Mar 02,2021 23:01

కందుకూరు సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి-కందుకూరు : కరోనా వ్యాక్సిన్‌ వికటించి మృతిచెందిన శింగరాయకొండ మండలం కలికవాయి గ్రామ అంగన్‌వాడీ కార్యకర్త సునీత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ కందుకూరు సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్సర్స్‌ యూనియన్‌ ఉలవపాడు ప్రాజెక్ట్‌ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. తొలుత పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోస్టాఫీస్‌ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జివిబి.కుమార్‌, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ఉలవపాడు ప్రాజెక్ట్‌ సభ్యురాలు వాకా లతారెడ్డి మాట్లాడుతూ సునీతకు గత నెల 20న కరోనా వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఆమె వాంతులు, జ్వరంతో బాధపడుతూ వివిధ ఆసుప్రతుల్లో చికిత్స పొందినట్లు తెలిపారు. అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందినట్లు తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ వల్లనే సునీత మృతిచెందిందని, ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ లకు బలవంతంగా వ్యాక్సిన్‌ వేసే విధానాన్ని ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌కె. పద్మజ, బి.మార్తమ్మ, పివి.శేషమ్మ, ఎం.పద్మ, పి.ప్రసన్న, సిహెచ్‌.రమాదేవి, కె.రాధ, పి.భారతి పాల్గొన్నారు.
సునీత కుటుంబాన్ని ఆదుకోవాలి
కరోనా వ్యాక్సిన్‌ కారణంగా చనిపోయిన కలికవాయ అంగన్‌వాడీ కార్యకర్త సునీత కుటుంబ సభ్యులు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సిఐటియు నాయకులు ఎస్‌ఎ.గౌస్‌ కోరారు. సునీత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కందుకూరు అంకమ్మ గుడి నుంచి పోస్టాఫీస్‌ సెంటర్‌ వరకూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి మున్వర్‌ సుల్తానా మాట్లాడుతూ సునీత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా తో పాటు కుటుంబంలోవారికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి ఎస్‌కె.మల్లిక పాల్గొన్నారు. యర్రగొండపాలెం : అంగన్‌వాడీలు, ఇతర సిబ్బందికి బలవంతంగా కరోనా వ్యాక్సిన్‌ వేయరాదని సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మా బాల నాగయ్య కోరారు. బలవంతంగా వ్యాక్సిన్‌ వేయవద్దని కోరుతూ తహశీల్దారు కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ బాలనాగయ్య మాట్లాడుతూ శింగరాయకొండ మండలం కలికివాయ గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త నల్లూరి సునీత (38) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆమె తనకు కరోనా వ్యాక్సిన్‌ వద్దని ప్రాధేయపడినట్లు తెలిపారు. టీకా వేయించుకోకుంటే ఉద్యోగం ఊడుతుందని అధికారులు బెదిరించడంతో ఆమె టీకా వేయించుకుందన్నారు. టీకా వేయించుకున్న మరుసటి రోజు నుంచే ఆరోగ్యం క్షీణించి ఒంగోలు, గుంటూరు, నెల్లూరు. తిరుపతిలలో చికిత్స పొందినట్లు తెలిపారు. చివరకూ పరిస్థితి విషమించి మృతిచెందినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బలవంతంగా ఎవరికి టీకా వేయరాదని ఆయన డిమాండ్‌ చేశారు. బాధితురాలి కుటుంబానికి రూ. 50 లక్షలు ఆర్థిక సహాయం, ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దారు అశోక్‌ కుమార్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకురాళ్లు సీతమ్మ, పద్మావతి, రామకుమారి, విజయలక్ష్మీ, రూత్‌మేరి పాల్గొన్నారు. పొదిలి :కరోనా టీకా వికటించి శింగరాయకొండ మండలం కలివాయలో మృతి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త సునీత కుటుంబానికి రూ.50 లక్షల బీమా ఇవ్వాలని సిఐటియు పశ్చిమ ప్రకాశం ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌ డిమాండ్‌ చేశారు. సునీత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌ ( సిఐటియు) ఆధ్వర్యంలో తహశీల్దారు హనుమంతరావుకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అంగన్‌వాడీ కార్యకర్త సునీతకు తనకు కరోనా టీకా వద్దంటున్నా గత నెల 20న ఆమెకు టీకా వేసినట్లు తెలిపారు. టీకా వికటించి అనారోగ్యానికి గురై తిరుపతి కిమ్స్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించినట్లు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యులతకు కోవిడ్‌ ప్రమాద బీమా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగమివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పొదిలి ప్రాజెక్టు అధ్యక్షురాలు శోభారాణి, షమీమ్‌, భారతి, సుజాత పాల్గొన్నారు.