Apr 14,2021 21:59

యడ్లపాడు (గుంటూరు జిల్లా): తుమ్మలపాలెం అమరుల స్మారక స్తూపాల ప్రాంతాన్ని సాంస్కృతికంగా కేంద్రంగా తీర్చిదిద్ది, పాలకపక్షం భావజాలానికి దీటుగా కష్టజీవుల సంస్కృతిని అభివృద్ధి చేయడానికి సిపిఎం తనవంతు కృషి చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తుమ్మలపాలెంలోని అమర్‌నగర్‌లో అమరవీరుల స్మారక సభ మంగళవారం నిర్వహించారు. ఎంసిపిఐ (యు) నాయకులు కె.శ్రీధర్‌ అధ్యక్షతన జరిగిన సభలో మధు మాట్లాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరుల త్యాగాలు వృథా కావని, వారి పోరాట స్ఫూర్తితో నేటి రైతు ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని, సహజ వనరులను కొల్లగొడుతోందని, ఒకే దేశం, ఒకే మార్కెట్‌ పేరుతో దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ ప్రమాదకర రాజకీయ పరిస్థితుల్లో కేంద్రాన్ని ఎదుర్కోడానికి కమ్యూనిస్టులతో ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ దేశ సమైఖ్యత, భూ సంస్కరణలకు కమ్యూనిస్టు ఉద్యమమే కారణమని గుర్తు చేశారు. రాజ్యాగ వ్యవస్థలను మార్చాలని బిజెపి భావిస్తోందని, ఈ నేపథ్యంలో కమ్యూనిస్టుల ఐక్యత ఎంతో అవసరమని, ఐక్య కార్యాచరణ రూపొందించి ఉద్యమించాలని చెప్పారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గన్న మాజీ ఎంపి, సిపిఐ ఎంఎల్‌ నాయకులు దండా నారాయణ స్వామి కుమార్తె అరుణ పాల్గని మాట్లాడుతూ కమ్యూనిస్టులు భవిష్యత్‌లో కచ్చితంగా సఫలీకృతం అవుతారని ఆకాంక్షించారు. సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నాయకులు పి.ప్రసాద్‌, సిపిఐ ఎంఎల్‌ నాయకులు ఎం.శివనాగరాజు పాల్గని మాట్లాడారు. తొలుత అమరుల స్తూపాల వద్ద జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి వచ్చిన కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయా పార్టీల జెండాలను ఆవిష్కరించారు. సిపిఎం జెండాను నంబూరు తులశయ్య, సిపిఐ జెండాను కె.నారాయణ, సిపిఐ ఎంఎల్‌ జెండాను ఉల్లిగడ్డల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో అమరుల స్మాకర ట్రస్టు కన్వీనర్‌ చెరుకూరి సత్యనారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య, పశ్చిమ గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ, నాయకులు పోపూరి సుబ్బారావు, సిపిఐ నాయకులు సిఆర్‌ మోహన్‌, ఆర్‌.వెంకటేశ్వరరావు, నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌ పాల్గొన్నారు.