Oct 27,2021 23:40

మాట్లాడుతున్న బాలకృష్ణ చౌదరి

ప్రజాశక్తి - నౌపడ: విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరుల త్యాగం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని ఎపిఎస్‌పి విజయనగరం 5వ బెటాలియన్‌ ఆర్‌ఐ బాలకృష్ణ చౌదరి అన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండలంలోని దండుగోపాలపురం జెడ్‌పి ఉన్నత పాఠశాలలో ఎపిఎస్‌పి సాయుద దళం ఆధ్వర్యాన అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా ఇదే పాఠశాలలో చదివి, నక్సలైట్ల తూటాలకు వీర మరణం పొందిన కీర్తిశేషులు పి.లక్ష్మణరావు, పి.కృష్ణారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం పని చేసి, విధి నిర్వహణలో అమరులైన వారు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని అన్నారు. విద్యార్థులు పోలీసుశాఖపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రజా సేవకు ఈ శాఖలో చేరాలని పిలుపునిచ్చారు. హెచ్‌ఎం పి.జానకిరామయ్య మాట్లాడుతూ అమరవీరులు చదివిన పాఠశాలలో వారి విధులు, త్యాగాలను వివరించడం ద్వారా విద్యార్థులు ఉత్తేజితులవుతారని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కరరావు, వీరభద్రరావు, ఆదికేశవరెడ్డి, లక్ష్మీకాంతం, భవాని, లక్ష్మి, చంద్రశేఖర్‌, సూర్యకాంతం, సునీత, పార్వతి, అరుణశ్రీ, ఉమాకుమారి, చిన్నారావు, రాము, నాగలక్ష్మి, మార్కండేయులు, గిరి పాల్గొన్నారు.