Jun 13,2021 00:24

సమావేశంలో మాట్లాడుతున్న పిసి కేశవరావు

ప్రజాశక్తి-కనిగిరి: అంగన్‌వాడీ కార్యకర్త అంబూరి సత్యవతి బదిలీని వెంటనే నిలిపివేయాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు పిసి కేశవరావు డిమాండ్‌ చేశారు. స్థానిక కనిగిరి సిఐటియు కార్యాలయంలో అంగన్‌వాడీవర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ పిసిపల్లి మండలం గోపవరపువారిపల్లిలో అంగన్‌వాడీ కార్యకర్తగా అంబూరి సత్యవతి 2008లో ఎంపికై సేవలందించారు. 2014లో కనిగిరి 8వ వార్డు అంగన్‌వాడీ కార్యకర్తగా బదిలీ అయ్యారు. ఏడేళ్లుగా కనిగిరిలో విధులు నిర్వర్తిస్తుండగా ఇప్పుడు ఆ బదిలీని రద్దుచేస్తూ తిరిగి పిసిపల్లి మండలం గోపవరపువారిపల్లి కేంద్రానికి బదిలీ చేయటం దారుణమన్నారు. కార్యకర్త ఇష్టం లేకుండా బదిలీచేయటం సరికాదన్నారు. ఇప్పటికైనా అంగన్‌వాడీకార్యకర్త బదిలీని నిలిపివేసి పిసిపల్లిమండలం గోపవరపువారిపల్లిలో స్ధానికులచేత కార్యకర్తపోస్టును భర్తీచేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు సుశీల, రజని, రవికుమారి, చంద్రావతి, రాజేశ్వరి, పర్వీన్‌, సుబ్బులు, రమణమ్మ, నాగలక్ష్మి, ప్రసన్న పాల్గొన్నారు.