May 18,2021 22:27

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
రాష్ట్ర అసెంబ్లీ సమావేశం గురువారం జరగనుంది. కరోనా విస్తరణ నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఒక్కరోజుకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. గురువారం ఉదయం జరగనున్న శాసనసభ వ్యవహారాల కమిటీ (బిఎసి) సమావేశంలో ఈ మేరకు అధికారికంగా ప్రకటించనున్నారు. అదే జరిగితే, గవర్నర్‌ ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జెట్‌ ప్రవేశపెట్టడం, చర్చ, ఆమోదం వంటి కీలక అంశాలన్నీ ఆరోజే ముగియనున్నాయి. వీటితో పాటు ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం కూడా తెలపాల్సిఉంది. శాసనసభ ప్రారంభానికి ముందే రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగిన బడ్జెట్‌ ప్రతిపాదనలను లాంఛనంగా ఆమోదించాల్సిఉంది. ఇన్ని కీలకాంశాలు ఒక్క రోజులోనే జరగనుండటం శాసన సభ చరిత్రలో ఇదే మొదటిసారి. సాధారణ సమావేశాల కన్నా బడ్జెట్‌ సమావేశాలు ఎక్కువ రోజులు జరుగుతాయి. కరోనా వ్యాప్తి కారణంగా గతంలో మాదిరి సమావేశాల నిర్వహణ సాధ్యం కాదని, మరోవైపు బడ్జెట్‌ ప్రతిపాదనలను శాసనసభలో ఆమోదించుకోవాల్సిన రాజ్యాంగ బాధ్యత ఉండటం ఈ నిర్ణయానికి కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా, తూతూమంత్రంగా ఒక్కరోజు జరిగే సమావేశం వల్ల ప్రయోజనం లేదని, దీనిని బహిష్కరిస్తున్నామని టిడిపి ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు విశాఖలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. మార్చి నెలలో 9 వేల కరోనా కేసులున్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయలేమని చెప్పిన ముఖ్యమంత్రి, ఇప్పుడు 2.20 లక్షల పాజిటివ్‌ కేసులు ఉన్న సమయంలో ఎలా సమావేశాలను ఏర్పాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు. శాసనమండలి టిడిపి ఫ్లోర్‌లీడర్‌ యనమల రామకృష్ణుడు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ప్రజల రక్షణ వదిలేసి ఇప్పుడు సమావేశాలు పెట్టడం సరైంది కాదని ఆయన అన్నారు.
రాజ్‌భవన్‌ నుండే గవర్నర్‌ ప్రసంగం :
రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రాజ్‌భవన్‌ నుండే ఉభయసభల నుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన ప్రసంగం ప్రారంభం కానుందని సమాచారం. అంతకు అరగంటముందు ఉదయం 8.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో క్యాబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే బడ్జెట్‌ ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించనుంది. గవర్నర్‌ ప్రసంగం అనంతరం బిజినెస్‌ ఎడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించి సమావేశ నిర్వహణపై అధికారికంగా నిర్ణయం తీసుకుంటున్నారు. సాధారణ బడ్జెట్‌తోపాటు వ్యవసాయ బడ్జెట్‌నూ విడిగా ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మండలిలో మంత్రి బొత్సనారాయణ బడ్జెట్‌ ప్రవేశపెటనున్నట్లు తెలిసింది. కరోనాతో బద్వేలు ఎమ్మెల్యే గుంతోటి వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ఇటీవల చనిపోయారు. వీరికి సంతాప తీర్మానాలను కూడా సభ ఆమోదించాల్సిఉంది.
ఆనవాయితీలకు చెల్లు...
కరోనా కారణంగా గతంనుండి వస్తున్న అనేక సంప్రదాయాలకు, ఆనవాయితీలకు తాజా సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చెల్లుచీటి ఇవ్వనుంది. గవర్నర్‌ ప్రసంగం తరువాత సాధారణంగా సభను వాయిదా వేసి, ఆ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కనీసం రెండు, మూడు రోజులు చర్చించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి ఆ సాంప్రదాయాన్ని పాటించడం లేదు. అదే విధంగా సిట్టింగ్‌ సభ్యులకు సంతాపం తెలిపిన తరువాత ఆ రోజు కార్యాక్రమాలకు సభ దూరంగా ఉండటం ఆనవాయితి. ఈ సారి దానిని పట్టించుకోవడం లేదు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థికమంత్రి ప్రసంగం ముగియగానే సభను వాయిదా వేయడంతో పాటు కనీసం రెండు,మూడు రోజులు సెలవు ఇవ్వడం కూడా సాంప్రదాయంగా ఉంది. బడ్జెట్‌ను శాసనసభ్యులు అధ్యయనం చేయడానికి ఈ సమయాన్ని కేటాయించేవారు. ఈ సారి మాత్రం బడ్జెట్‌ పెట్టడం, ఆ వెంటనే చర్చను నిర్వహించి, ఆమోదింపచేసుకోవడం జరగనుంది.
అనివార్యమయ్యే... బుగ్గన
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనివార్యమయ్యే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఎక్కువకాలం ఒకేచోట ఉండే అవకాశాలు లేకపోవడం, ఎసి హాలు కావడం తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు. మండలి సభ్యుల్లో ఎక్కువమంది ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, హైరిస్కు కేటగిరీలో ఉన్నారని, వారి ఆరోగ్య రక్షణ కూడా చూడాల్సి ఉందని చెప్పారు.

కొంతైనా చర్చ జరగాలి : పిడిఎఫ్‌ డిమాండ్‌
బడ్జెట్‌పై కొంతైనా చర్చ జరగాలని శాసన మండలి పిడిఎఫ్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ కెఎస్‌ లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌లోని అన్ని అంశాలు ఆమోదం పొందాలంటే, ఒక్క రోజే నిర్వహించడం న్యాయం కాదన్నారు. కనీసం మూడు రోజులైనా చర్చ జరపాలని కోరారు. ప్రధానంగా వైద్య, ఆరోగ్య రంగాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా కరోనా నేపధ్యంలో వనరుల సమీకరణ సక్రమంగా లేదని, కాబట్టి వనరుల సమీకరణపై దృష్టి పెట్టాలని కోరారు. ఇందులో భాగంగా కేంద్రప్రభుత్వంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. కరోనా నేపధ్యంలో ఏర్పడిన తక్షణ సమస్యలను పరిష్కరించే విధంగా బడ్జెట్‌ ఉండాలని కోరారు. సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందిస్తున్న వారికే కాకుండా ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, సంఘటిత రంగ కార్మికులు మొదలైన వారికి కూడా రాష్ట్రప్రభుత్వం సహాయం అందించే విధంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉండాలని సూచించారు.