Jun 13,2021 16:56

చెత్తసేకరణ ఆటోను ప్రారంభిస్తున్న మేయర్‌, ఎమ్మెల్యే

ప్రజాశక్తి - గుంటూరు : 'క్లీన్‌ గుంటూరు'లో ఇంటింటి చెత్త సేకరణ విద్యుత్‌ ఆటోలను బ్రాడీపేటలో మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ నాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులకు మూడు రకాల డస్ట్‌బిన్‌లు, గుడ్డ సంచులను అందించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌ (సిఎల్‌ఎపి)లో భాగంగా నగరంలో 7, 32 డివిజన్లను మోడల్‌గా ఎంపిక చేశామని, ఇంటింటి చెత్త సేకరణకు త్వరలో 220 ఎలక్ట్రిక్‌ ఆటోలను అందుబాటులోకి తేనున్నామని చెప్పారు. తడి-పొడి చేత్తను వేర్వేరుగా సేకరించి ఎరువునూ తయారు చేస్తామని, చెత్త సేకరణకు ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఇంటికి రోజుకు రూ.2 లేదా రూ.4 వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఈ విధానాన్ని త్వరలోనే అన్ని డివిజన్లలోనూ అమలు చేస్తామని తెలిపారు. కమిషనర్‌ చల్లా అనురాధ మాట్లాడుతూ పన్నుల గురించి ఆలోచిస్తే పారిశుధ్య బాగోకుంటే వచ్చే రోగాలకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు. మోడల్‌ డివిజన్లలో అన్ని సమస్యల పరిష్కారం కోసం క్విక్‌ రెస్పాన్స్‌ టీంను ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చేనెల 8వ తేదీ నుండి ఎలక్ట్రికల్‌ ఆటోల ద్వారా చెత్త సేకరణ చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఎం.గిరిధర్‌ మాట్లాడుతూ యూజర్‌ ఛార్జీలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ ఈచంపాటి వెంకటక్రిష్ణ, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ శ్రీనివాసరావు, ఎస్‌ఇ డి.శ్రీనివాస్‌, డిప్యూటి కమిషనర్లు డి.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరావు, టి.వెంకటకృష్ణయ్య, ఎంహెచ్‌ఒ వెంకటరమణ, డిసిపి హిమబిందు, బయాలజిస్ట్‌ ఓబులు, ఎస్‌ఎస్‌ రాంబాబు, ఎన్విరాన్మెంట్‌ ఇంజనీర్‌ రవీంద్ర నాయక్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, ఎఇ అనూష పాల్గొన్నారు.