Sep 14,2021 22:21

చిన్న వయసులోనే వివాహం, కొన్నేళ్లకే భర్త మరణం. ఆ షాక్‌ నుంచి కోలుకోకముందే ఫ్యాక్షన్‌ తగాదాల్లో తోడబుట్టిన అన్నలిద్దరి మరణం. ఇన్ని ఉపద్రవాలు వరసగా చుట్టుముట్టాయి. అయినా ఆమె ఏడుస్తూ కూర్చోలేదు. తన జీవితం మెరుగుపర్చుకునేందుకు తనకాళ్లపై తానే నిలబడాలనుకుంది. తండ్రి చూపిన బాటనే తన భవిష్యత్తు మార్గంగా ఎంచుకుంది. ఆ దారిలో ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె జుబేదా (45).

కర్నూలు జిల్లా తడకనపల్లి గ్రామనివాసి అయిన జుబేదా 50 ఏళ్ల క్రితం తండ్రి ప్రారంభించిన పాలకోవా వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించింది. నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన 'కాటిల్‌ హాస్టల్‌' (బర్రెల హాస్టల్‌) నిర్వహణలో ముందుకు దూసుకుపోతూ దేశంలోనే రెండవ స్థానంలో నిలిచేంత స్థాయికి దాన్ని తీసుకొచ్చారు.


తడకనపల్లి పాలకోవాకు దేశవిదేశాల్లో మంచి గిరాకీ ఉంది. కోవా ప్రియులకు ఆ గ్రామం పేరు సుపరిచతమే. చాలా మధురంగా తయారుచేస్తారు ఆ గ్రామస్తులు. కోవా తయారీ అక్కడ కుటీర పరిశ్రమగా వర్థిల్లుతోంది. ముఖ్యంగా మహిళలు ఇందులో భాగమై స్వయంసంవృద్ధిని సాధించారు. గ్రామం మొత్తం 650 కుటుంబాలు ఉంటే వంద కుటుంబాలకు పైగా పాలకోవా నిర్వహణలో, 'కాటిల్‌ హాస్టల్‌' అభివృద్ధిలో భాగమయ్యాయి. 30 కుటుంబాలు పాలకోవా తయారీలో ఉంటే 50 నుంచి 60 కుటుంబాలు కోవా వ్యాపారంలో ఉన్నాయి. రోజుకు 3 వేల లీటర్ల పాలు పోగుచేసి ఒక్కొక్క కుటుంబం తమ శక్తికొలదీ 100 నుంచి 1000 కేజీల పాలకోవా తయారుచేస్తారు.

ఆమె వెనుక కొండంత ఐకమత్యం


కాటిల్‌ హాస్టల్‌ ఇలా రూపుదిద్దుకొంది...
జుబేదా స్వస్థలం తడకనపల్లి. వివాహమై చిన్నగుట్టల గ్రామానికి వెళ్లినా ఆర్థిక పరిస్థితులు సహకరించని కారణంగా ఏడాది కాలానికే స్వగ్రామం చేరుకున్నారు. 2000లో భర్త చనిపోయారు. అప్పటికి పిల్లలు చిన్నవాళ్లు. భర్త షరీప్‌ ఉండగానే ఆమె పాలకోవా వ్యాపారాన్ని ప్రారంభించారు. అప్పటికి జుబేదా తండ్రి రోజుకు 5 నుంచి 6 కేజీల కోవానే తయారుచేసేవారు. కాని జుబేదా వ్యాపారంలోకి అడుగుపెట్టాక మహిళలందరూ సంఘటితంగా ఈ వ్యాపారం చేసేలా ప్రోత్సహించారు. ప్రస్తుతం గ్రామస్తులంతా రోజుకు 3 వేల కేజీలకు పైగా కోవా తయారుచేస్తున్నారు. గ్రామంలో ఉన్న మహిళలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆమె చొరవ ఎంతోవుంది. మహిళలంతా గ్రూపులుగా ఏర్పడి స్వయంసంవృద్ధిని సాధిస్తూ ఉండగానే 2016లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో 'కాటిల్‌ హాస్టల్‌' గురించి తెలిసింది. దాని నిర్వహణ దేశంలో ఒక్కచోటే ఉందని, మీ గ్రామస్తులు దాన్ని అవలంబిస్తే బాగుంటుంద'ని అధికారులు ఇచ్చిన సూచనతో 2017లో 'కాటిల్‌ హాస్టల్‌' ప్రారంభించారు జుబేదా.


