Oct 10,2021 12:46

'మిస్టర్‌ మోహన్‌.. స్టార్ట్‌ యువర్‌ ప్రెజెంటేషన్‌.. మిస్టర్‌ మోహన్‌ ఆర్‌ యూ లిజనింగ్‌?' అని బాస్‌ అసహనంతో పిలుస్తున్నాడు.
'రేరు మోహన్‌.. బాస్‌ పిలుస్తున్నారు లేవరా..!' అన్నాడు కృష్ణ.
'హా.. అంటూ ఆలోచనల్లోంచి ఈ లోకంలోకి వచ్చాడు మోహన్‌. హడావిడిగా ప్రెజెంటేషన్‌ చేసి వచ్చి, తన సీట్లో కూర్చున్నాడు.
'మిస్టర్‌ మోహన్‌..! యూ షుడ్‌ ఇంప్రూవ్‌ యువర్‌ వర్క్‌. దిస్‌ ఈజ్‌ మై ఫస్ట్‌ వార్నింగ్‌!' అంటూ సీరియస్‌గా వెళ్లిపోయాడు బాస్‌.
మోహన్‌ మనసంతా అశాంతిగా ఉంది. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ లేనిది ఇవ్వాళ బాస్‌తో మాటలుపడ్డాడు. చికాకుగా వెళ్లి, తన సీట్లో కూర్చున్నాడు. టైం సాయంత్రం ఐదున్నర కావడంతో.. అందరూ హడావుడిగా ఇళ్లకు బయల్దేరిపోయారు. మోహన్‌ మాత్రం ఇంటికి వెళ్లడం ఇష్టం లేనట్టు అక్కడే కుర్చీలో వెనక్కి సాగిలపడి, దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. తన భార్య సీత గురించిన ఆలోచనలే అతన్ని చుట్టుముడుతున్నాయి. 'సీత నిజంగా తనకు తగ్గ పేరే పెట్టారు వాళ్ల అమ్మానాన్న.. ఉన్నత కుటుంబం నుంచి వచ్చినా ఎటువంటి అహంభావం లేకుండా నా కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుని, నా జీవితాన్ని స్వర్గప్రాయం చేసింది. పెళ్లి అయిన రోజు నుంచే బాధ్యతలు, కష్టాలు, అన్నీ నాతో పాలుపంచుకుంది. మంచంలో ఉన్న అమ్మకి ఎంతో సహనంతో సేవలు చేసి, మళ్లీ మామూలు మనిషిగా మార్చింది. బామ్మ అనే సూటీపోటీ మాటల్ని చిరునవ్వుతో స్వీకరించింది. ఆడపడుచులకు అమ్మలా తోడైంది. అలాంటి నా సీతకి ఏమైంది ఇప్పుడు..? ఎందుకిలా ప్రవర్తిస్తోంది..?' ఎంత ఆలోచించినా ఆలోచనలు తెగట్లేదు మోహన్‌కి.
'ఏరా మోహన్‌ ఏంటి సంగతి? మా చెల్లెమ్మ గుర్తొచ్చిందా ఏంటీ?' అంటూ నవ్వుతూ పక్కన కూర్చున్నాడు కృష్ణ.
మోహన్‌, కృష్ణకి కాలేజీ నుంచి ప్రాణస్నేహితుడు. మోహన్‌ ఇంటిపక్కనే ఉంటాడు. 'హా.. ఏం లేదులేరా' అంటూ ఓ మొహమాటపు నవ్వు నవ్వాడు మోహన్‌.
'ఏమయిందిరా..? ఈ మధ్య ఏదో ఆలోచిస్తూ డల్‌గా ఉంటున్నావ్‌. అవసరం లేకపోయినా ఓవర్‌ టైం చేస్తున్నావ్‌.. ఎన్నిసార్లు అడిగినా చెప్పవు.. సమస్యేంటిరా?'
'అలాంటిదేం లేదు లేరా..!'
స్నేహితుడయిన నాకు కూడా చెప్పకపోతే, నీ సమస్యకి పరిష్కారమెలా దొరికేది? చెప్పరా..!'
