Feb 08,2021 19:48

కొమ్మలు, కాండము, ఆకులు, కాయలులాంటి భాగాలు ఉంటే మనం మొక్కలు అంటుంటాం. ఇవేమీ లేకుండా ఉండే విభిన్నమైన మొక్కలు ఎడారి మొక్కలు. ఎటువంటి ఆలనా పాలనా లేకపోయినా.. కొండల్లో, గుట్టల్లో, రాళ్ళల్లో, రప్పల్లో ఏపుగా పెరిగేవి ఎడారి మొక్కలు. అలాంటి ఎడారి మొక్కల పరిచయమే ఈ వారం విరితోట.


కాక్టస్‌ మొక్కలుగా పిలిచే ఎడారి మొక్కలు ముళ్ళు కలిగి ఉంటాయి. ఇవి నాగజెముడు, బ్రహ్మజెముడు జాతికి చెందినవి. సహజంగా గుచ్చుకుంటూ ఉంటాయి. అందుకే ఇళ్ల దగ్గర ఉండకూడదు అంటుంటారు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు వీటిలో బోల్డన్ని రకాల మొక్కలు పుట్టుకొచ్చాయి. వింతవింత రూపాల్లో వినూత్న ఆకృతుల్లో కొలువుదీరి భలే ఆకట్టుకుంటున్నాయి. అంతేనా చక్కటి పువ్వులనూ పూస్తున్నాయి. అందుకే ఈ కాక్టస్‌ మొక్కలకు బోల్డంత గిరాకీ. వీటికి ముళ్ళు ఉండటం వల్ల పెన్సింగ్‌ మొక్కలుగానూ ఉపయోగిస్తారు. జన సంచారం లేనటువంటి ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా పెంచుతుంటారు. ఈ మొక్కలు ఇంటికి అందాన్ని, రక్షణని ఇస్తాయి. ఈ మొక్కల సంరక్షణకు పెద్దగా నీటి అవసరం లేదు. నెలకు ఒకసారి కొద్దిగా నీళ్ళుపోసినా సరిపోతుంది. ఇవి మహా గట్టి జాతి మొక్కలు. నీళ్లు ఎక్కువగా ఉంటే మొక్క వేర్లు కుళ్లిపోయి చనిపోయే ప్రమాదం ఉంది.
 

అందమైన ఎడారి మొక్కలు

బాల్‌ కాక్టస్‌
ఎడారి మొక్కలలోని అత్యంత విలువైనవి, అందమైనవి బాల్‌ కాక్టస్‌ మొక్కలు. ఇవి గోళాకారంగా బంతుల్లా ఉండి వాటిమీద ఉండే ముళ్ళు లేదా గుబురు ఎంతో పొందిగ్గా రమణీయంగా ఉంటుంది. వీటిలో మూడు అంగుళాల నుంచి ఐదు అడుగుల వ్యాస పరిమాణం ఉండే కాక్టస్‌ ఉన్న బంతుల మొక్కలు ఉన్నాయి. ఇవి వాటిపైన ఉండే ముళ్ళ అమరికను బట్టి వందల రూపాల్లో ఉంటాయి. ఒక్కోదానికి ఒక్కో పేరు ఉంటుంది. కొన్నిటికి ఉపరితల భాగంలో రంగురంగుల పూలు పూస్తాయి. ప్రతి కాక్టస్‌ మొక్కకు పిలకల వంటి కొమ్మలు వస్తుంటాయి. వాటిని చక్కగా కత్తిరించిద సంరక్షించగలిగితే వేరే మొక్కలుగా ఊపిరి పోసుకుంటాయి. కాక్టస్‌ మొక్కలు పెంచే రైతులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ మొక్కలు గ్రాఫ్టింగ్‌ చేసేటప్పుడు, పెంచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ముళ్లు గుచ్చుకునే ప్రమాదం ఉంది. వీటి సంరక్షణకు తప్పకుండా ప్రత్యేకమైన గ్లౌజులు వేసుకోవాలి.
 

అందమైన ఎడారి మొక్కలు

సక్కులెంట్‌ కాక్టస్‌
మొక్కే.. అందమైన పువ్వై ఆహ్లాదంగా విచ్చుకునేది రబషషబశ్రీవఅ్‌ కాక్టస్‌ మొక్క. మొక్క దళసరిపాటి ఆకులు, చుట్టూతా పూరేకల్లా విచ్చుకొని నయనానందంగా ఉంటుంది. దీని ప్రతీ ఆకు చివరిభాగంలో ఉండే మొనతేలిన ముల్లొకటి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మొక్క చాలా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. దాదాపు వందేళ్ల వరకూ ఈ మొక్క బతికి ఉంటుంది. వీటిలో సిమెంటు, ఆకుపచ్చ, బ్రౌన్‌లైట్‌ రెడ్‌, ప్యూర్‌ వైట్‌ వంటి రంగులు ఉన్నాయి. ఇసుక, రాళ్ల మట్టిలోను ఈ కాక్టస్‌ మొక్కలు బాగా పెరుగుతాయి. వీటిని కాస్త ఎండ తగిలే ప్రదేశంలో పెంచాలి. దాబా పిట్టగోడ అంచుల మీద, ప్రహరీ గోడల మీద, పోర్టుకోల మీద, ఇంటి ముంగిట, ఖాళీ జాగాల్లోని గోడల మీద సంరక్షించే మొక్కలుగా వీటిని పెంచుకోవచ్చు.
 

