May 03,2021 19:36

అసోం పశ్చిమప్రాంత శివసాగర్‌ ఎమ్మెల్యేగా అఖిల్‌ విజయం 2021 అసెంబ్లీ ఎన్నికలలో ఓ మైలురాయి. అతను ఓ సాధారణ వ్యక్తి. సుమారు ఏడాదిన్నర తరువాత నామినేషన్‌ వేసేటప్పుడే బాహ్యప్రపంచాన్ని చూశాడు. దేశద్రోహి నెపంతో బిజెపి అతనిని ఖైదు చేసింది. జైలు నుంచి పోటీచేస్తున్న అఖిల్‌ తరపున ప్రచారం చేయడానికి ముందుకు వచ్చింది అతని తల్లి. వృద్ధాప్యంలో నడవలేని స్థితిలో కూడా కొడుకు పక్షాన నిలబడి మండుటెండను సైతం లెక్కచేయకుండా ఇంటింటికీ తిరిగిన ఆ తల్లి కోరిక నేడు నెరవేరింది. అఖిల్‌కు మునుపెన్నడూ ఆ ప్రాంత అభ్యర్థికి రానటువంటి అనూహ్య మెజార్టితో విజయం కైవసమైంది.
రారుజోర్‌దళ్‌ పార్టీ స్థాపకుడు, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అఖిల్‌ గొగోరు(42) ప్రజల పక్షం నిలిచేవ్యక్తి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి పార్టీని నెలకొల్పాడు. ప్రజా వ్యతిరేక చట్టం, దాని పర్యావసానాలను ప్రజలకు తెలియజేసేందుకు సభలు, సమావేశాలు నిర్వహించి ఎన్నో ప్రసంగాలు చేసేవాడు. పోలీసు దెబ్బలు, ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రజలను చైతన్యం చేయడంలో ముందుండేవాడు. అఖిల్‌ చర్యలు బిజెపికి కంటి మీద కునుకులేకుండా చేశాయి. దేశద్రోహి, అసెంబ్లీ వ్యతిరేక కార్యకలాపాలు, ఆత్మహత్యకు పూనుకోవడం, ఉగ్రవాద సంబంధాలు వంటి 56 కేసులు బనాయించి 2019 డిసెంబరు 12న జైల్లో పెట్టించింది.
ఆ తరువాత కొన్ని నెలలకు అఖిల్‌ ఆరోగ్యం కూడా దెబ్బతింది. పోలీసులు అంతలా వేధించారు. అయినాసరే అఖిల్‌ ప్రభుత్వానికి అదరలేదు, బెదరలేదు, తనను ఎంత అణగదొక్కాలని చూస్తే అంతలా ఎగసిపడ్డాడు. అతని పట్టుదలకు ఆ పార్టీ సభ్యులు, కుటుంబసభ్యుల మద్దతుతో పాటు 85 ఏళ్ల వృద్ధురాలు అతని తల్లి ప్రియదా గొగోరు తోడైంది.
శివసాగర్‌ ప్రాంతంలో నిలబడిన అఖిల్‌ ప్రత్యర్థులు రాజకీయాల్లో కొమ్ములుతిరిగిన నాయకులు. కాంగ్రెస్‌ నుంచి సుభ్రమిత్ర గొగోరు, బిజెపి నుంచి రాజ్‌కొన్వరి, ఎన్‌సిపి నుంచి అజిత్‌ హజరికా ఇంకా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మధ్య జరిగిన పోరులో కనీవినీ ఎరుగని మెజారిటీతో అఖిల్‌ గెలుపొందాడు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే అఖిల్‌ జోర్హట్‌ జిల్లా వాసే అయినా శివసాగర్‌ అతని సొంతూరు కాదు. అయినా సరే ఈ ప్రాంతం నుంచి పోటీచేసి స్థానిక నాయకులను తలదన్నే విజయాన్ని సొంతంచేసుకున్నాడు. శివసాగర్‌ కాంగ్రెస్‌కు కంచుకోట. దాన్ని బద్దలు కొట్టేందుకు బిజెపి సర్వశక్తులు ఓడింది. బిజెపి ప్రముఖులందరూ ఈ ప్రాంత ప్రచారంలో విశేషంగా పాల్గన్నారు. అతిరథ మహారధులెంతమంది పోటీలో నిలబడ్డా ఓ వృద్ధురాలు వారందరినీ వెనక్కునెట్టింది. జోర్హట్‌ నుంచి శివసాగర్‌కు మకాం మార్చి అక్కడే ఫుకన్‌ నగర్‌ స్థానికులు ఏర్పర్చిన తాత్కాలిక వసతిగృహం నుంచే ప్రచారం చేసింది. ఆ ప్రాంత వాసులందరికీ ప్రియదా 'మా'గానే పరిచయమైంది. 'నా కొడుకు ఏడాదిన్నరగా నాకు దూరంగా ఉన్నాడు. ప్రభుత్వం అతనిపై అనవసర నేరం మోపింది. దానికి ఆధారాలు కూడా లేవు. నా కొడుకు నిర్దోషిగా బయటపడాలంటే ఈ ఎన్నికలలో గెలవడం ఎంతో ముఖ్యం. అతనికి ఓటు వేసి నాకు సాయం చేయండి' అని ఎంతో దీనంగా అభ్యర్థించింది.  ఆ తల్లి ఆకాంక్షను నెరవేర్చారు ఆ ప్రాంతం వాసులు. ఎకాఎకిన ఒకటి రెండు వందలు కాదు 9 వేల మెజారిటీతో ప్రత్యర్థి అభ్యర్థి బిజెపి వ్యక్తిని మట్టి కరిపించి అఖిల్‌ గొగోరుకు పట్టం కట్టారు.
వాస్తవానికి 2021 అసెంబ్లీ ఎన్నికలు ఇటువంటి ఎన్నో దృగ్విషయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచి బిజెపికి భంగపాటు కలిగించాయి. కుట్రలు, కుతంత్రాలు, మతోన్మాదంతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, ప్రభుత్వరంగాన్ని గంపగుత్తగా ప్రైవేటుకు ధారాదత్తం చేయడం వంటి ఎన్నో పనులను అడ్డూ అదుపు లేకుండా తన ఇష్టారాజ్యంగా చేస్తున్న బిజెపికి అఖిల్‌ గెలుపు ఓ చెంపపెట్టు. ఈ ఓటమి ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు. ముందుముందు ఇటువంటి ఎన్నో పరాజయాలు బిజెపి వందిమాగధులు రుచిచూడక తప్పదు.