'ఏమీ లేదు మీ చెల్లి గురించి..' అన్నాడు కొంచెం ఇబ్బందిగా.
'ఏమైంది సీతకి?' ఆదుర్దాగా అడిగాడు.
'అదే అర్థం కావట్లేదు.. ఎప్పుడూ మహాలక్ష్మిలా నవ్వుతూ ఉండే నా సీత కొంతకాలంగా చికాకుగా ఉంటోంది.'
'ఏమైందో వివరంగా చెప్పరా..?'
'ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా డల్‌గా ఉంటోంది. అదేమంటే, మీరు నాతో అంతకు ముందులా ఉండట్లేదు అంటుంది. నా మీద ప్రేమ తగ్గిపోయింది అంటుంది కాసేపు. అలంకరించుకోవడం మానేసి, శోకదేవతలా ఉంటోంది. అందేంటి అంటే..? నన్నెవరు చూస్తారులే అంటోంది. ఎప్పుడూ లేనిది పిల్లల్ని కూడా విసుక్కొంటోంది. కారణం లేకుండా ఏడుస్తోంది. ఏం కావాలో చెప్పమంటే మీ ప్రేమ కావాలి.. నాతో కాసేపయినా గడపొచ్చుగా అంటూ బాధపడుతోంది. నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నా ప్రేమలో ఏం తక్కువైందని? అడిగినవన్నీ కొనిస్తాను. సెలవైతే ఇంటిల్లిపాదినీ షికార్లు తిప్పుతాను. కుటుంబం, ఆఫీస్‌ తప్ప ఇంకో లోకం లేనివాడ్ని. అయినా ఇంకా ఏదో కావాలంటే.. ఇవ్వాళ పొద్దున్నే గొడవ. కాస్త ఎక్కువగానే రియాక్ట్‌ అయ్యాను. ఎప్పుడూ లేనిది అలిగి, పుట్టింటికి వెళ్లిపోయింది. నేను ఈ ఉద్యోగ టెన్షన్‌ భరించాలా? లేక తననే పట్టించుకోవాలా?' అంటూ తన బాధని, కోపంగా కృష్ణ ముందు ఉంచాడు.
'V్‌ా్మ..!' అని ఆలోచిస్తున్నాడు కృష్ణ.
మోహన్‌ మనసు తనకి అర్థమయింది. చిన్నప్పుడే తండ్రి పోతే, ఆ లోటు ఇంట్లో లేకూడదని చిన్న వయసులోనే ఉద్యోగంలో చేరి, ఇంటి బాధ్యతని తన మీద వేసుకున్నాడు. ఇల్లే లోకం తనకి.
'రేరు.. సీత ఎలాంటిదో నాకన్నా నీకే బాగా తెలుసు. అలాంటి సీత ఇలా ప్రవర్తిస్తోందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందిగా.. బహుశా ఆ ఇబ్బంది ఏంటో నీకు అర్థమయ్యేలా వ్యక్తపరచడం తనకు తెలియట్లేదేమో.. నువ్వే తనని ఇంకా అర్థం చేసుకువాలేమో..!' అన్నాడు కృష్ణ.
'ఇంకా ఏమర్థం చేసుకోనురా..?'
'రేరు.. సీత మాట్లాడిన మాటల్ని బట్టి తను ఒంటరిగా ఫీల్‌ అవుతోంది.. తనకి నీ సాంగత్యం, ప్రేమ కావాలని కోరుకుంటోంది.'
'అలా మాట్లాడతావేంటిరా..? ఇప్పుడు ప్రేమకి ఏంతక్కువ అయింది?' అన్నాడు అసహనంగా.
'రేరు.. ఇంట్లోకి ఎన్నో కలలతో కొత్త కోడలిగా అడుగుపెట్టిన సీతకి.. సుఖాలకన్నా బాధ్యతలే ముందు పలకరించాయి. అవునా? అత్తగారి సేవలు, చిన్నవాళ్లయిన ఆడపడుచుల బాధ్యత.. ఇంకా పెళ్లయ్యి సంవత్సరం నిండగానే ఒకేసారి ఇద్దరు పిల్లలు.. భర్త సాంగత్యంలో మైమరచిపోవాల్సిన సమయంలో ఓ పక్క ఇంటి చాకిరి.. పిల్లల్ని సాకడం.. ఇవన్నీ సీత తట్టుకున్నట్టు ఏ ఆడపిల్లయినా తట్టుకోగలదా..?'
