Jul 29,2021 19:02

న్యూఢిల్లీ : తాలిబన్‌ బలవంతంగా ఆఫ్ఘనిస్తాన్‌ను తన నియంత్రణలోకి తీసుకుంటే ఇక ఆ దేశం సమాజంలో అంతర్జాతీయంగా బహిష్కరించబడిన దేశంగా మారిపోతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఆయన, ప్రజల హక్కులను గౌరవించని, తనవారిపైనే అత్యాచారాలకు పాల్పడే దేశం అంతర్జాతీయంగా బహిష్కరణకు గురైన దేశంగా మారిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా అందరి ఆమోదయోగ్యం పొందాలంటే ముందుగా వారు తమ వైఖరి మార్చుకోవాల్సి వుంటుందని తాలిబన్‌ను హెచ్చరించారు. అంతర్జాతీయ గుర్తింపు కావాలని తాలిబన్‌ కోరుకుంటోందని, పైగా ఆఫ్ఘనిస్తాన్‌కు అంతర్జాతీయ మద్దతు అవసరమని చెబుతోందని అన్నారు. పైగా తమ నేతలు స్వేచ్ఛగా ప్రపంచమంతటా పర్యటించాలని భావిస్తోందని, ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతోందని అన్నారు. ఈ లక్ష్యాలు నెరవేరాలంటే బలవంతంగా దేశాన్ని ఆక్రమించుకోవడం, ప్రజల హక్కులను దుర్వినియోగం చేయడం సరైన పంథా కాదని అన్నారు. కాగా, చైనాకు చేరుకున్న తాలిబన్‌ ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గం తమ అంతర్జాతీయ విధులు, కర్తవ్యాల పట్ల అధికారులకు హామీ ఇచ్చింది.