అప్పటి జిల్లా కలెక్టరు విజయ మోహన్‌ గ్రామస్తుల అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి 10 ఎకరాల ప్రభుత్వ స్థలంలో 'కాటిల్‌ హాస్టల్‌' నిర్వహణ చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. అందుకవసరమైన రుణం సమకూర్చారు. అలా 9 ఎకరాల్లో పశువులకు కావాల్సిన మేత పండించుకోవడం, ఎకరంలో షెడ్‌ నిర్మాణం, బోర్లు, గోడౌన్‌ వంటి ఏర్పాట్లు చకచకా జరిగాయి.
గ్రామంలో పశువుల పోషణకు సరైన స్థలం లేని వారంతా ఈ 'కాటిల్‌ హాస్టల్‌'లో తమ పశువులను సంరక్షించుకుంటుంటారు. వాటి నిర్వహణ, మేత సాగు అంతా వారే స్వయంగా చేసుకుంటారు. మొత్తం 30 కుటుంబాల వారు ఇక్కడ తమ పశువులను పోషించుకుంటున్నారు. తమ పశువులకు కావాల్సిన మేతను ఎవరికి వారే స్వయంగా పండించుకుంటున్నారు. ఈ గ్రామంతో పాటు మరో రెండు గ్రామాల్లో కూడా 'బర్రెల హాస్టల్‌'కు అనుమతి వచ్చినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. తడకనపల్లి గ్రామం మాత్రం హాస్టల్‌ నిర్వహణలో గర్వించదగ్గ స్థాయికి చేరుకుంది. మహిళలకు ఉపాధి మార్గంగా ఉండడంతో నేటికీ ఎంతోమంది అక్కడ తమ జీవితాలను మెరుగులద్దుకుంటున్నారు. తమ ప్రాంతాన్ని కరువు కాటకాల నుంచి బయటపడేయడమే కాక మహిళా సాధికారతకు కృషి చేసిన జుబేదాకు పలు సత్కారాలు లభించాయి. మహిళలను సంఘటితంగా ముందుకు నడపడంలో 25 ఏళ్లు పూర్తిచేసినందుకు నాబార్డ్‌ నుంచి ఆమెకు జాతీయ అవార్డు కూడా దక్కింది.

ఈ విజయం గ్రామ మహిళలందరిదీ
మా గ్రామంలో 5వ తరగతి వరకే స్కూలు ఉంది. నేను కూడా అంతవరకే చదివాను. చిన్న వయసులోనే పెళ్లి, పిల్లలు. నాలాంటి పరిస్థితే మా గ్రామంలో ఎందరో ఆడవాళ్లది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామంలోని మహిళలమంతా ఏకమై మా ఉపాధి మేమే సంపాదించుకున్నాం. ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదురయ్యాయి. 'మీరంతా మహిళలు. ఇంట్లో తిని కూర్చోక హాస్టల్‌ నిర్వహణ, బర్రెల పోషణ మీకెందుకు' అంటూ మాపై నిందలు వేశారు. స్థలం కేటాయింపులో అవాంతరాలు సృష్టించారు. ఇన్ని చేసినా మమ్మల్ని, మేము చేస్తున్న పనిని నమ్మి అధికారులు మాకు సాయంగా నిలబడ్డారు. గ్రామంలో చాలామంది రాళ్లు కొట్టే పనికి వెళతారు. మహిళలు కూడా ఈ పనులు చేస్తారు. ఇప్పుడు వారిలో చాలామంది కోవా తయారీలో భాగమయ్యారు. గ్రామంలో ఇప్పుడు ప్రాథమికోన్నత పాఠశాల కూడా సాధించుకున్నాం. ఒకప్పుడు ఫ్యాక్షన్‌ తగాదాల్లో నా తోడబుట్టిన వాళ్లని కోల్పోయాను. కాని ఇప్పుడు గ్రామంలో ఎక్కడా ఆ ఛాయలు కనిపించడం లేదు. మహిళలు సాధికారత సాధించడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ విజయం మా గ్రామ మహిళలందరిదీ!
- జుబేదా