ఆ మాటలతో ఆలోచనలోపడ్డాడు మోహన్‌..
'నిజమే.. అప్పుడే పిల్లలు వద్దని.. ఓ రెండేళ్లు ఆగుదామని ఎంతో అభ్యర్ధనగా అడిగింది నన్ను.. కానీ అమ్మ, బామ్మ పెళ్లయిన నెల నుంచే 'పిల్లలు.. పిల్లలు' అని ఒకటే గోల.. 'ఓ పిల్లాడిని కని, మా చేతిలో పెట్టండి ఆ తర్వాత మీ ఇష్టం!' అంటూ రోజూ సతాయించేవాళ్లు సీతని. నేనూ ఏమీ మాట్లాడకపోయేసరికి తనే నిర్ణయాన్ని మార్చుకుంది. ఒకేసారి ఇద్దరు కవలలు. పిల్లలు అని గోల చేసిన వాళ్లు ఏం సాకారో తెలీదుగానీ, పాపం తనకి సరైన ఆహారం, నిద్ర కూడా ఉండేవి కాదు.!' అని గతాన్ని గుర్తు చేసుకున్నాడు మోహన్‌.
ఆలోచనలోంచి బయటకొస్తూ 'అవును నిజమే. ఇప్పుడేమంటావ్‌..?' అన్నాడు కొంచెం సాలోచనగా..
'ఇన్నాళ్లూ ఇంటిపని, పిల్లలు, వాళ్ల బాధ్యతలు, ఊపిరి సలపనంత ఇంటిపనిలో ఉండిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే తనేం కోల్పోయిందో తెలుసుకుని, ఇప్పుడవి తిరిగి కావాలని కోరుకుంటోంది. అవి తిరిగి అందించు!'
'కొంచెం అర్థమయ్యేలా చెప్పరా..!'
'నీ ప్రేమని తిరిగి అందించు.. కొంత సమయం తనతో గడుపు. బాధ్యతలతో కరిగిపోయిన కాలాన్ని తిరిగి కొత్తగా సరసాలతో, ప్రేమ యాత్రలతో గడపండి.. సింపుల్‌..!'
'చాల్లే ఊరుకోరా.. ఇప్పుడు సరసాలు, ప్రేమ యాత్రలు ఏంటిరా..? ఎవరైనా వింటే నవ్వుతారు!' అన్నాడు కొంచెం కోపంగా.
'ఒరేరు.. నీకు పెళ్లయ్యి ఎన్నాళ్లైంది రా..?'
'పదేళ్లు!'
'మరి పదేళ్లకే ఏదో నలభై ఏళ్లు అయినవాడిలా మాట్లాడతావేరా దద్దోజనం..?'
'మరేంట్రా నువ్వు మాట్లాడేది. ఇంట్లో పెళ్లి కావాల్సిన చెల్లెళ్లు ఉన్నారు. వాళ్ల ముందు మేము చెట్ట పట్టాలేసుకుని, షికార్లు చేయాలా?'
'రేరు.. మోహన్‌ ఇప్పుడు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా విను. నువ్వు రాత్రి 11 వరకూ ఇంట్లోవాళ్లతోనో లేక ఫోన్‌, టీవీ, పిల్లలు, ఫ్రెండ్స్‌ ఇలా ఎవరితో అయినా రిలాక్స్‌ అవగలవు. కానీ ఓ స్త్రీ పగలంతా ఎంత కష్టపడ్డా! రాత్రయ్యేసరికి ఆ అలసట భర్త దగ్గర కబుర్లతోనూ, కౌగిలిలో ఒదిగినప్పుడు మాత్రమే తీరుతుంది. పెళ్లయినప్పటి నుంచి ఇద్దరూ బాధ్యతలతో సతమతమై, మీ గురించి మీరు ఆలోచించుకునే సమయమే దొరకలేదు. ఇప్పుడు ఇంటి బరువు కాస్త తేలికపడింది. ఇప్పటికైనా మీ గురించి మీరు ఆలోచించుకోకపోతే.. ఇద్దరూ ముసలివాళ్లయిపోతారు. అప్పుడు ఇద్దరూ చక్కగా భజనలు చేసుకోవచ్చు!' అన్నాడు కాస్త వెటకారంగా.
