Jun 13,2021 16:51

ఏలూరు : కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృత్తికా శుక్లా అన్నారు. శనివారం ఏలూరులోని బాలుర జువైనల్ హోమ్ లో జరిగిన కార్యక్రమంలో కృత్తికా పాల్గొన్నారు. ఆశాజ్యోతి మానసిక వికలాంగుల, అనాధ పిల్లల హోమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధి గా హాజరయ్యారు.  ఈ సందర్భంగా కృత్తిక మాట్లాడుతూ కొవిడ్‌తో కన్న వారిని కోల్పోయిన పిల్లలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేరదీసి సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం సీ డబ్ల్యు సి నుంచి కానీ, శిశు సంక్షేమ శాఖ నుంచి సమాచారం వచ్చిన వెంటనే సహాయక చర్యలు చేపడతామన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ లో మార్చ్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ లో 137 మంది పిల్లలు అనాధాలుగా మారారని ఆవేదన వ్యక్తం చేసిన కృత్తికా వీళ్ళందరికి 10 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్స్ చేసి దాని ద్వారా నెల నెలా వచ్చే వడ్డీని ఆ పిల్లల నెలసరి ఖర్చులకు ఇస్తామన్నారు. అలాగే 1800 మంది పిల్లలు పాక్షిక అనాధాలుగా మారారరని, అంటే తల్లిదండ్రులు లో ఎవరో ఒకరు మరణించినా పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు 500 ఇచ్చేలా ప్రభుత్వం అదేశాలిచ్చిందన్నారు. అలాగే అనాధ పిల్లలకోసం ప్రతీ జిల్లాల్లో రెండు చైల్డ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ సందర్భంగా యూ ఎస్ లోని చికాగో ఆంధ్రా ఫౌండేషన్ అనాధ చిన్నారుల కోసం పెద్ద మనసుతో ఒక్కొక్కరికి 5 వేలు విలువ చేసే నిత్యావసర వస్తువులు, మాస్క్, శానిటైజర్లు అన్నీ పంపిణీ చేసేందుకు ముందుకు రావడాన్ని కృత్తికా అభినందించింది. హనుమాన్ జంక్షన్ కు చెందిన మానసిక వికలాంగ, అనాధ ఆశ్రమ నిర్వాకురాలు, పశ్చిమ గోదావరి జిల్లా సీ డబ్ల్యు సీ చైర్మన్ మాధవీలత సహకారం తో రాష్ట్రంలో తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులందరికి ఇలాంటి సహకారం అందించడాన్ని కృత్తికా అభినందించారు. ఈ సందర్భంగా కొంతమంది పిల్లలకు చికాగో ఆంధ్రా ఫౌండేషన్ పంపిన నిత్యావసరాల కిట్స్ ని కృత్తికా పంచిపెట్టింది. మిగతావారికి చైల్డ్ లైన్ ద్వారా అందించే చర్యలు చేపట్టింది. సీ డబ్ల్యు సీ చైర్మన్ మాధవీలత మాట్లాడుతూ మానవసేవ యే మాధవసేవ అని, తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులకు మేమున్నాం అన్న భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అలాగే చిన్నారులను ఆదుకోవడానికి చైల్డ్ కేర్ సెంటర్లు, సీసీఐ ద్వారా వారి సంరక్షణ బాధ్యతలను సీ డబ్క్యూ సీ తీసుకుంటుందన్నారు. ఇక్కడ పుట్టి విదేశాల్లో సెటిల్ అయినా జన్మభూమిపై మమకారం మరువక ఇక్కడ చిన్నారులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకు వచ్చిన చికాగో ఆంధ్రా ఫౌండేషన్ నిర్వాహకులను మాధవీలత అభినందించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు బీడీవీ ప్రసాదమూర్తి మాట్లాడుతూ అనాధ పిల్లల, సహాయం అవసరమైన పిల్లల సమాచారాన్ని సేకరించడం, ప్రభుత్వానికి తెలియపరచడం, వారి రక్షణ బాధ్యతలను ఎన్.జీ.ఓ లు కూడా తీసుకోవాలని, అందరం కలిసి అనాధ చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు.