Nov 26,2021 06:48

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉద్దండరాయునిపాలెం వద్ద రాజధానికి శంకుస్థాపన చేసి ఎటువంటి సహాయాన్ని ప్రకటించలేదు. విభజన చట్టంలోని సెక్షన్‌ 94(3) ప్రకారం రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి మరియు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలతో ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌ నూతన నిర్మాణానికి కేంద్రం సహాయం అందించాలి. దీనికి అప్పటి ప్రభుత్వం రూ. 42,935 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసి కేంద్రానికి సమర్పించింది. కేంద్రం ఇప్పటివరకు కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చింది. పై విషయాలను పరిశీలిస్తే ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా, రాజధాని నిర్మాణానికి అవసరమైన సహాయం చేయకుండా కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆంధ్రా ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌ విభజన తరువాత అందరి అంగీకారంతో అమరావతి రాజధానిగా ఏర్పడింది. 2019లో వై.యస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి, 2020లో మూడు రాజధానుల చట్టం, సి.ఆర్‌.డి.ఏ రద్దు చట్టాలు చేయటం అనేక వివాదాలకు దారితీసింది. అప్పటి నుండి అనేక ఉద్యమాలు, న్యాయ వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఈ రెండు చట్టాలను రద్దు చేస్తూ శాసనసభ, శాసనమండలిలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శాసనసభలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ చట్టాల స్థానంలో సమగ్రమైన మరో బిల్లు త్వరలో తెస్తామని ప్రకటించారు. ఇది సమంజసం కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి, అమరావతినే పాలనా రాజధానిగా కొనసాగించాలని ప్రజలు, రైతులు, పౌర సమాజంలో మేధావులు కోరుతున్నారు.
 

                                                    శ్రీ బాగ్‌ ఒడంబడిక

ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బిల్లు ప్రవేశపెడుతూ శ్రీబాగ్‌ ఒడంబడిక గురించి ప్రముఖంగా పేర్కొన్నారు. అయితే 1937లో జరిగిన శ్రీబాగ్‌ ఒడంబడికలో అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పేర్కొన్నారు తప్పితే, రాజధానుల వికేంద్రీకరణ గురించి కాదు. రాజధాని రాయలసీమలో పెడితే, హైకోర్టు కోస్తా జిల్లాలలో ఏర్పాటు చేయాలని, రాజధాని కోస్తా జిల్లాలలో పెడితే హైకోర్ట్‌ రాయలసీమలో ఏర్పాటు చేయాలని శ్రీబాగ్‌ ఒప్పందంలో పేర్కొన్నారు. 1953 అక్టోబర్‌ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని కర్నూలులో, హైకోర్టు గుంటూరులో ఏర్పాటు చేశారు. ఇప్పుడు రాజధాని అమరావతిలో ఏర్పాటు చేశారు కాబట్టి, హైకోర్టును కర్నూలు లో ఏర్పాటు చేసి హైకోర్టు బెంచ్‌లను అమరావతిలో, విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలి. ఎగ్జిక్యూటివ్‌, లెజిస్లేచర్‌లను ఒకేచోట నుండి అంటే అమరావతి నుండి పాలన కొనసాగించాలి.
 

                                             అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి

గత అనుభవాల దృష్ట్యా ప్రజలందరూ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాలు, రాయల సీమ జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ప్రతి జిల్లాలో కొన్ని ప్రాంతాలు కూడా వెనుకబడి ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలలో (విశాఖపట్నం నగరం మినహా) ఆర్థిక, సామాజిక జీవన ప్రమాణాలు, అక్షరాస్యతలో పూర్తిగా వెనుకబడి ఉన్నాయి. రాయలసీమలో అనేక ప్రాంతాలలో 1500 అడుగులు దాటినా బోర్లలో చుక్క నీరు పడటంలేదు. మరోవైపు గోదావరి నదీ జలాలలో ప్రతి సంవత్సరం 100 టి.యం.సి ల నీరు వృధాగా సముద్రం పాలవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌ మూడు నదులతో 970 కిలో మీటర్ల కోస్తా తీరంతో, గనులతో, పంటల వైవిధ్యంతో నైపుణ్యాలతో ఉన్న రాష్ట్రమైనప్పటికి, ప్రాంతీయ అసమానతలు ఆర్థిక, సామాజిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయి. అందువలన ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.
     ఉత్తరాంధ్రలో 3, రాయలసీమలో 4 మొత్తం 7 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించి...ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం-2014 చెప్పింది. విభజన చట్టంలో సెక్షన్‌ 46(3) ప్రకారం ఈ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నాటి ప్రధాని డాక్టర్‌ మనోహ్మన్‌ సింగ్‌ ఈ జిల్లాలకు బుందేల్‌ ఖండ్‌ తరహా, కోరాపుట్‌-బోలంగీర్‌-కలహండి (ఒడిషా) తరహా ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని చెప్పారు. దీని ప్రకారం రూ.24 వేల కోట్లు సహాయం అందించాలి. ఇప్పటికి కేవలం రూ.1400 కోట్లు మాత్రమే ఇచ్చారు.
     అందువలన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ గురించి ఆలోచించకుండా, అభివృద్ధి వికేంద్రీకరణ గురించి సమగ్ర దృక్పథంతో ఆలోచించాలి.
 

