
ఎరువులు కొనుక్కోడానికి పంజాబ్ రైతులు తమ సరిహద్దు రాష్ట్రం హర్యానాకు వెళ్లగా అక్కడి పోలీసులు వారిని నిర్బంధించి ఆపై అరెస్టు చేసిన ఉదంతం అన్నదాతలకు 'స్వేచ్ఛా మార్కెట్' అంటున్న బిజెపి నినాదంలోని మోసాన్ని బట్టబయలు చేసింది. నూతన వ్యవసాయ చట్టాల ద్వారా ప్రాప్తిస్తుందంటున్న 'ఫ్రీ ట్రేడ్' రైతులకు కాదు వ్యాపారులకు, కార్పొరేట్లకేనంటూ ఉద్యమిస్తున్న రైతుల భయాలను పై ఘటన రూఢి పర్చింది. కేంద్రంలోని బిజెపి సర్కారు ఏకపక్షంగా, అదీ కోవిడ్ సంక్షోభ సమయాన తెచ్చిన వినాశకర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు కొన్ని నెలలుగా రోడ్డెక్కి పోరాడుతున్నారు. రైతుల ఆందోళనలపై సానుకూలంగా స్పందించాల్సిన మోడీ ప్రభుత్వం, ఆ పని చేయకపోగా, రాజకీయ కక్షతో ఆ రాష్ట్రానికి రైలు సర్వీసులన్నింటినీ రెండు మాసాలుగా రద్దు చేసింది. రైళ్లు ఆగిపోవడంతో వస్తు రవాణా నిలిచిపోయి నిత్యావసరాల సరఫరా సహా సమస్తం స్తంభించిపోయి ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. వ్యవసాయ చట్టాల వ్యతిరేక పోరాటానికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది కాబట్టి ప్రజలను ఇబ్బందులపాల్జేస్తే, ఆ పార్టీ ప్రభుత్వంపై అసంతృప్తి పెంచుకుంటారని, తద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవచ్చన్నది బిజెపి దుష్ట పన్నాగం. అందులో భాగంగానే ఒక చేత్తో కేంద్రంలో ఉన్న అధికారంతో రైళ్లను రద్దు చేసి పంజాబ్ రైతులకు ఎరువులు అందనీకుండా చేసింది. మరో చేత్తో బోర్డర్ స్టేట్ హర్యానాలో అధికారం చెలాయిస్తూ, ఎరువుల కోసం తమ ఇలాకాకు వచ్చిన పంజాబ్ రైతులను అరెస్టు చేయించింది.
వాస్తవానికి ఆందోళనకారులు గూడ్స్ రైళ్లకు ఎప్పుడో మినహాయింపునిచ్చారు. అయినప్పటికీ కేంద్రం వాటిని కూడా రద్దు చేసిందంటే బిజెపి రాజకీయ దివాళాకోరు కోణం స్పష్టం. పోనీ.. హర్యానాలో బిజెపి ప్రభుత్వం అరెస్టు చేసిన పంజాబ్ రైతులేమన్నా పాకిస్తాన్, చైనా దేశస్తులా? ఉగ్రవాదులా? అదనుకు ఎరువులు లభ్యం కాక పైర్లను రక్షించుకునేందుకు పొరుగు రాష్ట్రంలో ఎరువులు కొనుక్కోడానికి వచ్చారు. అటువంటి వారిపై పెద్ద పెద్ద బ్లాక్ మార్కెట్ మాఫియాపై పెట్టినట్లు నిత్యావసరాలు, ఫెర్టిలైజర్స్ మూమెంట్ కంట్రోల్ యాక్టు తదితర కఠిన నిబంధనల కింద కేసులు నమోదు చేయడం దారుణం. చారిత్రకంగా చూసినా పంజాబ్, హర్యానా రాష్ట్రాల ప్రజలది అవినాభావ సంబంధం. ఆ రెండు రాష్ట్రాలకూ ఒకే రాజధాని చండీగఢ్. రైతులను అరెస్టు చేసింది రెండు రాష్ట్రాల బోర్డర్ ప్రాంతంలోనే. దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి రాకపోకలపై నిషేధం లేదు. దేశాలకు మధ్య మాదిరి ఇనుప కంచెలేమీ ఉండవు. ఇవన్నీ బిజెపి కి తెలియనివి కావు. అది ఉద్దేశపూర్వకంగా పాల్పడుతున్న అకృత్యాలు.
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల ప్రధానోద్దేశం రైతులు తాము పండించిన పంటలను ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకునే వెసులుబాటు అని బిజెపి పాలకులు చెబుతున్నారు. ఆచరణలోనేమో రైతుల కదలికలను నియంత్రిస్తోంది. బిజెపి రాజ్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్లో వరి ధాన్యానికి మద్దతు ధర రాకపోవడంతో పొరుగునున్న మరో బిజెపి రాష్ట్రం హర్యానాకు యాభై మంది రైతులు ధాన్యాన్ని తీసుకెళ్లగా హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. అటు కేంద్రంలో ఇటు రెండు రాష్ట్రాల్లో బిజెపియే ఉండి రైతులను అడ్డుకున్నాయంటే ఏమనుకోవాలి? బిజెపి చెబుతున్న స్వేచ్ఛా మార్కెట్ ఏమైనట్లు? కొత్త చట్టం రాకతో పరిమితులు ఎత్తేయడంతో వ్యాపారులు నిత్యావసర వస్తువులను అపరిమితంగా నిల్వ చేస్తున్నారు. రైతుల నుంచి పంటలు కొనుగోలు చేసిన కార్పొరేట్లు యథేచ్ఛగా రాష్ట్రాలు, దేశాలు దాటిస్తున్నారు. ప్రభుత్వాల అండతో తమ కళ్ల ముందే సాగుతున్న ఈ అన్యాయానికి రైతులు బలవుతున్నారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉదంతాలు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల్లో కసి పెంచుతున్నాయి. బిజెపి ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26, 27 తేదీల్లో జరిగే ఆందోళనల్లో యావత్ రైతాంగం పాల్గొని మరింతగా ప్రతిఘటిస్తుంది.