'రేరు.. సొల్యూషన్‌ చెప్పమంటే, వెటకారంగా మాట్లాడతావేరా?' అన్నాడు చిరుకోపం ప్రదర్శిస్తూ..
'సొల్యూషనే చెప్తున్నారా శ్రద్ధగా విను..!'
'ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో రాత్రి పది గంటల కల్లా నీ బెడ్‌రూంలో ఉండాలి. నీకు నీ భార్యకు ఏకాంతం కావాలి. అప్పుడప్పుడూ మీరిద్దరు మాత్రమే షికార్లు చేయాలి. చిన్న చిన్న సర్‌ప్రైజెస్‌, సరదాలు, సరసాలు, ఇవే దాంపత్యాన్ని దృఢపరిచేవి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎంత వయసు వచ్చినా భార్యాభర్తలకు కచ్చితంగా ప్రైవసీ ఉండాలి. మీరు అన్యోన్యంగా ఉంటేనే గదా, మీ దాంపత్యాన్ని చూసి, పిన్నలు జీవిత పాఠాలు నేర్చుకునేది.. పెద్దలు సంతోషించేది. ఇంకా ఎవరో ఏదో అనుకుంటారు అని నువ్వు అనుకుంటూ కూర్చుంటే నీ సీత ఓ ప్రాణమున్న మర బొమ్మలా మారిపోతుంది. తర్వాత నీ ఇష్టం!' అనేసి బోధ చేశాడు కృష్ణ.
అన్నిటికన్నా, 'సీత మరబొమ్మగా మారిపోతుంది!' అనే మాట మోహన్‌ మనసులో గట్టిగా గుచ్చుకుంది.
'పెళ్లయిన కొత్తల్లో కళ్లలో కొత్త కాంతులతో చెక్కిన శిల్పంలా, ముద్దుగుమ్మలా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేది నా సీత. కానీ ఇప్పుడు నిర్జీవమైన కళ్లు, పేలవమైన ఓ నవ్వు అతికించుకుని, చిక్కిపోయిన మేనితో ఉంది. ఇంకా ఇలాగే చూస్తూ ఊరుకుంటే.. నో.. నా సీత నాక్కావాలి.. నా కోసం.. ఇంటి కోసం.. ఎంతో చేసిన నా సీత కోసం ఆమెని సంతోషపెట్టి, తిరిగి నాదాన్ని చేసుకోవాలి!' అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు మోహన్‌.
ఓ వారం రోజుల తర్వాత..
సీత, పిల్లలు ఊరి నుంచి ఇంటికి వచ్చారు. వారింట్లో అడుగుపెట్టగానే కళ్లతోనే సీతని పలకరించాడు మోహన్‌. అదేం పట్టనట్టు రూంలోకి వెళ్లి, బాగ్‌లో బట్టలు బీరువాలోకి సర్దుతోంది సీత. వెనకగా వచ్చి, చేతులతో నడుముని చుట్టేసి.. గట్టిగా కౌగిలించుకున్నాడు మోహన్‌. అనుకోని ఆ సంఘటనతో కాస్త కంగారుపడింది. 'నా సీతకి ఇంకా నా మీద అలక తగ్గినట్టు లేదు..!' అంటూ ఆమెని గుండెలకి హత్తుకుని, 'నాన్నా!' అన్న పిలుపుతో సీతని వదిలి, బయటకు వెళ్లాడు మోహన్‌. ఎప్పుడు ఊరి నుంచి వచ్చినా, పిల్లల్ని తప్ప తనని పట్టించుకోని భర్త ఇలా చేసేసరికి ఆమెకి ఆనందం, ఆశ్చర్యం, సిగ్గు ఒకేసారి ముంచుకొచ్చాయి. రాత్రి తొమ్మిది అవగానే ప్రయాణ బడలిక వల్లేమో పిల్లలు త్వరగా నిద్రపోయారు.
