Oct 23,2021 18:16

ఏ హస్తకళ కళాకారుడైన తన కళనే జీవితంగా, జీవనోపాధిగా చేసుకుని బతుకుతాడు. ఆ కళ అభివృద్ధి పయనంలో ఒడిదుడుకులనెదుర్కొంటూ ముందుకు వెళతాడు. వేరే వ్యాపకమే లేని గంగాధర్‌ కూడా చెక్క అచ్చుల తయారీలో నైపుణ్యం సాధించారు. ఎంతో కష్టతరమైన, కళ్లు చెదిరిపోయే డిజైన్లను చెక్కి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన కృషిని గుర్తించిన ప్రభుత్వం జాతీయస్థాయి అవార్డుకి ఎంపిక చేసింది.
కళంకారీ వస్త్రాలకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. అలాంటి వస్త్రాలపై రంగులద్దే చెక్క అచ్చులను గంగాధర్‌ తయారుచేస్తారు. కృష్ణా జిల్లా, మచిలీపట్నం సమీపంలో పెడన నగరం చేనేత కళంకారీకి ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. వస్త్రాలపై రకరకాల డిజైన్లు వేసేందుకు ఉపయోగించే బ్లాక్‌మేకింగ్‌ (అచ్చుల డిజైనింగ్‌) ముఖ్యమైనది. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక చెక్కను అందమైన పూలు, అల్లికలు, జంతువులు, ప్రకృతి అందాల ఆకారంలో చెక్కాలి. ఏకాగ్రతతో దృష్టి పెట్టడం ఈ వృత్తిలో కీలకం. ఈ పనిలో 45 ఏళ్ల నుంచి టేకు చెక్క అచ్చులను డిజైన్‌ చేయడమే కాకుండా, తయారీ కేంద్రాన్ని నడుపుతూ ఇతర కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నారు తెలంగాణకు చెందిన గంగాధర్‌. ఈ విద్యను ఆయన పెదనాన్న నరసింగరావు వద్ద చదువుకునే రోజుల్లో నేర్చుకున్నారు. ఈ వృత్తి మీద ఉన్న ఆసక్తితో హైస్కూలు స్థాయిలోనే తన చదువును నిలిపివేశారు. పదమూడేళ్ల వయస్సు నుంచే చెక్కల మీద రకరకాల డిజైన్లను చెక్కారు. పెద్దనాన్న సారథ్యంలో వృత్తిలో మెళకువలు తెలుసుకున్నారు. అప్పుడే చుట్టుపక్కల రాష్ట్రాల వస్త్ర వ్యాపారులతో పరిచయం ఏర్పరచుకున్నారు. ఆ నమ్మకంతో వృత్తిలో ఏడేళ్ల అనుభవం తర్వాత విడిగా వ్యాపారాన్ని ప్రారంభించారు. అప్పటికే వస్త్రకళలో పేరుపొందిన పెడన నగరంలో తన వ్యాపారాన్ని ప్రారంభిస్తే లాభాలు వస్తాయని అనుకున్నారు. 38 ఏళ్ల క్రితం గంగాధర్‌ ఒక్కరే పెడనకు వచ్చి చెక్క అచ్చుల తయారీని ప్రారంభించారు. వ్యాపారంలో ఎన్నో అడ్డంకులు, నష్టాలను చవిచూశారు. అయినా తిరిగి వెళ్లకుండా అక్కడే పని చేశారు. అన్నిట్లో గంగాధర్‌కి తోడుగా నిలిచిన తమ్ముడు నరసయ్య కొన్ని రోజుల తర్వాత పెడనకు చేరుకున్నారు. కళాంకారీ డిమాండ్‌ పెరగడంతో అచ్చుల తయారీ కూడా వేగం పుంజుకుంది. అన్నదమ్ములిద్దరూ అప్పుడు అచ్చుల తయారీకి కొత్త వృత్తిదారులను తయారుచేసుకోవడం ప్రారంభించారు. వృత్తిలో అపారమైన అనుభవం ఉన్న గంగాధర్‌ వారికి పని నేర్పిస్తూ, సుమారు 200 మందికి ఉపాధి కల్పించారు. వస్త్రవ్యాపారులు అడిగిన డిజైన్లను చెక్కి పెడనకి, కేరళ, తమిళనాడు, మద్రాసు, బెంగుళూరు ఎన్‌ఎడి, సౌత్‌ ఇండియాలో వేల మంది వ్యాపారులకు బ్లాకులను అందజేశారు.