అందమైన ఎడారి మొక్కలు

మిల్కీ కాక్టస్‌
సన్నని త్రిభుజాకార కాండానికి కొమ్మలు, కొమ్మలుగా వస్తాయి. వాటికి ఇరువైపులా రంపపు పళ్ళులాంటి ముళ్ళు చూడచక్కగా ఉంటాయి. ముందు మొక్క ఆకుపచ్చగా ఉండి, తరువాత కొమ్మలన్నీ పాలమీగడ తెలుపు రంగులోకి మారతాయి. వీటిని ఇంటి లోపలి వాతావారణంలో, బయటి వాతావరణంలోనూ పెంచుకోవచ్చు.
 

ఫ్లవర్‌ కాక్టస్‌

ఫ్లవర్‌ కాక్టస్‌
ఫ్లవర్‌ కాక్టస్‌ చక్కగా రంగురంగుల పూలను పూస్తుంది. మొక్క పైభాగం నుండి చుట్టూతా పిలకలు వచ్చి, దాని నుంచి పువ్వులు పూస్తాయి. ఒక్కో పువ్వు ఒక్కో రంగులో ఉంటుంది. తెలుపు, పసుపు, కాషాయం, ఎరుపు రంగుల్లో పువ్వులు ఎంతో అందంగా ఉంటాయి. వారాల తరబడి ఈ పూలు వాడిపోకుండా ఉంటాయి. సాధారణంగా ఎడారి మొక్కలు అన్నీ పువ్వులు పూస్తాయి. కానీ ఏళ్ల తరబడి అంటే 30 నుంచి 35 ఏళ్లు పెరిగిన తర్వాత పువ్వులు పూస్తుంటాయి. కానీ ఫ్లవర్‌ కాక్టస్‌ మొక్కలు మొదటి నుంచి పూలతోనే ఉంటాయి. ఇవి గ్రాఫ్టింగ్‌ చేసి తయారుచేసిన మొక్కలు.
 

ఫ్లవర్‌ కాక్టస్‌

గ్రాఫ్టింగ్‌ కాక్టస్‌
ఆకుపచ్చని మొక్కలకి తలభాగంలో ఎర్రని కిరీటం లాంటి టోపీలతో చక్కగా కనువిందు చేసే కాక్టస్‌ మొక్కలు గ్రాఫ్టెడ్‌ కాక్టస్‌ మొక్కలు. వీటిని ఇంటిలోపలా పెంచుకోవచ్చు. టీపారు మీద, అల్మరాల్లోనూ, కార్నర్‌ పాయింట్‌లో, పేపర్‌ వెయిట్‌ కింద ఈ మొక్కలను వాడుకోవచ్చు. రెండు మొక్కలను గ్రాఫ్టింగ్‌ చేయడం ద్వారా ఈ గ్రాఫ్టెడ్‌ కాక్టస్‌ తయారుచేస్తారు. వీటికి ముళ్ళ భాగాలు తక్కువ. చాలా నెమ్మదిగా 5 అంగుళాల నుంచి 12 అంగుళాల వరకూ మొక్క పెరుగుతుంది.
 

ఫ్లవర్‌ కాక్టస్‌

మూన్‌ కాక్టస్‌
దుడ్డులా పెరిగి దానిపైన కవ్వంలా ఉంటుంది. మూన్‌ కాక్టస్‌ మొక్క నిండా పెరిగినా గుబురుగా ఎంతో రమణీయంగా ఉంటుంది. కాక్టస్‌ మొక్కలకు కుండీలో మట్టి ఉపరితలంపైన రంగురాళ్లు, పాలరాతి ముక్కలు వేస్తే మరింత శోభగా ఉంటుంది. మూన్‌ కాక్టస్‌ కోకొల్లలుగా విభిన్న ఆకారాల్లో ఉంటాయి.
 

ఫ్లవర్‌ కాక్టస్‌

టవర్‌ కాక్టస్‌
పొడవుగా పెరిగే కాక్టస్‌లు టవర్‌ కాక్టస్‌లు. ఇవి నాగజెముడు జాతి మొక్కలు. చుట్టూతా బద్దలా ఉంటాయి. పొడవుగా పెరిగే వీటికి ముళ్ళూ ఎక్కువగానే ఉంటాయి. వీటికి పక్క నుంచి చిన్న చిన్న కొమ్మల్లాగా వస్తూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. లేకుంటే మొక్క ఆకారం మారిపోతుంది.
 

ఫ్లవర్‌ కాక్టస్‌

జెల్లీ కాక్టస్‌
మొక్క పిలకలు పిలకలు మాదిరిగా ఎలా పడితే అలా పెరిగి చివర్లో వాటి నుండి పువ్వులు పూస్తాయి. కొన్ని గుండ్రంగా, మరికొన్ని కాడల్లా విభిన్న ఆకారాల్లో ఉంటాయి. ఇవి కొన్ని వేలాడుతూ పెరుగుతాయి. ఇసుకలో బాగా పెరుగుతాయి. వీటికి కూడా నూగు ఉంటుంది.

                                                             * చిలుకూరి శ్రీనివాసరావు, 8985945506