Mar 05,2021 17:26

అమరావతి: అంచనాలకు మించి అప్పుచేసిన విషయం వాస్తవమేనని మంత్రి బుగ్గన ఒప్పుకున్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోందని కాగ్‌ రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో.. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి దానిపై గురువారం వివరణ ఇచ్చారు. కరోనా వల్ల రాబడి తగ్గడమే కాకుండా ఖర్చు విపరీతంగా పెరిగిందన్నారు. గతేడాది సరిగ్గా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కరోనా నియంత్రణకు ప్రతి రోజూ రూ.వందల కోట్లు వెచ్చించాల్సి వచ్చిందన్నారు. ఈ క్రమంలో కేంద్రం నుండి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులను తెచ్చుకున్నామన్నారు.
ఇటీవల కాగ్‌ తన రిపోర్టులో..పదినెలలకు గానూ రాష్ట్రం రూ.73,913 కోట్లు రుణం తీసుకుందని పేర్కొంది. బడ్జెట్‌ అంచనా రూ.48,295 కోట్లు కాగా, ఇది అంచనా కన్నా 153శాతం ఎక్కువని తేల్చింది. రెవెన్యూ లోటు పెరిగిపోతోందని, ఇది 300శాతం అధికమని కాగ్‌ చెబుతోంది. బడ్జెట్‌లో రెవెన్యూ లోటు రూ.18,434 కోట్లు అంచనా వేయగా అసలు రెవెన్యూ లోటు రూ.54,046 కోట్లు ఉందని రిపోర్టులో నివేదించింది. సంక్షేమ కార్యక్రమాలతో అప్పుల ఊబిలో ఏపీ చిక్కుకుందని, గతేడాది జనవరి నెలాఖరు వరకు అప్పులు రూ.46,503 కోట్లు తీసుకుందన్నారు. బహిరంగ మార్కెట్‌ రుణాల సేకరణలో ఏపి దేశంలోనే 4వ స్థానంలో ఉందని కాగ్‌ వివరించింది.