉంటుంది. వాళ్లు తయారుచేస్తుంటే- మిగిలినవారు సహాయపడుతుంటే- ఎంతో సందడిగా ఉంటుంది. కలివిడిగా, ఉమ్మడిగా అందరికోసం వండే వంటల్లో తీపి, పిండి, నూనె వంటి దినుసులే కాదు; కనిపించని ఆప్యాయత కూడా కలుస్తుంది. అందుకేనేమో ఇంటివంటకు అంత అద్భుత రుచి!

ఊరంతా మనదే ...
నిన్ను నీవాళ్లతో తలపోసి, నిన్ను నీతో జమచేసి, నిన్నొక ఒంటరి కొమ్మగా కాక, విరగాసిన గున్నమామిడి చెట్టులా పరిచయం చేస్తుంది పండగ. చిట్టితల్లినో, చిన్నబాబునో చేతికి పెనవేసుకొని ఓ సారి వీధిలోకి వెళతాం. గోడకొట్టి గోళీలాడిన అరుగులు అదృశ్యం అయిపోయినా- ఆ గురుతులు ఎదురొస్తాయి. ఆదివారం ఉదయం పూట రారమ్మని పిలిచిన పంచాయతీ రేడియో 'బాలభారతి' ఓ జ్ఞాపకమై పలకరిస్తుంది. తెలిసిన ముఖం ఒకటి ఎదురై- 'నేనెవరో చెప్పుకో..' అని వేలు పట్టి నడుస్తున్న బుల్లిపాపకు ప్రశ్నవుతుంది. పాప మన ముఖం కేసి చూస్తుంది. ఆ చూపులోని సందిగ్ధమే ఊరికీ, మనకూ ఉన్న అంతరం. ఆ ప్రశ్నకు లభించే సమాధానమే ఊరికీ, మనకూ ఉన్న సంబంధం. ఇంకో రెండడుగులు వేయగానే వీధివీధంతా పలకరింపుల పాటవుతుంది. పట్టణాల్లో, నగరాల్లో మనం మహా అయితే- అంకులమో, ఆంటీమో అవుతాం. ఊళ్లో అలా కాదు; చాలా అవుతాం. తమ్ముడూ, అన్నయ్యా, బావా, మావయ్యా, అల్లుడూ, చిన్నోడా, అబ్బాయీ, ఏరా మనవడా ... ఇంకా ఇలా ఇలా చాలా మారతాం. అక్కడక్కడ 40 ఏళ్లు నిండకపోయినా- తాతయ్యగా పరిచయం అవుతాం. ఊరంటే అంతే! నిండా బోలెడన్ని చుట్టరికాలూ, బంధుత్వాలూ. సంక్రాంతికి వెళ్లినప్పుడు ఊరు మన మనసు సంచి నిండా బోలెడు బంధాలను నింపుతుంది.

kites

ఉమ్మడిని నేర్పే పండగ
పిల్లలకు పంచుకోవడం, ఎంచుకోవడం, సర్దుకోవడం, సరిదిద్దుకోవడం నేర్పుతుంది సంక్రాంతి. అమ్మమ్మ బుజ్జిగాడికి తీసిన చారల చొక్కా వేణుగాడికి నచ్చుతుంది. సాహితి వంకీల గాజు హారతికి ఇష్టంగా అనిపిస్తుంది. అప్పటికప్పుడు పెద్దలు గమనించి, ఎవరికి నచ్చింది వారికి ఇప్పిస్తే పిల్లలకు ఇచ్చిపుచ్చుకోవటం తెలిసొస్తుంది. భరత్‌ చేసిన రంగురంగుల గాలిపటం బన్నీకి ఇస్తాడు. చిట్టి గాడికి పీపీ విజిల్‌ని కుమార్‌ రాజా ప్రజెంట్‌ చేస్తాడు. వీధిలోని ఐస్‌ఫ్రూట్‌ బండి చుట్టూ బాలమూక చేరుతుంది. ఎవరికి ఏం కావాలో ఇచ్చేయమని ఏ అమర్‌ మావయ్యో బండి వాడికి ఆర్డరేస్తాడు. చిన్నిగాడికి నచ్చిన వెనీలా ఫ్లేవరు బంటి గాడి చేతిలో ఉంటుంది. బంటి బాబు ఫేవరేట్‌ చాకో స్ఫూర్తి దగ్గర ఉంటుంది. అప్పుడు వాళ్లు ఎంచుకున్న వాటిని తిరిగి పంచుకోవడం మనకూ కనువిందుగానే ఉంటుంది. తేడా లొచ్చినప్పుడు లేచే పేచీలు కూడా పండక్కి పసందే! నాన్నమ్మ ఇచ్చే చిరుతిళ్లను అందరికీ ఇవ్వడం, మంచినీళ్ల సరఫరా, వరండాలో సర్దుకొని పడుకోవడం, అర్జెంటు వారికి బాత్‌రూమును వదలటం... ఇలా ఈ పండగ నేర్పే సర్దుబాట్లూ, ఉమ్మడితనాలూ ఎన్నో!
ఇలా ఇలా చాలా బంధాలను, అనుబంధాలను అనుభవంలోకి తెస్తుంది సంక్రాంతి. పిల్లలకు, పెద్దలకు, ఊరికి మనకూ, ఉరుకురికే మనసుకు ఒక ఆత్మీయ బంధాన్ని ముడివేస్తుంది. ఏదో కొత్తగా తెలుసుకున్నట్టు, ఇంకేదో కొత్తగా పెనవేసుకున్నట్టు మనసుకు అనిపిస్తూ ఉంటుంది.
పండక్కి ఇంటికొచ్చినవారు తమ తమ కొలువులకు, నెలవులకు తిరిగి ప్రయాణం కడుతున్నప్పుడు- ఎవరో అంటారు : 'ఈ మూడ్రోజులూ ఎంత సంతోషంగా గడిపామో..! ఈ సంక్రాంతి ఇలాగే ఉండిపోతే బాగుణ్ణు' అని.
అప్పుడు సంక్రాంతి అంటుంది : 'ఈ సంతోషాన్ని, సందడిని నేను తీసుకురాలేదు. తీసుకుపోనూ లేదు. మీరే తెచ్చారు.. మీరే పంచారు... సమిష్టితనమే సంక్రాంతి.. సామూహిక సందడే సంక్రాంతి.' అని.
- శాంతిమిత్ర

pongallu

 

youth