Oct 30,2020 18:19

న్యూయార్క్‌ : అమెరికాలో కరోనా వైరస్‌ మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. శీతాకాలం ప్రభావానికి తోడు, దేశ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో పార్టీలు నిర్వహిస్తున్న ర్యాలీలు, సమావేశాల కారణంగా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య తిరిగి పుంజుకుంటోంది. గత 24 గంటల వ్యవధిలో దాదాపు 89 వేలకు పైగా కొత్తగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో గత శుక్రవారం వచ్చిన రోజువారీ కేసుల రికార్డు సంఖ్య 85 వేలను దాటింది. దీని ప్రకారం అమెరికాలో సెకనుకు ఒక కొత్త కేసు నిర్ధారణ అవుతుందన్నమాట. దేశం మొత్తం మీద కరోనా భారిన పడిన వారి సంఖ్య ఇప్పటివరకు 92 లక్షలకు పైగా చేరింది. అదేవిధంగా 2.34 లక్షల మంది మరణించారు. కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న మొదటి దేశం అమెరికా కాగా రెండు, మూడు స్థానాల్లో భారత్‌, బ్రెజిల్‌ వున్నాయి. ఇప్పటివరకు బ్రెజిల్‌లో 54.96 లక్షల కేసులు నమోదయ్యాయి. వెబ్‌సైట్‌ వెర్డొమీటర్‌ వెల్లడించిన ప్రకారం ప్రస్తుతం అమెరికాలో 29,95,245 యాక్టివ్‌ కేసులు వున్నాయి. వీరిలో 16,950 మంది పరిస్థితి విషమంగా వుంది. ఇక బ్రెజిల్‌లో మరణించిన వారి సంఖ్య 1,59,159గా వుంది. ప్రస్తుతం దేశంలో 3,83,210 యాక్టివ్‌ కేసులు వున్నాయి. వీటిల్లో 8,318 మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.