kalankari 3


అచ్చుల తయారీ..
ఎటువంటి మందులు వేయని, సహజ సిద్ధంగా పెరిగిన టేకు చెట్ల నుంచి వచ్చిన చెక్క మాత్రమే గంగాధర్‌ ఉపయోగిస్తారు. రాజమండ్రి అడవుల నుంచి టేకును తెప్పించి, వాటిని ముక్కలుగా చేసి, వాటిపై సైన్‌ పేపర్‌ కొట్టి, దానిపై తెల్లని టిటోనియం పౌడర్‌ని అద్దుతారు. దానిపై ముందుగా వేసుకున్న ఓ పేపర్‌ డిజైన్‌ని ఆ చెక్క మీద మేకులతో అంటిస్తారు. తర్వాత ఆ చెక్కను ఆ ఆకృతిలో చెక్కుకుంటారు. ఇలా చెక్కడానికి సుమారు వారం నుంచి నెల రోజులు పడుతుంది. కొన్ని పెద్ద డిజైన్లకు మూడు నెలల సమయం కూడా పడుతుంది. ఇలా తయారు చేసిన చెక్క అచ్చులను కొన్ని రోజులు నూనెలో ఉంచి తీస్తారు. అలా తయారైన అచ్చులు సుమారు వంద సంవత్సరాలు చెడిపోకుండా ఉంటాయి. వీటినే 'వుడ్‌బ్లాక్‌ మేకింగ్‌' అంటారు. వీటిని వస్త్ర వ్యాపారులకు అందజేస్తారు. వారు చీరలు, దుప్పట్లు, వస్త్రాల మీద రంగులతో ఆ డిజైన్లను ముద్రిస్తారు. ఇలా రూ.50 నుంచి లక్ష రూపాయల ధర పలికే డిజైన్లను కొన్ని వేలల్లో చెక్కారు గంగాధర్‌. ఆయన చెక్కిన మ్యాంగో డిజైన్‌, కూజా డిజైన్లు దాదాపు మూడేసి నెలలు పట్టాయి. ఆయన కృషిని ప్రభుత్వం గుర్తించి 2005లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చేతుల మీద నేషనల్‌ అవార్డును అందజేశారు. కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి తయారు చేసిన కొత్త బ్లాక్‌ డిజైన్లను ప్రభుత్వం దృష్టికి పంపగా, గంగాధర్‌ని 'శిల్పగురు' అవార్డుకి ఎంపిక చేశారు.
ఈ వుడ్‌ బ్లాక్‌ మేకింగ్‌ మీద కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ గంగాధర్‌ పట్టు సాధించారు. ఈయన పంపిన బ్లాక్‌లు రాజస్థాన్‌ నుంచి ఆస్ట్రేలియా, కెనడా దుబారు, రష్యాకి వెళుతున్నాయి. అంతేకాకుండా తమిళనాడు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, రాజమండి, కాకినాడ, కొత్తగా ప్రారంభిస్తున్న వుడ్‌బ్లాక్‌ పాయింటకలను కొత్త వ్యాపార కళాకారుల చేత ప్రారంభించేలా ప్రోత్సహించారు. వారికి తన దగ్గర పనిచేస్తున్న డిజైనర్ల చేత ట్రైనింగ్‌ ఇప్పించడం, సలహాలు, సూచనలు చేస్తూ 110 చెక్క అచ్చు కేంద్రాలను ప్రారంభించారు. అలా 150 మంది కళాకారులకు జీవనోపాధికి కారకులయ్యారు. ఈ వృత్తిని భవిష్యత్తు తరాలకు అందించేలా ఆయన వారసత్వంగా కూతురు స్వాతిని ఈ రంగంలోకి తీసుకువచ్చారు.
 

kalnkari 3

కరోనా వల్ల నష్టం : గంగాధర్‌
లాక్‌డౌన్‌లో ఒక్కసారిగా వ్యాపారం నిలిచిపోయింది. దీంతో వర్కర్లకు పని లేకుండా పోయింది. వారందరికీ రెండు నెలల పాటు జీతం ఇచ్చాను. కానీ ఉత్తరాఖండ్‌ నుంచి వచ్చిన కళాకారులు తిరిగి వెళ్లిపోయారు. ఇప్పుడు కేవలం పది మంది పనివాళ్లతోనే కేంద్రాన్ని నడుపుతున్నాను. బయట నుంచి ఆర్డర్లు రాకపోవడంతో వీరికి కూడా పని ఇవ్వలేకపోతున్నాం. ఎప్పుడో ఒకటీ అరా వస్తాయి. నన్ను నమ్ముకుని వీరి కుటుంబాలు బతుకుతున్నాయి. నేనే ఏదో ఒక పని చెబుతూ జీతం ఇస్తున్నాను. సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి. ప్రతిరోజూ బ్లాక్‌లు అమ్ముడుపోతాయని ఆశతో బయట పెడతాం. కానీ సాయంత్రానికి తిరిగి వాటిని లోపలికే తీసుకెళ్లాల్సివస్తుంది. ఇలా అయితే భవిష్యత్తులో ఈ కేంద్రం మూతపడుతుంది.

kalankari 5


- పద్మావతి