Apr 14,2021 23:26

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: కోవిడ్‌ టీకా వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయాలని కలెక్టర్‌ పోల భాస్కర్‌ తెలిపారు. ప్రకాశం భవనంలోని కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ను కలెక్టర్‌ బుధవారం రాత్రి ఆకస్మికంగా పరిశీలించారు. కోవిడ్‌ కేసుల నమోదు, టీకా కార్యక్రమం వివరాల నిక్షిప్తతపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ను అరికట్టడానికి జిల్లాలో 50 వేల డోసుల టీకాలు రాగా బుధవారం రాత్రికి 37,990 మందికి టీకా వేశామని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించటం లేదన్నారు. సాంకేతిక లోపంతో ఆన్‌లైన్‌లో ఎదురైన సమస్యలపై ఆయన ఆరా తీశారు. జిల్లాలో తమ పేర్లు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న 45 సంవత్సరాలు దాటిన వారందరికీ టీకా తప్పనిసరిగా వేయాలన్నారు. ఈ విషయమై అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. 230 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు బుధవారం పరీక్షలలో తేలిదన్నారు. వైరస్‌ సోకిన కేసులు పెరుగుతుండటంతో పక్కా ప్రణాళికతో సన్నిహితులను గుర్తించాలన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారి ద్వారా మరొకరికి వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్‌ ట్రేసింగ్‌ విభాగంలో సిబ్బంది కొరతపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్‌ కట్టడి చేయటానికి అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ రత్నావళి, కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌ఛార్జి డాక్టర్‌ తిరుమలరావు, డాక్టర్‌ రమ పాల్గొన్నారు.
చీరాలలో వాక్సినేషన్‌ పరిశీలన
చీరాల రూరల్‌: టీకా ఉత్సవ్‌లో భాగంగా బుధవారం చీరాల పురపాలక సంఘ పరిధిలోని 21వ వార్డు బోస్‌ నగర్‌లో వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కలెక్టర్‌ పోల భాస్కర్‌ పరిశీలించారు. అన్ని సచి వాలయాల పరిధిలో కేటాయించిన వ్యాక్సిన్‌ డోసులు పూర్తిస్థాయిలో వినియోగించేలా ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాజిటివ్‌ కేసులు గుర్తించిన ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ 100 మీటర్ల లోపుగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ కె.కృష్ణవేణి, మున్సిపల్‌ కమిషనర్‌ పి ఏసయ్య, తహశీల్దార్‌ షేక్‌ మహమ్మద్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.