భోజనాలు అయ్యాక పదింటికి, 'సీతా.. ఇలా రా..!' అంటూ మేడ మీదకి నడిపించాడు..
'ఏంటి ఎక్కడికి..?' అంటుంటే..
'ష్‌.. సర్పైజ్‌..' అంటూ ఊరిస్తూ కళ్లుమూసి నడిపించాడు. 'ఇప్పుడు కళ్లు తెరువు!' అని చేతులు అడ్డు తీయగానే..
ఎదురుగా ఎన్నో రంగులలో నీకోసమే ఎదురు చూస్తున్నాం అన్నట్టు నవ్వ్వుతూ పలకరించాయి గులాబీ బాలలు. 'నా అందాల సీతకి గులాబీల స్వాగతం!' అంటూ చెవిలో గుసగుసలాడాడు.
తనకెంతో ఇష్టమైన గులాబీలను చూడగానే.. సీత మనసు ఆనందంతో నిండిపోయింది.
'నా హృదయరాణికి ప్రణయ అంతఃపురంలోకి స్వాగతం!' అంటూ పెంట్‌హౌస్‌లోకి నడిపించాడు.
అప్పటివరకూ స్టోర్‌ రూంగా వాడిన ఈ రూమ్‌ని శుభ్రం చేయించి, పందిరి మంచం.. గోడలని వారి పెళ్లి ఫోటోలతో అలంకరించినట్లున్నాడు.. ఓ పక్క షెల్ఫ్‌లో సీతకి, మోహన్‌కి ఇష్టమైన బుక్స్‌ కలెక్షన్‌. ఇంకో మూల చిన్న స్టూల్‌ మీద ఒక వయోలిన్‌. దాన్ని చూడగానే తను పెళ్లికి ముందు వదిలేసిన సంగీత సాధన గుర్తొచ్చాయి.
'ఎలా ఉంది మన అంతఃపురం?' అంటూ ఆమె నుదిటిపై చిన్న ముద్దు పెడుతూ అడిగాడు.
బదులుగా ఆమె కళ్లు వర్షిస్తున్నాయి.
'సీతా.. ఏమైంది..? ఈ కన్నీళ్లేంటి?'
'మీరిలా ప్రేమ చూపిస్తానంటే.. మీతో గొడవపడి నెలకోసారి పుట్టింటికి వెళ్లొస్తానండీ..!' అంది అమాయకంగా.. చిలిపిగా.. వెక్కిళ్లు పెడుతూ..
'అరే.. పిచ్చిదానా.. ఇవన్నీ నువ్వు పుట్టింటికి వెళ్లావని చేయలేదు. మనం కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఈ అంతఃపురంలో ఓ కొత్త పుస్తకంగా రాసుకోవాలి. ఇక్కడ గడిపే ప్రతీ క్షణం మనిద్దరిదే. నాకు నువ్వు నీకు నేను అంతే!'
ఆ రోజు నుంచి పొద్దున్నే పూదోట మధ్య ఇద్దరూ కాఫీని ఆస్వాదించడం మొదలుపెట్టారు. సీత వయోలిన్‌ సాధన తిరిగి మొదలుపెట్టి, తన రోజుని సంగీతంతో, సాహిత్యాలతో నింపుతోంది.. వాటిని తిరిగి పాఠాలుగా తన పిల్లలకి అందిస్తోంది. ఓ ఆదివారం కుటుంబానికి.. ఇంకో ఆదివారం కేవలం వారిద్దరికోసం కేటాయిస్తూ.. ఓ ఆనంద అంతఃపురాన్ని నిర్మించుకున్నారు ఆ భార్యాభర్తలు.

భావన పాంచజన్య వేదాంతం
bhavanav.pharma@gmail.com