Nov 19,2020 18:41

ఇప్పటి పిల్లలను నువ్వు పెద్దాయ్యాక ఏమవుతావు? అనడిగితే- చాలామంది 'డాక్టరనవుతా .. ఇంజినీరినవుతా.. ' అంటారు. అనిత మాత్రం నేను 'రైతు' నవుతా అని చెబుతుంది. ఆటపాటలతో సరదాగా గడపాల్సిన బాల్యంలో చదువుకుంటూనే వ్యవసాయం చేస్తోంది. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ... కుటుంబానికి అండగా నిలబడుతోంది.

    నల్గొండ జిల్లా శంకర్‌నాయక్‌ (గేమ్యానాయక్‌) తండాకు చెందిన అనిత (13) కుటుంబం పదేళ్ల క్రితం ప్రకాశం జిల్లా ఒంగోలుకి వచ్చింది. తండ్రి నాగేశ్వరరావుకు స్వగ్రామంలో మూడెకరాల భూమి ఉంది. అందులో ఏ పంట వేసినా నీటి సౌకర్యం లేక నష్టం వచ్చేది. ఓసారి మిరపపంట అంతా పురుగు పట్టి లక్షల్లో నష్టపోయాడు. ఆ నష్టమూ, అప్పుల భారమూ కారణంగా ఆత్మహత్యాయత్నం చేశాడు. తరువాత ఏదొకలా బతకాలనుకొని భూమిని బంధువులకు కౌలుకి ఇచ్చి, కుటుంబంతో ఒంగోలు చేరాడు. ఓ అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మెన్‌గా పనికి కుదిరిరాడు. ఇక్కడ వ్యవసాయం చేయడానికి సాగునీరు ఉంది. కానీ పెట్టుబడి డబ్బుల్లేక సాగు ఆలోచన మానుకున్నాడు. పిల్లలు ముగ్గుర్నీ ప్రయివేటు పాఠశాల్లో చేర్చాడు.

’అనిత‘ర సేద్యం
         

         రైతు కష్టాలను, సాగు ఇబ్బందులను అనిత చిన్నతనం నుంచి గమనిస్తూనే పెరిగింది. తన కుటుంబ కష్టాలను తల్లి కౌసల్య తరచూ గుర్తు చేసుకుంటూ... పిల్లలతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకునేది. అనితకు అన్న హనుమంతు, తమ్ముడు శ్రీరామ్‌ ఉన్నారు. తండ్రికి వచ్చే జీతం తల్లి ఎంత పొదుపుగా వాడినా సరిపోయేది కాదు. తండ్రి అప్పుడప్పుడు ఆటోను అద్దెకు తీసుకొని నడిపేవాడు. తాను కూడా ఏదొకలా కుటుంబానికి అండగా నిలవాలని అనుకునేది అనిత.
కౌలుకి తీసుకొని..
       అనిత 7వ తరగతి తర్వాత వేసవిలో 'ఫ్రీడమ్‌ బర్డ్‌' ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది. అక్కడ డ్రాయింగ్‌, పెయింటింగ్‌, ఇసుకతో పెయింటింగ్‌, క్విల్లింగ్‌ ఆర్ట్‌, గ్లాస్‌ పెయింట్‌ నేర్పిస్తారు. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేకంగా మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తూ వారంలో ఒక రోజూ పంట పొలాలకు తీసుకెళతారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే ఆదాయమూ, ఆరోగ్యమూ పొందొచ్చని అక్కడ అధ్యాపకుడు చెప్పిన మాటలు అనితను ఆలోచింపచేశాయి. వ్యవసాయరంగ పుస్తకాలు చదివి సాగు గురించి, లాభాలచ్చే పంటల గురించి తెలుసుకుంది. పిల్లలు ఏ రంగంపై ఇష్టం చూపిస్తారో ఆ వైపుగా ప్రోత్సహించడం ఫ్రీడమ్‌ బర్డ్‌ సంస్థ ముఖ్య ఉద్దేశం. అనితకు వ్యవసాయమంటే ఇష్టమని, మొక్కలను శ్రద్ధగా పెంచడాన్ని అక్కడ సంస్థ నిర్వహణాధికారి నాయుడు మాల్యాద్రి గమనించారు. తాను వ్యవసాయం చేస్తానని అనిత చెప్పినప్పుడు ఏదో మామూలు ఆసక్తి అనుకున్నారు. తన తండ్రి రైతు నుంచి వాచ్‌మెన్‌గా మారిన విషయాన్ని చెప్పి, కుటుంబాన్ని ఆదుకోవటానికి తాను వ్యవసాయం చేస్తానని గట్టిగా చెప్పింది. తనకు కొంత భూమిని కౌలుకు ఇప్పించమని కోరడంతో ఆయన ఆశ్చర్యపోయాడు. ఏ పని మీదా తనకు ఇష్టం లేదని, వ్యవసాయమే చేస్తానని అనిత తల్లిదండ్రులనూ ఒప్పించింది. 8వ తరగతి పూర్తయిన తర్వాత కరోనా లాక్‌డౌన్‌లో వ్యవసాయంపై దృష్టి పెడతానని మాల్యాద్రిని పదే పదే కోరింది.

