Feb 03,2021 07:41

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ స్ట్రాటజిక్‌ సేల్‌ (వ్యూహాత్మక అమ్మకం)పై ప్రతిపాదన ఉంటుందని భావించిన వారు బడ్జెట్‌లో లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ, అంతలోనే మంగళవారం సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను స్ట్రాటజిక్‌ సేల్‌ చేస్తున్నట్లు నిర్ణయించిన విషయం ఆంగ్ల పత్రిక బిజినెస్‌ లైన్‌లో కథనం రావడంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికవర్గం తీవ్ర ఆందోళనతో ఉంది. రాష్ట్రంలో ప్రసిద్ధమైన, స్టీల్‌ ఉత్పత్తిలో ప్రతిష్టాత్మకమైన మైలు రాళ్లను దాటుతూ ఆర్‌ఐఎన్‌ఎల్‌ ప్రగతి యావత్‌ దేశం గర్వించేలా ఉంది. అయినా, దీన్ని అమ్మేయాలని నిర్ణయించారు. కేంద్ర కేబినెట్‌ నిర్ణయాన్ని ఐక్యంగా తిప్పి కొడతామని గుర్తింపు సంఘం నాయకులు అయోధ్యరామ్‌ అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో 35 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. 20 వేల ఎకరాలు, లక్షన్నర కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా పోరాడాలని కార్మికవర్గాన్ని కోరారు.