Apr 13,2021 07:24

   భారత సముద్ర జలాల్లోకి అమెరికా యుద్ధనౌక చొరబాటు అగ్రరాజ్యం తెంపరితనాన్ని తెలియజేస్తోంది. భారత సార్వభౌమత్వాన్ని బాహాటంగా సవాల్‌ చేసిన ఈ దుందుడుకు చర్యను ఎంతమాత్రం ఉపేక్షించరాదు. 'పశ్చిమ లక్షద్వీప్‌ సమీపంలోని ప్రత్యేక ఆర్థిక మండలి (ఇఇజెడ్‌)కి 130 నాటికల్‌ మైళ్ల దూరంలోని భారతీయ సముద్ర జలాల్లో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే తన సప్తమాంగ దళానికి చెందిన క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక 'యుఎస్‌ఎస్‌ జాన్‌పాల్‌ జోన్స్‌' ప్రవేశించిందని, భారత్‌ మితిమీరి కోరుతున్న ప్రాదేశిక జలాల హక్కును సవాల్‌ చేయడానికే ఈ చర్య చేపట్టామని' అమెరికన్‌ నేవీ ఈ నెల 7న చేసిన ప్రకటన చాలా మందిని షాక్‌కు గురి చేసింది. దీనికి దీటుగా జవాబివ్వాల్సిన మోడీ ప్రభుత్వం రెండు రోజుల తరువాత తీరికగా స్పందించింది. ఆ స్పందన కూడా పేలవంగా ఉంది. అమెరికాకు నొప్పి కలిగించని రీతిలో భారత ప్రభుత్వ స్పందన ఉన్నది. దేశ సార్వభౌమత్వాన్ని బాహాటంగా సవాల్‌ చేసేవారికి, అదే రీతిలో దీటుగా సమాధానం చెప్పాలి. అమెరికా చర్య తప్పు అని గట్టిగా చెప్పడానికి ఎందుకింత జంకో అర్థం కావడం లేదు. 1982లో సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కుదిరిన ఒప్పందం (యుఎన్‌సిఎల్‌ఓఎస్‌) 'ఒక దేశ ప్రత్యేక ఆర్థిక మండలి లేదా కాంటినెంటల్‌ జోన్‌ పరిధిలోని సముద్ర జలాల్లోకి మరో దేశ యుద్ధ నౌకలు ప్రవేశించాలంటే, ముందస్తు అనుమతి తప్పనిసరి' అని చెబుతోంది. ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించిన అమెరికా ఇప్పుడు ఈ ఒప్పందానికి అనుగుణంగానే 'స్వేచ్ఛాయుత నావికా యానం' చేపట్టానని అనడం హాస్యాస్పదం. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని చైనాతో సహా 19 దేశాల ప్రాదేశిక జలాల్లోకి అమెరికా యుద్ధ నౌకలు ఈ మధ్య తరచూ ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని ఎవరు సవాల్‌ చేసినా సహించేది లేదని బెదిరించడమే అమెరికా చర్యల ఉద్దేశం. దీనికి చైనా వంటి దేశాల నుంచి గట్టిగానే ప్రతిఘటన ఎదురవుతున్నది.
   1971లో బంగ్లాదేశ్‌ విముక్తి కోసం యుద్ధం సాగుతున్న సమయంలో భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా సప్తమాంగ దళానికి చెందిన యుద్ధ నౌకలు బంగాళాఖాతం లోకి ప్రవేశించాయి. భారత్‌కు మద్దతుగా నాటి సోవియట్‌ యూనియన్‌ జలాంతర్గాములు రంగంలోకి దిగేసరికి అమెరికా తోక ముడిచింది. ప్రపంచంపై అమెరికా ఆధిపత్యానికి పెద్ద సవాల్‌గా నిలిచిన చైనాను దెబ్బ తీసేందుకు ఇండో-పసిఫిక్‌ వ్యూహాన్ని అది ముందుకు తెచ్చింది. దీనిలో భాగంగానే క్వాడ్‌ కూటమిని ఏర్పాటు చేసింది. అమెరికాతో వ్యూహాత్మక పొత్తును అన్ని రంగాలకు విస్తరించిన మోడీ ప్రభుత్వం, క్వాడ్‌ లోనూ భాగస్వామి అయింది. ఈ పొత్తులు, కూటములు అమెరికా ప్రయోజనాల కోసం ఉద్దేశించినవే తప్ప మరొకటి కాదు అని తాజా పరిణామం మరోసారి రుజువు చేసింది. అమెరికాకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు భారత్‌లో పర్యటించి వెళ్లిన కొద్ది రోజులకే అమెరికా నేవీ ఈ దుస్సాహసానికి పాల్పడింది. ఇప్పుడు కూడా అమెరికా ఆగడాలను గట్టిగా ప్రశ్నించకపోతే దేశ సార్వభౌమత్వమే ప్రమాదంలో పడుతుంది.
   స్వేచ్ఛాయుత నావికా యానం పేరుతో ఆసియా-పసిఫిక్‌ ప్రాంత దేశాల హక్కును సవాల్‌ చేసేలా అమెరికా తీసుకొస్తున్న సూత్రీకరణలు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచడానికే దారి తీస్తాయి. దేశ ప్రాదేశిక జలాలపై మనం ఇంతకాలం అనుభవిస్తున్న హక్కులను కాపాడుకునే విషయంలో ఎలాంటి రాజీ పనికిరాదు. ఈ విషయాన్ని భారత్‌ స్పష్టంగా తేల్చి చెప్పాలి. అదే సమయంలో ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతిని పరిరక్షించేందుకు క్వాడ్‌ కూటమి నుంచి భారత్‌ బయటకు రావాలి. అవసరమైతే బ్రిక్స్‌లో భాగస్వాములుగా ఉన్న రష్యా, చైనాలను కలుపుకుని అమెరికా విసిరిన సవాల్‌ను తిప్పికొట్టాలి. అమెరికా బాహాటంగా చేసిన సవాల్‌ను తిప్పికొట్టడంలో మోడీ ప్రభుత్వం ఎలాంటి శషబిషలకు తావు లేకుండా దృఢంగా వ్యవహరించలేకపోవడం సిగ్గు చేటు. మన దేశ స్వాతంత్య్రాన్ని అమెరికా ఇంత కండకావరంతో సవాలు చేస్తే గట్టిగా స్పందించే దమ్ము లేని ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా సాగనంపితే దేశానికి అంత మంచిది.