                                       రాజధాని - చంద్రబాబు నాయుడు నమూనా

రాజధాని నిర్మాణానికి సూచనలు చేయడానికి సెక్షన్‌ 6 ప్రకారం నిపుణుల కమిటీని నియమించాలి. పట్టణ అధ్యయనాలలో నిష్ణాతులైన శివరామకృష్ణన్‌ చైర్మన్‌గా నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ రాష్ట్రమంతటా పర్యటించి నివేదిక రూపొందించింది. ఆ నివేదికను పరిగణన లోకి తీసుకోకుండానే, నాటి ముఖ్యమంత్రి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తామని, సి.ఆర్‌.డి.ఏ. ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
     చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 'భూసేకరణ' విధానాన్ని పక్కన పెట్టి, 'భూసమీకరణ' విధానాన్ని తెచ్చి గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాలలో 33 వేల ఎకరాలను సమీకరణ చేసింది. భూములు ఇచ్చిన రైతులకు నివాస, వాణిజ్య స్థలాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ రైతులకు వాటి కేటాయింపు జరగలేదు. సింగపూర్‌కు చెందిన సుర్బానా, జురాంగ్‌ సంస్థలు రాజధాని ప్రణాళికను రూపొందించాయి. సీడ్‌ కాపిటల్‌ను 16.8 చ.కి మీటర్లలో నిర్మించాలని, 29 గ్రామాలలో 217 చ.కి.మీ. పరిధిలో నవ నగరాలు నిర్మించాలని, 2050 నాటికి కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ 8,603 చ.కి.మీ. పరిధిలో అమరావతి మహానగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు.
     సీడ్‌ కాపిటల్‌ పరిధిలో 1691 ఎకరాలలో 'స్టార్టప్‌ ఏరియాను' దశల వారీగా అభివృద్ధి చేయటానికి స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో సింగపూర్‌ కంపెనీలకు అప్పగించారు. దీనితో పాటు ప్రైవేట్‌ సంస్థలకు, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలకు వందల ఎకరాలను చౌకగా కేటాయించారు.
   చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి కార్పొరేట్‌ పద్ధతిలో చేసిన ఆలోచనలను అనేక ప్రజాసంఘాలు, పౌర సంఘాలు, మేధావులు వ్యతిరేకించారు.
 

                                            ప్రజలకు బి.జె.పి అన్యాయం

నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రులకు పూర్తి అన్యాయం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని ప్రధాన అంశాలను ఎనిమిదేళ్లుగా అమలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల జనాభా నిష్పత్తి 58:32, 41.68గా ఉన్నది. ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌కు 46 శాతం తెలంగాణకు 54 శాతం వెళ్లింది. ఈ పరిస్థితుల్లో విభజన హామీలైన రాజధాని నిర్మాణం, 7 వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి, పోలవరం నిర్మాణం, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, పారిశ్రామిక కారిడార్‌, దుగ్గరాజపట్నం దగ్గర భారీ ఓడరేవు, కడపలో ఉక్కు కర్మాగారం, రైల్వే జోన్‌, పెట్రో-రసాయన సముదాయం మొదలగు హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలి. ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు అదనపు నిధులు కేటాయించాలి. పైన పేర్కొన్న వాటిలో ఏ ఒక్క అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రత్యేక హోదా అంశాన్ని దాటవేసినది.
     రాజధాని నిర్మాణంలో కూడా కేంద్ర బి.జె.పి. ప్రభుత్వం మొండి చేయి చూపించింది. 2015 అక్టోబర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉద్దండరాయునిపాలెం వద్ద రాజధానికి శంకుస్థాపన చేసి ఎటువంటి సహాయాన్ని ప్రకటించలేదు. విభజన చట్టంలోని సెక్షన్‌ 94(3) ప్రకారం రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి మరియు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలతో ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌ నూతన నిర్మాణానికి కేంద్రం సహాయం అందించాలి. దీనికి అప్పటి ప్రభుత్వం రూ. 42,935 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసి కేంద్రానికి సమర్పించింది. కేంద్రం ఇప్పటివరకు కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చింది.
    పై విషయాలను పరిశీలిస్తే ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా, రాజధాని నిర్మాణానికి అవసరమైన సహాయం చేయకుండా కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆంధ్రా ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో తెలుస్తుంది. బిజెపి ఆంధ్రప్రదేశ్‌ నాయకులు కూడా రాష్ట్రంలో ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా, ఒకో ప్రాంతంలో ఒకో విధమైన ప్రకటనలు చేస్తున్నారు.
 

