Nov 30,2020 21:58

అంతర్‌ రాష్ట్ర ద్విచక్ర వాహన దొంగ అరెస్టు
రూ.20 లక్షలు విలువ గల 22 వాహనాలు స్వాధీనం
మరో ఇద్దరు దొంగలను గాలిస్తున్న పోలీసులు
ప్రజాశక్తి-తిరుచానూరు:
తిరుచానూరు పోలీసులు వాహన తనీఖీలు చేస్తూ ఉండగా పారిపోతున్న అంతరాష్ట్ర దొంగను వెంబడించి చాకచక్యంగా అరెస్టు చేసి దొంగతనం కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా సోమవారం తిరుచానూరు పోలీసు స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో ఈస్ట్‌ డీఎస్పీ మురళీకష్ణ మాట్లాడుతూ తిరుపతి అర్భన్‌ ఎస్పీ రమేష్‌ రెడ్డి ఆదేశాల మేరకు తిరుచానూరు సిఐ సుధాఖర్‌రెడ్డి, ఎస్‌ఐ రామకష్ణారెడ్డి, దీపిక, పోలీసుల సిబ్బందితో కలసి దామినేడు ఎన్‌టిఆర్‌ గహాలు నందు ఆదివారం సాయంత్రం ద్విచక్రవాహనాలు తనిఖీ చేపట్టారు. ఈక్రమంలో సమీపంలో ఒక అనుమానితుడు పోలీసులను చూసి పారిపోతుండగా గమనించిన పోలీసులు హుటాహుటిన అతనిని వెంబడించి అనుమానితుని పట్టుకుని విచారించగా తాను ద్విచక్రవాహనాల దొంగ అని అతను పుత్తూరుకి చెందిన మస్తాన్‌గా అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఇతనితోపాటు వేలూరుకు చెందిన రామమూర్తి, సురేష్‌, భాకరాపేటకు చెందిన మణికంఠ కూడా భాగస్వాములుగా విచారణలో తెలిసిందన్నారు. అనంతరం అదే కాలనీలో మస్తాన్‌ దాచి పెట్టిన 17 ద్విచక్రవాహనాలను, భాకరాపేటకు చెందిన వీరి స్నేహితుడు మురగేష్‌కు అమ్మిన 5 ద్విచక్ర వాహనాలతో కలిసి మొత్తం రూ.20 లక్షల విలువ చేసిన 22 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.