Jul 30,2021 12:21

మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో పెను ప్రమాదం తప్పింది. రష్యా పంపిన కొత్త రీసెర్చ్‌ మాడ్యూల్‌.. కేంద్రానికి అనుసంధానమైన కొన్ని గంటల్లోనే అందులోని థ్రస్టర్లు ఒక్కసారిగా అనుకోకుండా మండాయని నాసా అధికారులు తెలిపారు. దీంతో ఐఎస్‌ఎస్‌ దిశ అదుపు తప్పింది. అయితే, భూమిపై నుంచి దీని కదలికల్ని నిరంతరం పర్యవేక్షించే 'గ్రౌండ్‌ కంట్రోల్‌ సిస్టం' బఅందం కొద్ది నిమిషాల్లోనే తిరిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌లో ఉన్న వ్యోమగాములకు ఎలాంటి ప్రమాదం లేదని నాసా తెలిపింది.
ఇందులో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. రష్యాకు చెందిన ఇద్దరు ఆస్ట్రోనట్స్‌, నాసాకు చెందిన ముగ్గురు వ్యోమగాములు, జపాన్‌కు చెందిన ఓ ఆస్ట్రోనట్‌, ఫ్రాన్స్‌కు చెందిన యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ వ్యోమగామి ఒకరు ఇందులో ఉన్నారు. 23 టన్నుల బరువుగల 'నౌక' అనే కొత్త మాడ్యూల్‌ను గతవారం కజికిస్థాన్‌లోని బైకనూర్‌ నుంచి రష్యా పంపింది. ఇది గురువారం ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమైంది. 'స్వయం అనుసంధాన వ్యవస్థ' విఫలమవడంతో ఐఎస్‌ఎస్‌లోని రష్యా కాస్మోనాట్‌ ఓలెగ్‌ నొవిట్‌స్కీ మాన్యువల్‌గా నౌక అనుసంధాన ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో భూమిపై ఉన్న రష్యా గ్రౌండ్‌ కంట్రోల్‌ బఅందం సంబరాలు చేసుకుంది.
అయితే మూడు గంటల తర్వాత నౌకపైఉన్న థ్రస్టర్లు అనుకోకుండా మండాయి. దీంతో అంతరిక్ష కేంద్రం దిశ అదుపు తప్పింది. ఐఎస్‌ఎస్‌ భ్రమణం సెకనుకు సగం డిగ్రీ చొప్పున మారింది. అలా ఐఎస్‌ఎస్‌ ఉండాల్సిన స్థితి కంటే 45 డిగ్రీలు అదనంగా వంగింది. అప్పటికే అప్రమత్తమైన రష్యా, అమెరికా గ్రౌండ్‌ కంట్రోల్‌ వ్యవస్థలు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. మరో రష్యా మాడ్యూల్‌ జ్వెజ్డా, ప్రోగ్రెస్‌పై ఉన్న థ్రస్టర్లను మండించారు. దీంతో ఒక గంట వ్యవధిలో ఐఎస్‌ఎస్‌ తిరిగి నిర్దేశిత స్థితికి చేరుకుంది. మరో 12 నిమిషాల పాటు భ్రమణం అలాగే కొనసాగి ఉంటే ఐఎస్‌ఎస్‌ పూర్తిగా వ్యతిరేక దిశకు చేరుకునేదని నాసా వర్గాలు తెలిపాయి. ఇది ఊహించని పరిణామమని అన్నారు. సకాలంలో గుర్తించడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లు అయింది. దానిపై ఉండే సోలార్‌ ప్యానల్‌ నిత్యం సూర్యునికి అభిముఖంగా ఉండేలా ఐఎస్‌ఎస్‌ దిశ మారుతుంది. ఒకవేళ సౌర ఫలకలపై కిరణాలు పడకపోతే.. అంతరిక్ష కేంద్రంలో ఉండే ఇంధన వ్యవస్థ దెబ్బతింటుంది. దీనివల్ల కేంద్రంలో కొన్ని వ్యవస్థల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే కేంద్రంలోని ఉష్ణోగ్రతలు సైతం అసాధారణంగా మారే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే అందులోని వ్యోమగాముల ఆరోగ్యం ప్రమాదంలో పడొచ్చు. అలాగే అక్కడి నుంచి గ్రౌండ్‌ కంట్రోల్‌ సిస్టంకు సంబంధాలు తెగిపోవచ్చు. గురువారం కొన్ని నిమిషాల పాటు వ్యోమగాముల నుంచి గ్రౌండ్‌ కంట్రోల్‌ సిస్టంకు సమాచార మార్పిడి నిలిచిపోయింది.