Dec 04,2021 06:37

    కే ంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం (ఎన్‌ఒపి), రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగం ప్రత్యేకించి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అంపశయ్యపై రోజులు లెక్కిస్తున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్లతో రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాల్సిన కేంద్రం ఆ యుజిసినే రద్దు చేసింది. ఎన్‌ఇపి మాటున ఉన్నత విద్యా వ్యవస్థను కాషాయీకరణ చేయడం ద్వారా భ్రష్టు పట్టిస్తోంది. హైదరాబాద్‌ వర్సిటీ, జెఎన్‌యు, ఢిల్లీ వర్సిటీ, కోల్‌కతా వర్సిటీ, బెనారస్‌ హిందూ వర్సిటీ ఇలా ప్రతి ఉన్నత విద్యా సంస్థలోనూ కేంద్ర ప్రభుత్వ అండదండలతో కాషాయ మూకల జోక్యంతో సాగుతున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. దేశవ్యాప్తంగా 46 కేంద్రియ విశ్వవిద్యాలయాల్లో 21 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. పునర్విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి మంజూరైన అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయాల అతీగతీ లేదు. పోస్టుల భర్తీకి ఆలూచూలూ లేదు. మరోవైపు ఎన్‌ఇపి ద్వారా విద్యా వ్యవస్థ మొత్తాన్ని కేంద్రం తన గుప్పిట్లో బంధించే ప్రయత్నం చేస్తోంది. జనం మెదళ్లలోకి మతతత్వ జాఢ్యాన్ని జొప్పించేందుకు విద్యార్థి దశలోనే విష బీజాలు నాటేందుకు తెగబడుతోంది.
     కేంద్రం ఆడుతున్న ఈ నాటకాలకు ఇక్కడ వైసిపి ప్రభుత్వం మద్దెల వాయిస్తుండటం దుర్మార్గం. వినాశకర ఎన్‌ఇపి ని అందరికన్నా తామే వేగంగా అమల్జేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ విశ్వవిద్యాలయాలను సర్వనాశనం చేసే అనాలోచిత చర్యలకు తెగిస్తుండటం ఆక్షేపణీయం. పరిశ్రమకు తగ్గ నైపుణ్యాలు కనుమరుగైపోతున్నాయంటూ ఆవేదన చెందే పాలకులు దానికి మూల కారణమైన విద్యా ప్రయివేటీకరణను మాత్రం వీడటం లేదు. పైగా యేటికేడూ మరింతగా ప్రయివేటీకరణను విస్తరింపజేస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలు పాటించడంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఐటి లు, విశ్వవిద్యాలయాల్లో ప్రపంచంలోనే ఖ్యాతి పొందాయి. అయితే ఇదంతా గతం. మూడు దశాబ్దాల కిందట మాట. వైవిధ్యమైన విశాల భారతావనిలో ప్రాంతీయ అవసరాలకు తగ్గట్టుగా సంస్కృతి, సాంప్రదాయాల పరంపరకు, శాస్త్రీయ పరిశోధనలకు, చరిత్ర అధ్యయనానికి, వైవిధ్య ఆలోచనలకు, మేధోపర చర్చలకు ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు నాడు ఆలవాలంగా నిలిచాయి. నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణల విష ఫలితాల కారణంగా విద్యా రంగాన్ని ప్రయివేటు శక్తులు కబళించేయడంతో ఆ ప్రమాణాలు పడకేయడం మొదలైంది. ఫీజు రీయింబర్స్‌మెంటు వంటి పథకాల మాటున విద్యారంగ నిధులన్నీ ప్రయివేటు సంస్థలకు దోచిపెట్టడంతో అవి మరింతగా విస్తరించాయే తప్ప ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యను పేదల దరి చేరనీయడం లేదు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు సమాధి కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టినా పాలకులు పాఠాలు నేర్వకపోవడం శోచనీయం.
     దేశంలో ఎక్కడా లేనివిధంగా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ప్లానింగ్‌ బోర్డు ఒక్క మన రాష్ట్రంలోనే ఉందంటూ గొప్పలు పలుకుతున్న పాలకులు ఆ బోర్డు ఉద్దేశ్యమేంటో ఇటీవల ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో జరిగిన పరిణామాల ద్వారా తేటతెల్లం చేశారు. వర్సిటీకి కేటాయించిన నిధులతో పాటు వివిధ వనరుల నుంచి వచ్చిన సొంత ఆదాయాలను ప్రభుత్వ ఖజానాకు బలవంతంగా మళ్లించుకున్న వైనం దుర్మార్గం. వేలాదిగా ఉన్న ఖాళీ పోస్టుల భర్తీకి, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సిన బోర్డు వర్సిటీల్లో నిధులపై కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అడిగిందే తడవుగా కనీసం రోజువారీ ఖర్చులకు ఎలా అనే ఆలోచన కూడా చేయకుండా మొత్తం నిధులను ప్రభుత్వ ఖజానాకు తరలించేసి స్వామిభక్తి చాటుకున్న హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ పి శ్యామప్రసాద్‌ తీరు అభ్యంతరకరం. విశ్వవిద్యాలయ వి.సి గా స్వతంత్రంగా వ్యవహరించడం పోయి ఇలా ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గిపోతే వర్సిటీలకు మనుగడ సాధ్యమెలా? చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఉద్యోగులు, విద్యార్థులు మొత్తుకుంటున్నా వినకుండా రూ.400 కోట్ల నిధులను వర్సిటీ ఖాతా నుంచి ఏ.పి స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎపిఎస్‌ఎఫ్‌ఎస్‌సిఎల్‌)కు తరలించేసి ఇప్పుడు జీతాలకైనా నిధులు తిరిగిచ్చేసి కనికరించండి మహాప్రభో అంటూ లేఖ రాయడం సిగ్గుచేటు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పిస్తున్న ప్రభుత్వం ఆ కళాశాలలకు మార్గనిర్దేశం చేయాల్సిన హెల్త్‌ యూనివర్శిటి నిధులనే ఇలా కొల్లగొట్టి గుల్లబారు చేస్తే అది దేనికి సంకేతం? ఇప్పటికైనా ఉన్నత విద్యా వ్యవస్థకు ప్రధానంగా విశ్వవిద్యాలయ విద్యకు పాడె కట్టే దుర్మార్గ ఆలోచనలను ప్రభుత్వాలు విడనాడాలి. ప్రయివేటు జపం వీడి ప్రభుత్వ రంగ ఉన్నత విద్యను బలోపేతం చేసే చర్యలకు ఉపక్రమించాలి.