                                             రైతులకు న్యాయం జరగాలి

రాజధాని ప్రాంత రైతులు 29 గ్రామాల నుండి 33 వేల ఎకరాలు భూ సమీకరణలో ఇచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధిపై వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భూములు ఇచ్చిన రైతులలో 80 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. పెనుమాక, ఉండవల్లి, వెంకటపాలెం తదితర గ్రామాలలో 3 పంటలు పండే సారవంతమైన భూములను కూడా రైతులు భూ సమీకరణలో ఇచ్చారు. సి.ఆర్‌.డి.ఏ చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు మూడేళ్లలోగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలి. గత ప్రభుత్వం మూడేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వలేకపోయింది. సుమారు 54 వేల ప్లాట్లను 2018లో కాగితాల పైనే అప్పగించి చేతులు దులుపుకున్నది. ఈ నేపథ్యంలో భూములు ఇచ్చిన రాజధాని రైతులకు పూర్తిగా న్యాయం జరగాలి. 29 గ్రామాల పరిధిలో దళితులు, బి.సి. జనాభా 70 శాతం పైగా ఉన్నారు. వ్యవసాయ పనులు లేక వీరిలో అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఈ ప్రాంత ప్రజలకు, ఉపాధి కోల్పోయిన వారికి, కూలీలకు నెలకు రూ.5 వేలు పెన్షన్‌ ఇవ్వాలని రాజధాని అభివృద్ధి వేదిక లాంటి కమిటీలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
 

                                          రాజధాని అంటే రియల్‌ ఎస్టేట్‌ కాదు

రాష్ట్ర విభజనతో పాలనాపరంగా ప్రజలకు అందుబాటులో ఉండే ఒక ప్రజా రాజధాని ఏర్పడాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కోరుకున్నారు. రాష్ట్రంలో దూరంగా ఉన్న జిల్లాలకు అమరావతి మధ్యస్థంగా ఉండి అందుబాటులో ఉంటుందని భావించారు. రాయలసీమ ప్రాంతం లోని అనంతపురం జిల్లాకు, ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం జిల్లాకు అమరావతి మధ్యస్థంగా ఉండి పాలనా పరంగా ప్రజలకు సేవలు అందుతాయని భావించటం వలనే అనేకమంది మేధావులు అమరావతి పాలనా రాజధానిగా కొనసాగాలని భావిస్తున్నారు. కాని కొంతమంది అమరావతి వలనే భూముల ధరలు పెరిగాయని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి ఆలంబనగా ఉందని, గుంటూరు-తాడేపల్లి-మంగళగిరి-విజయవాడల మధ్య అపార్ట్‌మెంట్లు, ప్లాట్‌ల వ్యాపారం పుంజుకుందని భావించారు. మూడు రాజధానుల చట్టం వలన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పడిపోయిందని, భూముల ధరలు పడిపోయాయని వాపోతున్నారు. అభివృద్ధి అనేది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో జరగదని గ్రహించాలి. హైదరాబాద్‌ మహానగరంగా అభివృద్ధి చెందటానికి ప్రభుత్వరంగ పరిశ్రమలు, ఉపాధి కల్పన ఎంత దోహదపడ్డాయో అందరికి తెలిసినదే. అభివృద్ధి అనేది ఒక ప్రక్రియ. పరిశ్రమల ఏర్పాటు, ఐ.టి రంగ అభివృద్ధి, ఉపాధి కల్పన, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు మొదలైన వాటి ఏర్పాటుతో మాత్రమే అభివృద్ధి సాధ్యమౌతుంది.
 

                                                   రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వాస్తవిక దృక్పథంతో ఆలోచించి అభివృద్ధి వైపు అడుగులు వేయాలి. పాలనా రాజధానిగా అమరావతిని కొనసాగించి, రాజధాని వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. రాజధాని గురించి మరో చట్టాన్ని తెచ్చే ఆలోచన విరమించుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని హామీలను అమలు చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్లాలి. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి అవసరమైన ప్రణాళికను రూపొందించి ఇరిగేషన్‌, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన మొదలైన అంశాలపై దృష్టి పెట్టాలి.
     అమరావతిలో భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తూ, ప్రజా రాజధానిగా అభివృద్ధి చేయాలి. అసంపూర్తిగా ఉన్న రాజధాని ప్రాంత రోడ్లను, నిర్మాణాలను పూర్తి చేయాలి. గుంటూరు, కృష్ణా జిల్లాలలో వివిధ ప్రాంతాలలో ఉన్న కమిషనరేట్లను రాజధానిలో నిర్మాణంలో ఉన్న భవనాలకు తరలించాలి. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేయాలి.

వ్యాసకర్త : శాసనమండలి సభ్యులు,
సెల్‌ : 94402 62072
కె.యస్‌. లక్ష్మణరావు

అమరావతి పాలనా రాజధానిగా కొనసాగాలి