’అనిత‘ర సేద్యం
       

     ఆ పట్టుదలను చూసి ఒంగోలుకు 18 కిమీ దూరంలో సంతనూతలపాడు మండలం బోడపాడులో రెండు ఎకరాల భూమిని కౌలుకి ఇప్పించారాయన. రూ.ఐదు వేల పెట్టుబడి కూడా ఆయనే సమకూర్చారు. చుట్టుపక్కల రైతులను కనుక్కొని నీటి సౌకర్యం గురించి ఆరా తీసింది. తక్కువ సమయంలో చేతికి వచ్చే ఆకుకూరలను వేయాలనుకుంది. పొలం దున్ని తోటకూర, గోంగూర, బచ్చలి, మెంతికూర, చిర్రాకు విత్తనాలు చల్లింది. బలం కోసం దిబ్బఎరువునే వాడింది. పురుగు పట్టకుండా వేపాకును నీళ్లలో మరిగించి పసుపు కలిపి స్ప్రే చేసింది. మరోసారి టూటాకు కషాయం చల్లింది. ఎకరాకు ఎంత మోతాదులో కషాయం చల్లాలో తన గురువుని అడిగి తెలుసుకుంది. ఊరిలోని కూలీల సహాయంతో ప్రతి రోజూ ఆకుకూరలను కోసి అమ్మింది. పెట్టుబడి పోనూ వచ్చిన లాభాన్ని తల్లి చేతిలో పెట్టడంతో కుటుంబం చాలా సంతోషించింది. అనిత భవిష్యత్తులో మంచి రైతు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అదే ప్రోత్సాహంతో ఇప్పుడు శ్రీవరి పంటను వేసింది. తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇస్తుందని చెబుతుంది అనిత.
రైతుగా గౌరవం
         అనిత చదువులో సాధారణ విద్యార్థి అయినా డ్రాయింగ్‌, ఆటలు, మొక్కల పెంపకం వంటి వ్యాపకాల్లో చురుగ్గా ఉంటుంది. ఎక్కువ సమయం వ్యవసాయానికి కేటాయిస్తుంది. పంట చేతికి వచ్చినప్పుడు కలిగిన సంతోషం, గౌరవం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని చెబుతుంది. వ్యవసాయ రంగమే తన జీవిత లక్ష్యమని అంటుంది. ఒకపక్క చదువు సాగిస్తూనే పొలం పనులు చక్కబెడుతోంది. అగ్రికల్చరల్‌ బిఎస్సీ చదివి వ్యవసాయంరంగంలో చాలా ప్రయోగాలు చేస్తానని అంటోంది అనిత.

                                                                                                                                                -     పద్మ