Nov 27,2020 22:39

అంధులకు పుష్కర స్నానం

- ఎనిమిదో రోజు తుంగభద్ర పుష్కరాలు
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి/ క్రైం:
 కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఘాట్లలో ఏర్పాటు చేసిన షవర్ల వద్ద పుష్కర స్నానాలు ఆచరించారు. కొందరు పిండ ప్రదానాలు సమర్పించారు. దాదాపు 10వేల మంది పుష్కరాల్లో పాల్గొన్నట్లు అంచనా. అంధులకు ఎస్‌పి కాగినెల్లి ఫక్కీరప్ప స్వయంగా పుష్కర స్నానాలను చేయించారు. కర్నూలు నగరంలోని సంకల్‌బాగ్‌ ఘాట్‌ వద్ద 30 మంది అంధులకు శాస్త్రోక్తంగా పుష్కర స్నానాలు చేయించారు. అనంతరం అంధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. డిజిపి ఆదేశాలతో 3 రోజుల పాటు పుష్కరాల్లో కర్నూలు పోలీసులు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు. అమ్మ అంధుల పాఠశాల, అక్షిత భవన్‌ అంధుల పాఠశాల, నేషనల్‌ ఫేడరేషన్‌ బ్లైండ్‌ కు చెందిన అంధులకు తుంగభద్ర నది పుష్కర నీటి జల్లులతో స్నానం చేయించామన్నారు. శనివారం 50 నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వద్ధాశ్రమంలోని వృద్ధులకు, ఆదివారం అనాథ పిల్లల్లో 12 సంవత్సరాలు పైబడిన వారికి పుష్కర స్నానం చేయిస్తామన్నారు. కర్నూలు పట్టణ డిఎస్‌పి కెవి మహేష్‌, సిఐలు మహేశ్వరరెడ్డి, ఓబులేసు, పలువురు ఎస్‌ఐలు ఉన్నారు. సంకల్‌ బాగ్‌ పుష్కరఘాట్‌ వద్ద కార్తీక శుద్ధ త్రయోదశి సందర్భంగా పంచహారతి నిర్వహించారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా బయట మండపంలో కాకుండా వైదిక పద్ధతిలో, ప్రత్యేకంగా నిర్మించిన యాగశాలలో నదీ హారతి నిర్వహించారు. హారతుల అనంతరం వేద పండితులు తుంగభద్ర జలాన్ని భక్తులపై ప్రోక్షణ చేశారు.
తుంగభద్రమ్మ విగ్రహా ప్రతిష్ట
కొత్తపల్లి : సంగమేశ్వరంలో తుంగభద్రమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పుష్కర భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. సంగమేశ్వరం అభివృద్ధికి తన వంతు కషి చేస్తానని హామీ ఇచ్చారు. భక్తులు కోవిడ్‌ నిబంధనలను పాటించాలని సూచించారు. అనంతరం కాశీరెడ్డి నాయన ఆశ్రమాన్ని సందర్శించి భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ, వైసిపి సీనియర్‌ నాయకులు చెరుకుచెర్ల రఘురామయ్య, కుమ్మరి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సుగురి రవణమ్మ, వైసిపి నాయకులు పురుషోత్తమ రెడ్డి, శివా రెడ్డి, రఫీ, సాయిరాం, జకర్యా, సుబ్బా రాయుడు, రామలింగేశ్వర రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, మహేష్‌, బాలు యాదవ్‌, మాధవరం యేసు రత్నం, శివ లింగం పాల్గొన్నారు.
రాఘవేంద్రుని సన్నిధిలో ప్రముఖులు
మంత్రాలయం : రాఘవేంద్రస్వామిని కర్నాటక రాష్ట్రంలోని హరిహర పట్టణంలోని పంచమస్థలి గురుపీఠం పీఠాధిపతులు వచనానందస్వామీజీ, హెచ్‌బిజి, బిజియస్‌ విద్యా సంస్థల వ్యవస్థాపకులు ప్రకాష్‌ నాథ్‌ స్వామీజీ శుక్రవారం దర్శించుకున్నారు. వారికి శ్రీ మఠం అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపి.నరసింహమూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్రుని మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు సుభుదేంధ్రతీర్థులు పూలమాలలు వేసి శాలువ, మెమొంటో అందజేసి సత్కరించారు.
ఘాట్లను పరిశీలించిన ట్రైనీ ఐపిఎస్‌లు
స్థానిక విఐపి, వినాయక, సంతమార్కెట్‌, పంపు హౌస్‌ ఘాట్లను ట్రైనీ ఐపిఎస్‌లు వి.మహేశ్వర్‌ రెడ్డి, కెపిఎస్‌ కిషోర్‌, రాణా, ప్రేరణా కుమార్‌లు పరిశీలించారు. అగ్నిమాపక, విద్యుత్‌ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతులు శ్రీ సుభుదేంధ్రతీర్థులు శేషవస్త్రం, ఫల, మంత్రాక్షితలు అందజేసి ఆశీర్వదించారు. వారి వెంట మంత్రాలయం సిఐ కృష్ణయ్య, పుష్కర ఘాట్‌ ఇంచార్జి సిఐ లక్ష్మయ్య, ఎస్‌ఐలు వేణుగోపాల్‌ రాజ్‌ ఉన్నారు.